IND vs WI: మూడో వన్డే కూడా మనదే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు అదొక్కటే అసంతృప్తి..

ABN , First Publish Date - 2022-07-28T10:16:32+05:30 IST

వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన మూడో వన్డేలో (IND vs WI third ODI) టీమిండియా 119 పరుగుల తేడాతో ఘన విజయం (India Won) సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్(DLS) పద్ధతిలో 35 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో..

IND vs WI: మూడో వన్డే కూడా మనదే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు అదొక్కటే అసంతృప్తి..

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన మూడో వన్డేలో (IND vs WI third ODI) టీమిండియా 119 పరుగుల తేడాతో ఘన విజయం (India Won) సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్(DLS) పద్ధతిలో 35 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విన్నర్‌గా నిలిచింది. 3-0తో వన్డే సిరీస్‌ను (3-0 ODI Series) టీమిండియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో వెస్టిండీస్ (West Indies) జట్టు బ్యాటింగ్ ఆడాల్సి వచ్చింది. DLS విధానంలో విండీస్ 35 ఓవర్లలో 257 పరుగులు చేస్తేనే విజేతగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఈ లక్ష్య సాధనలో విండీస్ జట్టు చతికిలపడింది. 26 ఓవర్లకు 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కావడంతో విండీస్‌కు క్లీన్‌స్వీప్ (Clean Sweep) తప్పలేదు. ఓపెనర్ మేయర్స్‌ను (Kyle Mayers) సిరాజ్ (Siraj) క్లీన్‌బౌల్డ్‌గా సాగనంపడంతో విండీస్ ఓపెనర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్రూక్స్ (Shamarh Brooks) కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. రెండో ఓవర్ ముగిసే లోపే రెండు కీలక వికెట్లను కోల్పోయి వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది.



బ్రాడన్ కింగ్ (Brandon King), విండీస్ కెప్టెన్ పూరన్ (Pooran) చెరో 42 పరుగులు చేసి నిలకడగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ విండీస్‌కు ఓటమి తప్పలేదు. అక్సర్ పటేల్ (Axar Patel) బౌలింగ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్రాడన్ కింగ్ క్లీన్ బౌల్డ్ కావడం, ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో ధావన్‌కు (Dhawan) క్యాచ్‌గా చిక్కి 42 పరుగులు చేసిన పూరన్ కూడా ఔట్ కావడంతో విండీస్ ఓటమి అప్పటికి ఖాయమైంది. హోప్ కూడా ఈ మ్యాచ్‌లో 22 పరుగులకే చేతులెత్తేసి విండీస్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు ధావన్, గిల్ (Gill) శుభారంభాన్ని అందించారు. ధావన్ 74 బంతుల్లో 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 98 పరుగులు చేసి వర్షం కారణంగా రెండో సారి కూడా మ్యాచ్ నిలిచిపోవడంతో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నాటౌట్‌గా నిలిచాడు.



వర్షం ఆగాక.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్‌కు టార్గెట్ ఫిక్స్ చేయడంతో గిల్‌కు సెంచరీ జస్ట్ మిస్ అయింది. ఈ పరిణామం టీమిండియా ఫ్యాన్స్‌ను కొంత అసంతృప్తికి గురిచేసింది. ధావన్‌ను హేడెన్ వాల్ష్ ఔట్ చేశాడు. వాల్ష్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌గా చిక్కడంతో ధావన్ ఔట్ అయ్యాడు. అయితే.. అప్పటికే ధావన్, గిల్ కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ కూడా 44 పరుగులతో రాణించాడు. హోస్సేన్ బౌలింగ్‌లో కీమో పాల్‌కు క్యాచ్‌గా చిక్కడంతో శ్రేయాస్ ఇన్నింగ్స్ ముగిసింది. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. 8 పరుగులు మాత్రమే చేసి వాల్ష్ బౌలింగ్‌లో బ్రూక్స్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. విండీస్ బౌలర్లలో వాల్ష్‌కు రెండు వికెట్లు, హొస్సేన్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లలో చాహల్‌ నాలుగు వికెట్లతో రాణించగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. అక్సర్ పటేల్, ప్రసీద్ కృష్ణ చెరో వికెట్ తీశారు. మూడు వన్డేల్లో బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి 205 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ (Man Of The Match), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (Player Of The Series) సొంతమయ్యాయి.



మొత్తంగా వెస్టిండీస్‌తో టీమిండియా ఆడిన మూడు వన్డేల్లో మొదటి రెండు మ్యాచులు ఎవరు గెలుస్తారా అన్నంతలా చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠగా సాగితే.. మూడో మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా చప్పగా సాగింది. శ్రేయాస్ అయ్యర్, గిల్ లాంటి బ్యాట్స్‌మెన్స్ మంచి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభ పరిణామం. మూడు వన్డే మ్యాచుల్లోనూ ఏకపక్ష విజయం సాధించి విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండో వన్డేలో అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ (WI vs IND T20 Series) కోసం భారత జట్టు మంగళవారం ట్రినిడాడ్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, పంత్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌తో కూడిన పూర్తిస్థాయి జట్టు శుక్రవారం నుంచి జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్న రాహుల్‌ ఈ సిరీస్‌ ఆడే విషయంలో సందేహం నెలకొంది. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ టీ20లకు కూడా దూరంగా ఉన్నాడు.

Updated Date - 2022-07-28T10:16:32+05:30 IST