మిడిల్‌ మెరుగైతేనే..?

ABN , First Publish Date - 2022-09-20T09:42:24+05:30 IST

ఆసియాకప్‌ పరాభవం తర్వాత భారత జట్టు ఇప్పుడు మరో టీ20 సిరీస్‌ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది.

మిడిల్‌ మెరుగైతేనే..?

సవాల్‌గా బౌలింగ్‌ కూర్పు 

నేటి నుంచి ఆసీస్‌తో భారత్‌ టీ20 సిరీస్‌

రాత్రి 7.30  నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత్‌ ఆడే మ్యాచ్‌లు ఆరు మాత్రమే.  సమయం తక్కువగా ఉండడంతో ఈలోపే తమ కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టతకు రావాల్సిందే. ఎందుకంటే జట్టులో ఇప్పటికీ పలు సమస్యలున్నాయి. అందుకే ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో ఈ మ్యాచ్‌లు టీమిండియాకు అత్యంత కీలకం కానున్నాయి. కొన్ని నెలల తర్వాత పూర్తి స్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న జట్టును మిడిలార్డర్‌తో పాటు ఆరో బౌలర్‌ సమస్య కూడా వేధిస్తోంది. అన్ని లోపాలను సరిచేసుకుని సిరీ్‌సతో పాటు మెగా టోర్నీకి కూడా సిద్ధంగా ఉండాలనే ఆలోచనలో రోహిత్‌ సేన ఉంది.


2 రోహిత్‌ (171) మరో రెండు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ  సిక్సర్లు బాదిన ఆటగాడిగా గప్టిల్‌ (172)ను అధిగమిస్తాడు.


మొహాలీ: ఆసియాకప్‌ పరాభవం తర్వాత భారత జట్టు ఇప్పుడు మరో టీ20 సిరీస్‌ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది. మంగళవారం స్థానిక పీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఈ సిరీ్‌సను ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలనుకుంటోంది. అలాగే జట్టులోని సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు సరైన కాంబినేషన్‌ను రూపొందించుకునే ఆలోచనలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికి 23 మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ 13, ఆసీస్‌ 9 మ్యాచ్‌లను గెలుచుకుంది. ఒకదాంట్లో ఫలితం రాలేదు.


తుది కూర్పు సమస్యగా..:

ఆసియాక్‌పలో భారత బ్యాటింగ్‌ ఫర్వాలేదనిపించినా మితిమీరిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. అలాగే బౌలింగ్‌లో బలహీనత కనిపించింది. కానీ ఈ సిరీ్‌సకు స్టార్‌ పేసర్లు బుమ్రా, హర్షల్‌ల రాకతో ఈ విభాగం బలం పుంజుకుంది. మెగా టోర్నీలో తనతోపాటు రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని కెప్టెన్‌ రోహిత్‌ చెప్పగా.. ఈ సిరీ్‌సలో మాత్రం కోహ్లీని పరీక్షించే అవకాశం లేకపోలేదు. తన చివరి మ్యాచ్‌లో శతకం బాదిన కోహ్లీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అలాగే రాహుల్‌ స్లో బ్యాటింగ్‌ విమర్శల పాలవుతోంది. టాప్‌-4లో ఇబ్బంది లేకున్నా.. ఆ తర్వాత 5,6,7 స్థానాలపైనే తర్జనభర్జన సాగుతోంది.


ఇందులో హార్దిక్‌ ఆరో స్థానంలో రావడం పక్కా కాగా, పంత్‌-దినేశ్‌ కార్తీక్‌లలో ఎవరిని ఆడించాలనేదే సవాల్‌గా మారింది. అయితే జడేజా గైర్హాజరు కారణంగా పంత్‌ ఏకైక లెఫ్ట్‌ హ్యాండర్‌ కాగా.. ఫినిషర్‌గా డీకే ప్రభావం చెప్పాల్సిన పని లేదు. అలాగే అక్షర్‌, దీపక్‌ హుడాపైనా స్పష్టతకు రావాల్సి ఉంది. ఆసియా కప్‌ సూపర్‌-4లో అన్ని మ్యాచ్‌లు ఆడినా హుడా ప్రభావం చూపలేదు. జడ్డూ గాయంతో ఆసియాక్‌పలో బౌలింగ్‌పై పెద్ద దెబ్బ పడింది. దీంతో ఐదుగురు బౌలర్లతోనే ఆడాల్సి వచ్చింది. హార్దిక్‌, అక్షర్‌ ఇద్దరినీ ఆడిస్తే జట్టుకు ఆరో బౌలర్‌ ఆప్షన్‌ ఉంటుంది. అప్పుడు అక్షర్‌, చాహల్‌ స్పిన్నర్లుగా.. బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌, పాండ్యా పేసర్లుగా ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు.


కోహ్లీని తక్కువ అంచనా వేయలేం

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తెలిపాడు. గత 15 ఏళ్లుగా అతడు సాధించిన రికార్డులే ఈ విషయాన్ని గుర్తు చేస్తాయని ఫించ్‌ అన్నాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. టీ20ల్లో అతడు ఆటను మలుచుకున్న విధానం అద్భుతం. కెరీర్‌లో 71 సెంచరీలు సాధించడం అంటే మామూలు విషయం కాదు’ అని ఫించ్‌ పేర్కొన్నాడు.


స్టార్లు లేకుండానే..:

కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసీస్‌ జట్టు భారత్‌ వచ్చింది. ఓపెనర్‌ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా పేసర్లు స్టార్క్‌, స్టొయినిస్‌, మార్ష్‌కు గాయాలయ్యాయి. కెప్టెన్‌ ఫించ్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే వన్డేలకు గుడ్‌బై చెప్పిన అతడు ఈ సిరీస్‌తో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక, డాషింగ్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ అరంగేట్రానికి ఎదురుచూస్తున్నాడు. విదేశీ లీగ్‌ల్లో భారీ షాట్లతో విరుచుకుపడే టిమ్‌తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. 


తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, చాహల్‌.


ఆస్ట్రేలియా:

ఫించ్‌ (కెప్టెన్‌), ఇన్‌గ్లి్‌స, స్టీవెన్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, మాథ్యూ వేడ్‌, కమిన్స్‌, సామ్స్‌, హాజెల్‌వుడ్‌, జంపా, రిచర్డ్‌సన్‌. 


పిచ్‌

బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 178. మధ్య ఓవర్లలో పేసర్లు కీలకమవుతారు. అయితే ఛేదన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Updated Date - 2022-09-20T09:42:24+05:30 IST