Air Space పై పాక్‌తో దౌత్య చర్చలు

ABN , First Publish Date - 2021-11-05T21:38:19+05:30 IST

శ్రీనగర్-షార్జా విమానానికి పాకిస్థాన్ మోకాలడ్డడం, ఎయిర్‌ స్పేస్ ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వం..

Air Space పై పాక్‌తో దౌత్య చర్చలు

న్యూఢిల్లీ: శ్రీనగర్-షార్జా విమానానికి పాకిస్థాన్ మోకాలడ్డడం, ఎయిర్‌ స్పేస్ ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీనగర్ నుంచి నేరుగా షార్జాకు వెళ్లే విమానాలకు గగనతల ప్రవేశాన్ని పాక్ ఇటీవల మూసివేసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పాకిస్తాన్‌ను భారత్ ప్రభుత్వం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దౌత్య వర్గాల ద్వారా ఈ ప్రక్రియ సాగిస్తున్నట్టు చెప్పాయి.


ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విమానాలను నడుపుతున్నందున పాక్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు. శ్రీనగర్ నుంచి షార్జా వెళ్లే మొదటి నాలుగు విమానాలను..అక్టోబర్ 23,34,26,28 తేదీల్లో తమ గగనతలం నుంచి వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతించినప్పటికీ, అక్టోబర్ 30 నుంచి నెలరోజుల పాటు అనుమతిని రద్దు చేసింది. గో ఫస్ట్ నడిపే జీ8 -1595 విమాన సర్వీసులను అక్టోబర్ 23న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత నెలలో జమ్మూకశ్మీర్ పర్యటన సందర్భంలో ప్రారంభించారు. జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత అక్కడ అమిత్‌షా పర్యటించడం కూడా ఇదే మొదటిసారి.


కాగా, శ్రీనగర్-షార్జా విమానానాకి అనుమతి నిరాకరించిన విషయం గత బుధవారం వెలుగుచూసింది. సాంకేతిక కారణాలే సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతి నిరాకరించడానికి కారణం కావచ్చని పాక్ విదేశాంగ ప్రతినిధఇ అసిం ఇఫ్తికార్ అహ్మద్ తెలిపారు. సరైన గ్రౌండ్ వర్క్ చేయకుండా విమాన సర్వీసులు తేవడం వల్లే పాక్ తమ గగనతలం మూసేసిందంటూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించగా, ఇది దురదృష్టకర ఘటన అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

Updated Date - 2021-11-05T21:38:19+05:30 IST