బౌలర్లదీ అదే తీరు

ABN , First Publish Date - 2020-02-23T10:20:13+05:30 IST

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చూపుతోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (89), రాస్‌ టేలర్‌ (44) సమయోచిత ఆటతీరుతో ప్రస్తుతం

బౌలర్లదీ అదే తీరు

తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ తరహాలోనే రెండో రోజు బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అటు భారత లైనప్‌ తడబడిన పచ్చిక పిచ్‌పై కివీస్‌ మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరుగులు రాబట్టింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అర్ధసెంచరీ, రాస్‌ టేలర్‌ సమయోచిత ఆటతీరుతో ప్రస్తుతం కివీస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఆఖరి సెషన్‌లో భారత్‌ కాస్త పోటీలోకొచ్చి మూడు వికెట్లు తీయడం ఊరటనిచ్చింది.  గాయం నుంచి కోలుకున్న ఇషాంత్‌ శర్మ ఆకట్టుకున్నాడు. అంతకుముందు పేసర్లు సౌథీ, జేమిసన్‌ పదునైన బంతులకు చివరి ఐదు వికెట్లను కేవలం 43 పరుగుల తేడాతో కోల్పోయిన భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


విలియమ్సన్‌ అర్ధసెంచరీ
ఇషాంత్‌కు మూడు వికెట్లు
భారత్‌ 165 ఆలౌట్‌

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చూపుతోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (89), రాస్‌ టేలర్‌ (44) సమయోచిత ఆటతీరుతో ప్రస్తుతం భారత్‌పై 51 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే వెలుతురులేమితో రెండో రోజు శనివారం ఆట కాస్త ముందుగానే ముగించగా కివీస్‌ తమ తొలి ఇన్సింగ్స్‌లో 71.1 ఓవర్లలో 5 వికెట్లకు 216 పరుగులు చేసింది. క్రీజులో వాట్లింగ్‌ (14), గ్రాండ్‌హోమ్‌ (4) ఉన్నారు. ఇషాంత్‌కు మూడు, షమి.. అశ్విన్‌కి ఒక్కో వికెట్‌ దక్కింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68.1 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. రహానె (46), పంత్‌ (19), షమి (21) ఓ మాదిరిగా ఆడారు. సౌతీ, జేమిసన్‌కు నాలుగేసి వికెట్లు దక్కాయి. 

పోరాడకుండానే..: ఓవర్‌నైట్‌ స్కోరు 122/5తో రెండో రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే క్రీజులో ఓపిగ్గా ఆడుతున్న రహానె, పంత్‌ ఉండడంతో జట్టు వీరి నుంచి విలువైన ఇన్నింగ్స్‌ ఆశించినా ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఉదయం సెషన్‌ తొలి ఓవర్‌లోనే పంత్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌లో అద్భుత సిక్సర్‌ బాది ఊపు మీదున్నట్టు కనిపించాడు. కానీ మరో రెండు ఓవర్లు ముగిశాక సమన్వయ లోపంతో పంత్‌ రనౌట్‌ కావడం జట్టు స్కోరుపై ప్రభావం పడింది. 59వ ఓవర్‌ రెండో బంతిని ఆఫ్‌సైడ్‌ ఆడిన రహానె సింగిల్‌ కోసం పిలిచి వేగంగా పరిగెత్తాడు. పంత్‌ కాస్త తటపటాయిస్తూనే  పరుగందుకున్నాడు. కానీ ఈలోపలే బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ నుంచి అజాజ్‌ పటేల్‌ నేరుగా విసిరిన బంతి వికెట్లను తాకడంతో పంత్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాతి బంతికే అశ్విన్‌ను సౌథీ బౌల్డ్‌ చేశాడు. స్వల్ప సమయంలోనే రహానెను కూడా సౌథీనే అవుట్‌ చేయడంతో భారత్‌ ఇక కోలుకోలేదు. షమి ఆఖర్లో వేగంగా ఆడి కాస్త వినోదం అందించగా 68వ ఓవర్‌లో ఇషాంత్‌ (5) అవుటయ్యాక భారత్‌ ఇన్సింగ్స్‌ ముగిసింది. ఇక లంచ్‌ విరామం సమయానికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
విలియమ్సన్‌, టేలర్‌ భాగస్వామ్యం: బ్రేక్‌ తర్వాత మంచి ఎండ కాయడంతో పాటు పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించడంతో కివీస్‌ లాభపడింది. అయితే ఆరంభంలోనే ఇషాంత్‌ శర్మ ఓపెనర్‌ లాథమ్‌ (11) వికెట్‌ను తీయగా.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరో ఓపెనర్‌ బ్లండెల్‌ (30)ను ఇషాంత్‌ బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక విలియమ్సన్‌కు వందో టెస్టు ఆడుతున్న టేలర్‌ జత కలవడంతో భారత్‌ కష్టాలు మరింత పెరిగాయి. 

చివరి గంటలో వికెట్లు: విలియమ్సన్‌, టేలర్‌ తమ బ్యాట్లకు పనిచెప్పడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఇద్దరూ అనుభవజ్ఞులు కావడంతో చూడచక్కటి షాట్లతో అలరించారు. దీంతో 52వ ఓవర్‌లో కివీస్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చివరకు ఇషాంతే విడదీశాడు.అదనపు బౌన్స్‌తో విసిరిన బంతి టేలర్‌ గ్లోవ్స్‌కు తాకి పైకి లేవగా షార్ట్‌ లెగ్‌లో పుజార క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో మూడో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. శతకం వైపు సాగుతున్న విలియమ్సన్‌ కూడా కొద్దిసేపటికే షమి హాఫ్‌ వాలీకి దొరికిపోయాడు. ఇక నికోల్స్‌ (17) వికెట్‌ను అశ్విన్‌ పడగొట్టగా 72వ ఓవర్‌లో వెలుతురు లేమితో ఆటను ముగించాల్సి వచ్చింది.

రెండు రోజుల్లో 4 గంటలే నిద్రే..
కివీ్‌సతో జరుగుతున్న తొలి టెస్టులో మిగతా బౌలర్లు రాణించకపోయినా పేసర్‌ ఇషాంత్‌ మాత్రం మెరిశాడు. అయితే గాయం నుంచి కోలుకున్నాక సుదీర్ఘ ప్రయాణం చేసిన లంబూ మ్యాచ్‌కు 72 గంటల ముందే కివీ్‌సకు చేరుకున్నాడు. ప్రయాణ బడలికతో శరీరం తీవ్రంగా అలసిపోవడంతో అతడు ఈ మ్యాచ్‌ ఆడాలనుకోలేదట. ‘శనివారం  నా శరీరం చాలా ఇబ్బందిపెట్టింది. కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మ్యాచ్‌ ఆడాలని చెప్పడంతో జట్టు కోసం ఆడక తప్పలేదు. అయితే నా బౌలింగ్‌పై సంతృప్తికరంగా లేను. శుక్రవారం 40 నిమిషాలే నిద్రపోయా. అంతకుముందు రోజు పడుకుంది మూడు గంటలే. జెట్‌ లాగ్‌ నుంచి బయటపడేందుకు నిద్రకు మించింది లేదు. మంచి నిద్ర లభిస్తే శరీరం కూడా చెప్పినట్టు వింటుంది. మ్యాచ్‌లో బంతి రివర్స్‌ స్వింగ్‌ కావడం లేదు. అందుకే క్రాస్‌ సీమ్‌ కోసం ప్రయత్నించా’ అని తెలిపాడు. అలాగే పేసర్‌ బుమ్రాకు కూడా ఇషాంత్‌ మద్దతు పలికాడు. కేవలం ఒక ఇన్నింగ్స్‌ తర్వాత అతడి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం ఫన్నీగా ఉందని తెలిపాడు. గత రెండేళ్లుగా తాను, షమి, బుమ్రా, అశ్విన్‌, జడేజా కలిసి 20 వికెట్లు తీసిన విషయం మర్చిపోవడం సరికాదని హితవు పలికాడు.

 విదేశీ గడ్డపై భారత్‌ తొలి ఇన్సింగ్స్‌లో 165.. అంత కంటే తక్కువ పరుగులు నమోదు చేసినప్పుడల్లా గెలుపు రుచి చూడలేదు. 29 టెస్టుల్లో 23 మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఆరింటిని డ్రా చేసుకుంది.

స్కోరుబోర్డు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) సౌథీ 16; మయాంక్‌ అగర్వాల్‌ (సి) జేమిసన్‌ (బి) బౌల్ట్‌ 34; పుజార (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 11; కోహ్లీ (సి) టేలర్‌ (బి) జేమిసన్‌ 2; రహానె (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 46; హనుమ విహారి (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 7; పంత్‌ (రనౌట్‌) 19; అశ్విన్‌ (బి) సౌథీ 0; ఇషాంత్‌ (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 5; షమి (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 21; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: 68.1 ఓవర్లలో 165 ఆలౌట్‌. వికెట్లపతనం: 1-16, 2-35, 3-40, 4-88, 5-101, 6-132, 7-132, 8-143, 9-165, 10-165. బౌలింగ్‌: సౌథీ 20.1-5-49-4; బౌల్ట్‌ 18-2-57-1; గ్రాండ్‌హోమ్‌ 11-5-12-0; జేమిసన్‌ 16-3-39-4; అజాజ్‌ పటేల్‌ 3-2-7-0.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 11; బ్లండెల్‌ (బి) ఇషాంత్‌ 30; విలియమ్సన్‌ (సి సబ్‌) జడేజా (బి) షమి 89; టేలర్‌ (సి) పుజార (బి) ఇషాంత్‌ 44; నికోల్స్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 17; వాట్లింగ్‌ (బ్యాటింగ్‌) 14; గ్రాండ్‌హోమ్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 71.1 ఓవర్లలో 216/5. వికెట్ల పతనం: 1-26, 2-73, 3-166, 4-185, 5-207. బౌలింగ్‌: బుమ్రా 18.1-4-62-0; ఇషాంత్‌ 15-6-31-3; షమి 17-2-61-1; అశ్విన్‌ 21-1-60-1.

Updated Date - 2020-02-23T10:20:13+05:30 IST