Abn logo
Sep 11 2020 @ 20:23PM

భారత్‌- చైనా మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం!

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి : భారత్‌, చైనా సంయుక్తంగా అంగీకరించిన పంచ సూత్రాలేంటి? అవి అమలవుతాయా? లేదంటే యుద్ధానికి చైనా కాలు దువ్వుతోందా? మరి.. భారత్‌ వ్యూహాలు ఎలా ఉన్నాయి? యుద్ధంతోనే చైనా తోకముడిచే పరిస్థితి ఉంటుందా?. కొద్దినెలల నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు భారత్‌, చైనా విదేశాంగశాఖా మంత్రులు ముగింపు పలికే నిర్ణయం అయితే తీసుకున్నారు. పోరాటాన్ని విరమించేందుకు అంగీకరించారు. పంచసూత్రాల ఒప్పందం అమలు చేయాలని నిర్ణయించారు. ''ప్రస్తుత పరిస్థితిని ఎవరూ కోరుకోలేదు'' అంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.


భారత్‌- చైనా మంత్రుల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ.. విభేదాలు.. వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి. ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ, త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి. భారత్‌- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్‌ రిప్రెజంటేటివ్‌ మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. బార్డర్‌లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా ఇరు దేశాలు సమర్థవంతంగా పనిచేయాలి. ఈ ఐదు అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పరం అంగీకారానికి వచ్చారు.

ఏకాభిప్రాయం వచ్చిన విషయాలివే..

1:- ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ.. 

విభేదాలు.. వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి

2:- ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ...

త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ...

ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి. 

3:- భారత్‌- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన...

ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి

4:- సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్‌ రిప్రెజంటేటివ్‌..

 మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి

5:- బార్డర్‌లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో...

పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా చూడాలి.


అయితే, ఇటీవలి పరిణామాలు గమనిస్తే.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే పలుసార్లు చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడిన పరిస్థితులున్నాయి. చైనా సైనికులు ఎల్‌ఏసీ దాటి గాలిలోకి కాల్పులు జరుపుతూ ఉద్రిక్తతలు సృష్టించారు. అయితే.. ఆ సంఘటన బయటకు వచ్చేలోగానే చైనా.. ఓ ప్రకటన విడుదల చేసింది. భారత సైనికులే కాల్పులు జరిపారంటూ ఆరోపించింది. అయితే.. మరుసటిరోజు ఉదయానికల్లా భారత్‌ అసలు సంగతేంటో చెప్పడంతో అంతర్జాతీయ సమాజానికి తెలిసివచ్చింది.

ఇదిలా ఉంటే.. అయిదుగురు భారత పౌరులను చైనా సైనికులు అపహరించారు. ఈ విషయాన్ని భారత సైన్యం చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో  ఆ అయిదుగురిని తమ భూభాగంలోనే గుర్తించామని, వారిని అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చైనా బదులిచ్చింది. రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో పెరిగిన ఉద్రిక్తతలు, ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో సాయుధ పోరు జరిగే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు భావించిన తరుణంలో ఇలాంటి ప్రకటన రావడం అనూహ్యమే అంటున్నారు విశ్లేషకులు. తెరవెనుక చర్చలు ప్రస్తుతానికి ఫలించడం వల్లే ఈ ప్రకటన వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, మొత్తానికి ఇది రెండు దేశాలకు కొంత ఉపశమనమేనని.. భారత్ కోవిడ్‌తో పోరాడుతుండడం.. చైనా అంతర్జాతీయంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో కనీసం ఈ పోరాటమైనా ఆగడమంటే అది ఉపశమనమేనని అంటున్నారు.అయినా, చైనా కుటిల పన్నాగాల గురించి తెలిసిన భారత ప్రభుత్వం, ఆర్మీ అప్రమత్తంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఎల్‌ఏసీ వెంట జరుగుతున్న పరిణామాలపై ఈ ఉన్నతస్థాయి భేటీలో చర్చలు జరిగాయి. మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన తర్వాత, ఇరు దేశాల మధ్య ఐదు సూత్రాల ఒప్పందం కుదిరిన తరుణంలో.. ఎల్ఏసీ వెంట అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఏది ఏమైనా ఇది తాత్కాలిక విరమణే అన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలోనూ ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర చైనాకు ఉంది. ఈసారి కూడా అలాగే చేయదన్న గ్యారెంటీ లేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇదీ ఇవాల్టి స్పెషల్‌ ఫోకస్‌. - సప్తగిరి గోపగాని (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి).

Advertisement
Advertisement
Advertisement