యూఏఈ నుంచి భారత్‌కు 270 రిపాట్రియేషన్ విమానాలు

ABN , First Publish Date - 2020-09-30T16:41:45+05:30 IST

వందే భారత్ మిషన్ ఏడో దశలో భాగంగా అక్టోబర్ 1 నుంచి 25వ తేదీ వరకు యూఏఈ నుంచి భారతదేశానికి మొత్తం 270 రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు భారత పౌర విమానయాన శాఖ తాజాగా ప్రకటించింది.

యూఏఈ నుంచి భారత్‌కు 270 రిపాట్రియేషన్ విమానాలు

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్ ఏడో దశలో భాగంగా అక్టోబర్ 1 నుంచి 25వ తేదీ వరకు యూఏఈ నుంచి భారతదేశానికి మొత్తం 270 రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు భారత పౌర విమానయాన శాఖ తాజాగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ రిపాట్రియేషన్ విమానాలు నడపనుంది. ఒకవేళ అవసరమైతే ఇతర ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలను వినియోగిస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అబుధాబి, దుబాయి, షార్జాల నుంచి ఈ విమాన సర్వీసులు ఇండియాలోని వివిధ గమ్యస్థానాలకు రానున్నాయి. 


ఈ రిపాట్రియేషన్ మిషన్(వందే భారత్) ఏడో దశలో భాగంగా భారత్‌లోని కొత్త ఎయిర్‌పోర్టులకు(ఇప్పటివరకు రిపాట్రియేషన్ విమానాలు రాని విమానాశ్రయాలు) కూడా విమాన సర్వీసులు వస్తాయని అధికారులు తెలియజేశారు. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు నేరుగా(కనెక్టింగ్ ఫ్లైట్స్ అవసరం లేకుండా) తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలు కలుగుతుంది. అలాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని విమాన సర్వీసులు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా నుంచి కూడా భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నాయి. కాగా, రివర్స్ డైరెక్షన్‌లో ఇండియా నుంచి యూఏఈకి 269 విమాన సర్వీసులు పని చేస్తాయని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. వీటి ద్వారా యూఏఈలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులను ఇండియా నుంచి యూఏఈకి తరలిస్తారు.    

Updated Date - 2020-09-30T16:41:45+05:30 IST