రిషభ్ పంత్ అజేయ శతకం.. సఫారీల ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-14T00:36:33+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్

రిషభ్ పంత్ అజేయ శతకం..  సఫారీల ఎదుట స్వల్ప లక్ష్యం

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లోని స్వల్ప ఆధిక్యాన్ని కలుపుకుంటే భారత్ లీడ్ 211 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా రెండు రోజులకు పైగా సమయం ఉండడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది.


రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. విరాట్ కోహ్లీ (29) కాసేపు పోరాడినప్పటికీ భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. మరోవైపు, గత కొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న రిషభ్ పంత్ మాత్రం ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఆడుతూ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 139 బంతులు ఎదుర్కొన్న పంత్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో పంత్‌కు ఇది నాలుగో సెంచరీ.


పంత్ తర్వాత కోహ్లీ చేసిన 29 పరుగులే జట్టులో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక, కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7), చతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (1) మరోమారు దారుణంగా విఫలమయ్యారు. అశ్విన్ 7, శార్దూల్ ఠాకూర్ 5, బుమ్రా 2 పరుగులు చేయగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ డకౌట్ అయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, రబడ, లుంగి ఎంగిడి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2022-01-14T00:36:33+05:30 IST