‘స్విఫ్ట్‌’ను పరీక్షించిన భారత్‌

ABN , First Publish Date - 2021-10-28T08:37:39+05:30 IST

స్వదేశీ పరిజ్ఞానంతో మానవ రహిత యుద్ధ విమానం ‘ఘాతక్‌’ను తయారు చేయాలనే భారత్‌ సంకల్పం మరో మూడేళ్లలో...

‘స్విఫ్ట్‌’ను పరీక్షించిన భారత్‌

స్వదేశీ మానవరహిత యుద్ధ విమానం తయారీ దిశగా తొలి అడుగు


బెంగళూరు, అక్టోబరు 27 : స్వదేశీ పరిజ్ఞానంతో మానవ రహిత యుద్ధ విమానం ‘ఘాతక్‌’ను తయారు చేయాలనే భారత్‌ సంకల్పం మరో మూడేళ్లలో సాకారం కానుంది. ఆ దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తొలి అడుగు వేసింది. ‘ఘాతక్‌’కు తొలి నమూనాగా భావిస్తున్న మానవ రహిత యుద్ధ విమానం (యూసీఏవీ) ‘స్విఫ్ట్‌’ను డీఆర్‌డీవో ఇటీవల పరీక్షించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏవియేషన్‌ టెస్ట్‌ స్టేషన్‌లో స్విఫ్ట్‌ను పరీక్షించారని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న డీఆర్‌డీఓ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


13 అడుగుల పొడవు ఉండే స్విఫ్ట్‌ యూసీఏవీ రెక్కలు 16 అడుగుల సైజులో ఉంటాయని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. దీని మొత్తం బరువు దాదాపు 1043 కేజీలు ఉంటుందని తెలిపారు. కాగా, ఘాతక్‌ ప్రాజెక్టును భారత్‌ పదేళ్ల క్రితం ప్రారంభించింది. తాజాగా ప్రయోగించిన స్విఫ్ట్‌ యూసీఏవీకి సంబంధించిన నమూనాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఈ), ఐఐటీ కాన్పూర్‌లు సంయుక్తంగా తయారుచేసి తొలిసారిగా 2018 సంవత్సరంలోనే ప్రదర్శించాయి. భవిష్యత్తులో స్విఫ్ట్‌ యూసీఏవీకి కొనసాగింపుగా తయారుచేయనున్న ఘాతక్‌ మానవ రహిత యుద్ధ విమానం సైజులో మరింత పెద్దగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

Updated Date - 2021-10-28T08:37:39+05:30 IST