ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌ : మోదీ

ABN , First Publish Date - 2022-02-05T22:10:37+05:30 IST

ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని

ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌ : మోదీ

హైదరాబాద్: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. నగరంలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.  సంస్థలో పనిచేసిన, చేస్తున్న ఉద్యోగులకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ప్రయాణం పెద్ద మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ మరింత ముందుకు సాగాలని మోదీ ఆకాక్షించారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. వాతావరణ మార్పుల అంశానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామన్నారు.


భారత్‌లో వ్యవసాయానికి విభిన్నమైన సంప్రదాయాలున్నాయన్నారు. భవిష్యత్‌ అంతా డిజిటల్‌ వ్యవసాయానిదేనిని మోదీ పేర్కొన్నారు. సహజ సేద్యం, డిజిటల్‌ వ్యవసాయానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. వ్యవసాయంలో భారత్‌ అత్యంత ప్రాచీన దేశమని మోదీ పేర్కొన్నారు. 80 శాతంపైగా ఉన్న సన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. నేచరల్‌ ఫార్మింగ్‌పై దృష్టి సారించాలన్నారు. రసాయన లేమీ ఆధునిక వ్యవసాయం వైపు సాగాలని మోదీ అన్నారు. 

Updated Date - 2022-02-05T22:10:37+05:30 IST