Afghanistan Crisis: భారత్‌లో అఫ్ఘాన్ వాసుల ప్రవేశానికి కొత్త వీసా విధానం!

ABN , First Publish Date - 2021-08-17T16:09:43+05:30 IST

అఫ్ఘానిస్థాన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కొత్త ఎలక్ట్రానికి వీసా విధానాన్ని ప్రకటించింది.

Afghanistan Crisis: భారత్‌లో అఫ్ఘాన్ వాసుల ప్రవేశానికి కొత్త వీసా విధానం!

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కొత్త ఎలక్ట్రానికి వీసా విధానాన్ని ప్రకటించింది. అఫ్ఘాన్ల నుంచి భారతదేశంలో ప్రవేశం కోసం వచ్చే వీసా దరఖాస్తులను తొందరగా ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో "e-Emergency X-Misc Visa" విధానాన్ని తీసుకొచ్చినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది కొత్తరకం ఎలక్ట్రానిక్ వీసాగా మంత్రిత్వశాఖ పేర్కొంది. భారత్‌కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్‌ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టడం జరిగిందని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 


అఫ్ఘాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఎమర్జెన్సీ ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టినట్లు సమాచారం. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లోని భారత ఎంబసీలో పనిచేస్తున్న 120 మంది సిబ్బందితో పాటు మరికొంత మంది భారత ప్రవాసులను తీసుకుని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 అనే విమానం మంగళవారం స్వదేశానికి బయల్దేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాబూల్ విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారు.



Updated Date - 2021-08-17T16:09:43+05:30 IST