Sandeep Patil: కోహ్లీ-బీసీసీఐ మధ్య చెడినట్టుగా ఉంది!

ABN , First Publish Date - 2021-09-18T23:26:52+05:30 IST

చూస్తుంటే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య పెద్ద అగాధమే ఉన్నట్టు అనిపిస్తోందని మాజీ సెలక్టర్

Sandeep Patil: కోహ్లీ-బీసీసీఐ మధ్య చెడినట్టుగా ఉంది!

న్యూఢిల్లీ: చూస్తుంటే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య పెద్ద అగాధమే ఉన్నట్టు అనిపిస్తోందని మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకుంటానని ప్రకటించడం వెనక ఈ కారణమే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.  


‘‘చూస్తుంటే బీసీసీఐ, కోహ్లీ మధ్య చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తోంది. కోహ్లీ ఒకటి చెబితే, బీసీసీఐ మరోటి చెబుతుందని అనుకోలేం. ఇది పూర్తిగా విరాట్ నిర్ణయమే. బీసీసీఐ దానిని అంగీకరించిందంతే’’ అని పాటిల్ చెప్పుకొచ్చాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పాటిల్ 2012-16 మధ్య బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వ్యవహరించాడు. టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకునేందుకు రోహిత్‌కు మించిన ఆటగాడు మరొకరు లేరని పేర్కొన్నాడు. 


ఇండియన్ క్రికెట్‌కు కోహ్లీ గొప్ప ఆస్తి అని పేర్కొన్న పాటిల్.. అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని కొనియాడాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని వివరించాడు. టీ20 కెప్టెన్‌గా కోహ్లీ అద్భుత ప్రతిభ కనబరిచాడని ప్రశంసించాడు. రానున్న ప్రపంచకప్ కోసం అతడికి ఆల్‌ది బెస్ట్ చెబుదామని అన్నాడు. భారత్ కోసం అతడు పరుగులు చేస్తూనే ఉండాలని సందీప్ పాటిల్ ఆకాంక్షించాడు. 

Updated Date - 2021-09-18T23:26:52+05:30 IST