ట్రంప్‌ వాడిన కరోనా ఔషధానికి.. భారత్‌ ఆమోదం!

ABN , First Publish Date - 2021-05-09T17:34:44+05:30 IST

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరోనా సోకితే.. ప్రత్యేక యాంటీబాడీల మిశ్రమం (కాక్‌టెయిల్‌)తో చికిత్స అందించారు.

ట్రంప్‌ వాడిన కరోనా ఔషధానికి.. భారత్‌ ఆమోదం!

ట్రంప్‌ కరోనా చికిత్సకు వాడిన ఔషధం త్వరలోనే భారత మార్కెట్లోకి.. 

మార్కెటింగ్‌ కోసం సిప్లాతో ‘రోచే’ ఒప్పందం

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరోనా సోకితే.. ప్రత్యేక యాంటీబాడీల మిశ్రమం (కాక్‌టెయిల్‌)తో చికిత్స అందించారు. అది బాగా పనిచేయడంతో ఆయన చాలా త్వరగా కోలుకొని.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనగలిగారు. ఆ ప్రభావవంతమైన ఔషధం భారత్‌లోనూ వినియోగంలోకి రానుంది. దాని అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం స్విట్జర్లాండ్‌ ఫార్మా కంపెనీ రోచే సమర్పించిన దరఖాస్తుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) ఇటీవల ఆమోదం తెలిపింది. అమెరికాలో నిర్వహించిన ప్రయోగ పరీక్షల సమాచారం, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కమిటీ ఫర్‌ మెడిసినల్‌ ప్రోడక్ట్స్‌ ఫర్‌ హ్యూమన్‌ యూజ్‌ (సీహెచ్‌ఎంపీ) చేసిన శాస్త్రీయ సిఫారసుల ప్రాతిపదికన ఈ అనుమతులను మంజూరు చేశారు. కరోనా వైర్‌సను ప్రతిఘటించగల కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ అనే రెండు మోనోక్లోనల్‌ యాంటీబాడీలను అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ రీజెనరాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అభివృద్ధి చేసింది. రెండు మోనోక్లోనల్‌ యాంటీబాడీలను కలిపి ఈ ఔషధ మిశ్రమాన్ని తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని విక్రయించేందుకుగానూ ఉత్పత్తికి సంబంధించిన లైసెన్సింగ్‌కు రోచే కంపెనీకి రీజెనరాన్‌ ఇచ్చింది. భారత్‌లో అత్యవసర అనుమతులు మంజూరవడంతో.. రోచే ఇండియా కంపెనీ నేరుగా విదేశాల నుంచి యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఈ ఔషధం మార్కెటింగ్‌, పంపిణీకి సంబంధించి సిప్లా కంపెనీతో రోచే వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 




ఎవరికి అందిస్తారు ?

తేలికపాటి నుంచి మోస్తరు కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వయోజనులకు ఈ మందును అందిస్తారు. హృద్రోగాలు, ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీ సమస్యలు, మధుమేహం వంటి కో-మార్బిడిటీస్‌ కలిగిన 12 ఏళ్లకు పైబడిన వారికి కూడా దీన్ని వాడొచ్చు. కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ ఒక్కొక్కటి 600 మిల్లీగ్రాముల మోతాదులో మొత్తం 1200 ఎంజీని.. ఇంట్రావెనస్‌ ఇన్ఫ్యూజన్‌ లేదా తొడలు, చేతులు, పొట్ట, వీపు (సబ్‌ క్యుటేనస్‌ రూట్‌) మార్గాల్లో అందిస్తారు. 2 నుంచి 8 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత వద్ద దీన్ని నిల్వ చేయొచ్చు. హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్సపొందిన హైరిస్క్‌ కరోనా రోగులు ఆస్పత్రి పాలు కాకుండా కాపాడటంలో, మరణాలు సంభవించే ముప్పును తగ్గించడంలో ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ప్రభావవంతంగా పనిచేసిందని మూడోదశ ప్రయోగ పరీక్షల్లో గుర్తించారు. దీంతోపాటు రోగుల్లో కరోనా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపించే వ్యవధి నాలుగు రోజులకు తగ్గిందని వెల్లడించారు. 


ఈ కాక్‌టెయిల్‌లో ఏముంది ? 

సాధారణంగా మనకు ఏదైనా వ్యాధి కారకం (వైర్‌స/బ్యాక్టీరియా) వల్ల ఇన్ఫెక్షన్‌ సోకగానే రోగ నిరోధక వ్యవస్థ స్పందించి యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలను సేకరించి.. స్వరూప, స్వభావాల్లో అచ్చం అలాంటి వాటినే కృత్రిమంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తే వాటిని ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీలు’ అంటారు. కరోనా మొదటి వేవ్‌ సమయంలో.. వైర్‌సను ప్రతిఘటించగల ఔషధాల అభివృద్ధికి అమెరికా కంపెనీ రీజెనరాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ముమ్మర పరిశోధనలు చేసింది. ఈక్రమంలోనే కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ చర్యలను ప్రతిఘటించి ఇన్ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించగల కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ అనే మోనోక్లోనల్‌ యాంటీబాడీలను అభివృద్ధి చేసింది. మానవ శరీర కణాలను వైరస్‌ అతుక్కోకుండా, వాటిలోకి చొరబడకుండా నిరోధించే సామర్థ్యం కూడా వీటి సొంతం. ఈ రెండింటి మిశ్రమంగా తయారుచేసిన కాక్‌టెయిల్‌ ఔషధాన్నే ఇప్పుడు కరోనా చికిత్సకు వినియోగిస్తున్నారు.  

  

Updated Date - 2021-05-09T17:34:44+05:30 IST