మరో దేశంతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం.. Omicron విజృంభణ వేళ ఉపశమనం

ABN , First Publish Date - 2021-12-17T15:46:55+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.

మరో దేశంతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం.. Omicron విజృంభణ వేళ ఉపశమనం

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా చేరింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది. ఇక ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలో, కొన్ని ప్రత్యేక నిబంధనల మధ్య ఇరు దేశాలకు చెందిన ఎంపిక చేసిన విమానయాన సంస్థలు విమాన సర్వీసులు నడిపించుకునే వీలు ఉంటుంది. ఇప్పటికే భారత్ 33 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఎయిర్ ఒప్పందం చేసుకున్న దేశాల జాబితా ఇదే... ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైత్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యా, రువాండా, సింగపూర్, సీషెల్స్, స్విట్జర్లాండ్, శ్రీలంక, టాంజానియా, యూఏఈ, యూకే, అమెరికా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా నడిచే విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఇక తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వణికిస్తున్న వేళ ఆస్ట్రేలియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడం ఇరు దేశాల ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే విషయం. కాగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రయాణించే వారికి కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా ఎవరు ప్రయాణం చెయొచ్చు అనే విషయాలను తెలియజేసింది.


మంత్రిత్వశాఖ షరతుల ప్రకారం..

* ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్న ఇండియా, నేపాల్, భూటాన్ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ హోల్డర్లు అందరూ, ఏదైనా దేశం పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పీఐఓ కార్డ్ హోల్డర్లు

* తాజా మార్గదర్శకాల ప్రకారం చెల్లుబాటు అయ్యే భారతీయ వీసా ఉన్న విదేశీ పౌరులందరూ

* ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోకి ప్రవేశించడానికి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న విదేశీ పౌరులు, ఆస్ట్రేలియన్ పౌరులు/నివాసితులు 

* భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న నావికులు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ పొందిన విదేశీ జాతీయులు 


Updated Date - 2021-12-17T15:46:55+05:30 IST