Abn logo
Jun 2 2020 @ 00:46AM

విశ్వగురువుగా భారత్

కేవలం యోగా, ధ్యానం, ఆయుర్వేద, సాంస్కృతిక రంగాల్లో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఒక మార్కెట్ స్థావరంగా, పెట్టుబడులకు కేంద్రంగా భారత దేశం మారేందుకు తగిన పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయి. కొవిడ్ -19 మూలంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన ప్రపంచ దేశాల అవసరాలను తీర్చే మాతృమూర్తిగా భారత దేశం అవతరించనున్నదనడంలో సందేహం లేదు.


అంతర్జాతీయ సంబంధాలు ఒక దేశ ఔన్నత్యాన్ని ఏ విధంగా పెంచగలవో స్వామి వివేకానంద, రవీంద్ర నాథ్ టాగోర్, అరబిందో వంటి మహానుభావులు నిరూపించారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంపద ప్రపంచ దేశాలను ఎప్పుడూ విస్మయంలో ముంచెత్తుతూనే ఉన్నది. ఎన్ని విదేశీ దాడులకు గురైనా, రెండువందల సంవత్సరాలకు పైగా వలస పాలనలో ఉన్నా భారత దేశం తన మౌలిక సాంస్కృతిక స్వరూపం చెక్కు చెదరకుండా ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో భారత దేశం తన సాంస్కృతిక ఉనికిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం అందించే స్థాయికి ఎదిగింది.


ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచానికి భారత దేశం విశ్వ గురువుగా మారే పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయి. కేవలం యోగా,ధ్యానం, ఆయుర్వేద, సంస్కృతి రంగాల్లోమాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఒక మార్కెట్ స్థావరంగా, పెట్టుబడులకు కేంద్రంగా భారత దేశం మారేందుకు తగిన పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయి. కొవిడ్ -19 మూలంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన ప్రపంచ దేశాల అవసరాలను తీర్చే మాతృమూర్తిగా భారత దేశం అవతరించనున్నదనడంలో సందేహం లేదు. మశూచి, పోలియో వంటి వ్యాధు లను నిశ్శబ్దంగా నిర్మూలించగలిగిన భారతదేశం కరోనా వైరస్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థఅధికారి మైకేల్ జె ర్యాన్ వ్యాఖ్యానించారు. 


ఒక బలమైన నాయకుడు, బలమైన విధానం, స్థిరమైన ప్రభుత్వం ఉంటే ప్రపంచమంతా గౌరవిస్తుందన్న విషయంమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత స్పష్టమైంది. ఒకప్పుడు పాకిస్థాన్ఏది చేసినా చెల్లేది. కాని పుల్వామాఘటన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారత్ కు అండగా నిలబడ్డాయి.మోదీ దౌత్య నీతిసాధించిన విజయమది. ఒకదీర్ఘకాలిక వ్యూహంతో నరేంద్రమోదీ వర్తకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉత్పత్తి, సాంకేతిక సహకారం మొదలైన రంగాల్లో వివిధ దేశాలతోసంబంధాలు పెట్టుకోగలిగారు. సుడిగాలి పర్యటనలు, కిక్కిరిసిపోయిన స్టేడియం సభలు, సెల్ఫీలు, వ్యాపారవేత్తలు, ప్రపంచ నేతలతో సమావేశాలతో మోదీ అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేయగలిగారు. సౌదీ అరెబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలతో ప్రధానమంత్రి సంబంధాలు పెట్టుకోగలగడం ఆయన విదేశాంగ విధానంలో సాహసోపేత ఘట్టానికి నిదర్శనం.గల్ఫ్ దేశాలతో సంబంధాలు కేవలం ఇంధన అవసరాలకోసమే కాక దీర్ఘ కాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు అవసరమని గ్రహించిన మోదీ అందుకు తగ్గట్లుగా పావులు కదిపారు. అదే సమయంలో జపాన్ కు స్నేహహస్తం చాచి జపాన్ ప్రధాని షింజో అబేతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పర్చుకుని ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని వేగవంతం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా దూకుడును అరికట్టి దారికి తీసుకువచ్చేందుకు ఈ సంబంధాలు ఇరు దేశాలకూ ఉపయోగపడతాయని మోదీకితెలుసు. అదే సమయంలోఅమెరికా,భారత దేశ అత్యంత ప్రధానమైన వ్యూహాత్మక భాగస్వామిగా మారింది.


ప్రపంచ దేశాలు భారత్ పట్ల ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఇందుకు ఒకటే కారణం. మోదీ విదేశాంగ విధానం పూర్తిగా భారత్ ను ఆర్థికంగా బలోపేతం చేయడంకోసం రూపొందించింది కావడమే.ప్రపంచ దేశాలు భారత దేశంతో వ్యాపార లావాదేవీలుసులభంగా చేసేందుకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అవసరమైన చర్యలన్నీ ఆయన తీసుకున్నారు. మారుతున్న పరిస్థితులను ఎంతో ముందుగా ఊహించినందువల్లే ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియాను ఆరేళ్ల క్రితమే ప్రకటించి భారత్ ను స్వావలంబన దిశగా నడిపిస్తూవచ్చారు. ఇవాళ ప్రధాని ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రకటించడానికి ప్రధాన కారణం భారత దేశాన్ని ఉత్పాదక రంగ కేంద్రంగా మార్చాలనుకోవడమే. ఇప్పటి వరకూ ఉత్పాదక రంగాన్ని శాసిస్తూ వచ్చిన చైనా అంతర్జాతీయంగా బలహీనపడడాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ వేగంగా చర్యలు ప్రారంభించారు.


సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగానికి రూ. 3 లక్షల కోట్ల మేరకు ప్యాకేజీని ప్రకటించడమే కాదు, భారీ ఎత్తున రుణ కల్పన చేయాలనుకోవడం యథాలాపంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవాళ ఉత్పాదక రంగం అభివృద్దికి చైనాతో సమానంగా అవకాశాలున్న దేశం భారత దేశం అని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. భౌగోళిక విస్తీర్ణం, సామర్థ్యం, మేధో సంపద, చవకగా లభించే శ్రమ శక్తి మన వద్ద లభ్యమవుతున్నాయి.ప్రపంచంలో ఇంగ్లీషు అత్యధికంగా మాట్లాడే రెండవ దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అందువల్ల మోదీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ రంగానికి కల్పించిన ప్రోత్సాహకాలు ఉత్పాదక రంగంలో చైనాను అధిగమించేందుకు తీసుకున్న నిర్ణయంగాచెప్పక తప్పదు. భారత దేశంలో ఎంఎస్ ఎంఇ రంగం బలంగా ఉంటే చైనాను వివిధ వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించుకుంటున్న ప్రముఖ విదేశీ కంపెనీలన్నీ భారత్ వైపు దృష్టి మళ్లిస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే జపాన్, అమెరికా, యూరోపియన్ కంపెనీలు చైనా నుంచి భారత్ కు వచ్చేందుకు వీలుగా విదేశీ పెట్టుబడులనుఆకర్షించేందుకు సంబంధించిన విధానాలకు సరికొత్తగారూపకల్పన చేశారు. 


ఇటీవల ఆత్మనిర్భర్ప్యాకేజీ సందర్భంగా ప్రకటించిన సంస్కరణలు, ప్రైవేట్ రంగానికి, స్టార్ట్ అప్‌లకుపెద్ద పీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు మేక్ ఇన్ ఇండియాను పూర్తిగా విజయవంతం అయ్యేందుకు వీలుగా తీసుకున్నవే. ఒకరకంగా ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాకు పొడిగింపు మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థకు రెడ్ టేపిజమ్, అవినీతి అడ్డంకులు కాకుండా మోదీ వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పాదక రంగంలో చైనాను అధిగమిస్తే చైనాపై ఆధారపడుతున్న పాకిస్థాన్ మరింత తోకముడచక తప్పదు. అందుకే ఒకవైపు ఉత్పాదక రంగంలో చైనాను అధిగమించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూనే మోదీ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ దురాగతాలు ఆపేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇది తమ ప్రయోజనాలకు భంగకరమని భావిస్తున్నందువల్లే చైనా ఆందోళన చెందుతోంది. అదే సమయంలో భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యలనూ సహించబోమన్న సంకేతాలు మన ప్రభుత్వం పంపుతోంది. గతంలోలాగా రక్షణపరంగా భారత్ బలహీన దేశం కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఒంటరి కాదు. అయిదేళ్లలో మోదీ పెంచుకున్న స్నేహ సంబంధాల మూలంగా ప్రపంచంలో మెజారిటీ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.


ఉత్పాదక రంగం విషయంలోనే కాదు, ఆరోగ్య మౌలిక సదుపాయాలరంగంలో కూడా భారత్ ను స్వావలంబన దిశలో నడిపేందుకు మోదీ ఎన్నో చర్యలనువేగంగా తీసుకున్నారు. కరోనా విపత్తుకొత్తలో మన దేశంలో వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ కిట్స్ కొరత ఉండేవి. కాని ఈ సవాల్ నుమోదీ అవకాశంగామలుచుకున్నారు. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోఉన్న శాస్త్ర , సాంకేతిక సంస్థలనన్నిటినీ మోదీ ఒకే త్రాటిపై తీసుకువచ్చారు.ఒకప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన వైద్య పరికరాలనన్నీదాదాపుమన దేశంలో ఉత్పత్తి చేయగలుగుతున్నాం. 120 దేశాలకు ఇవాళ మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తున్నాం.


అంతర్జాతీయ సంస్థలతో ఒడంబడికలు ఏర్పర్చుకుని జాతీయ వ్యాక్సిన్ కార్యక్రమాన్నిఇప్పటికే మనం ప్రారంభించాం.భారత్ ఆర్థికంగా, ఉత్పాదక రంగ పరంగా బలోపేతం కావడం, ప్రపంచ దేశాలు మనకు అండగా నిలబడడం, మోదీ సారథ్యంలో మన దేశం విశ్వగురువుగా మారడం గమనిస్తున్న ప్రతిపక్షాలు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నాయి. పేదరికాన్ని, పేదల కష్టాన్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా అసమర్థ ప్రభుత్వంగా చిత్రించడం, దేశ వ్యతిరేకులను బలపరిచి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం ప్రతిపక్షాలు ఎప్పుడూచేస్తూనే ఉంటాయి. అయితేవాస్తవాలు తెలుసు కనుక ప్రజలు ఎప్పటికప్పుడు వాటికి గుణపాఠం చెబుతూ ఉంటారు.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement