దేశ శ్రేయస్సుకు స్వతంత్ర సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-08-29T05:53:46+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ ఉన్నత పదవులలో నియమించడం లేదా వారికి ఇతరత్రా వివిధ ప్రయోజనాలు కల్పించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పి తీరాలి.

దేశ శ్రేయస్సుకు స్వతంత్ర సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ ఉన్నత పదవులలో నియమించడం లేదా వారికి ఇతరత్రా వివిధ ప్రయోజనాలు కల్పించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పి తీరాలి. పదవీ విరమణ తరువాత ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తమ జీవితాంతం పూర్తి వేతనభత్యాలు అందుకునే ఏర్పాటు చేయాలి. వారు ఏ రాజ్యాంగ పదవినీ లేదా ఇతర లాభదాయక ఉద్యోగాలను అంగీకరించ కూడదు. ఇందుకయ్యే ఆర్థిక భారాన్ని దేశం సంతోషంగా భరించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇది తప్పనిసరి.


సర్వాధికారులు, సర్వోన్నత సంస్థలు కాలానుగుణంగా మారాలి. భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం ‘భారత సర్వోన్నత న్యాయస్థానం’ (సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా). రెండు దశాబ్దాలుగా ఈ సర్వోన్నత న్యాయస్థానం న్యాయ పాలనలో నిర్వహిస్తున్న పాత్ర; దాని విధులు, వ్యవహార క్రమం విశేష స్థాయిలో మారిపోయాయని సుప్రీంకోర్టు సన్నిహిత పరిశీలకులు అంగీకరిస్తున్నారు. గమనార్హమైన కొన్ని మార్పులను ప్రస్తావిస్తాను. అవి న్యాయమూర్తులకు, ముఖ్యంగా కేసును విచారించే న్యాయమూర్తికి విచారణ నిమిత్తం కేసులను అప్పగిస్తున్న విధానం; ఇద్దరు, అంతకన్న ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండే ధర్మాసనాల ఏర్పాటు; కోర్టు అధికార పరిధి విస్తరణ; నిర్ణీత తీర్పుల న్యాయవిజ్ఞాన శాస్త్ర ప్రాతిపదిక; కార్యనిర్వాహకవర్గ అధికారాల క్రమ క్షయం.


న్యాయవ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత గురించి న్యాయశాస్త్ర కోవిదులు ఇప్పటికే విస్తృతంగా రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలను అమలుపరిచాయి. అవి ప్రత్యేక న్యాయస్థానాల సృష్టి, మరింత మంది జడ్జీల నియామకం ఇత్యాదులు. పార్లమెంటు న్యాయ సంస్కరణల లక్ష్యంతో పలు చట్టాలు చేసింది. ఇక సుప్రీంకోర్టు స్వయంగా చేపట్టిన చర్యలు కోర్టు రికార్డుల డిజిటలైజేషన్, కేసుల నిర్వహణతో పాటు ఇటీవలే వర్చువల్ కోర్టుల పద్ధతి (విడియో లింక్‌ల ద్వారా విచారణ నిర్వహించడం)ని ప్రవేశపెట్టడం మొదలైనవి. అయినప్పటికీ కొన్ని వాస్తవాలు గతంలో వలే ఇప్పుడు కూడా ఎంతైనా కలవరం కలిగిస్తున్నాయి. ఉన్నత న్యాయస్థానాలలోనూ, కిందిస్థాయి న్యాయస్థానాలలోనూ కేసులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండడం; జడ్జి పదవుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పుల నాణ్యతపై వ్యాజ్యదారులలో తీవ్ర అసంతృప్తి మొదలైనవి ఎడతెగని బాధాకర వాస్తవాలుగా మిగిలిపోయాయి. 


న్యాయవ్యవస్థ ‘స్వతంత్రత’ విషయమై ఆందోళన వ్యక్తమవుతున్నది. నిరంతర వాదోపవాదాలు జరుగుతున్నాయి. కిందిస్థాయి న్యాయస్థానాల స్థాయిలో గానీ, హైకోర్టుల స్థాయిలో గానీ, సుప్రీంకోర్టు స్థాయిలో గానీ న్యాయాధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోవడంపై సర్వత్రా ఆగ్రహం, ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో తీసుకురావాల్సిన సంస్కరణల విషయమై ప్రస్తుతానికి నా దృష్టిని కేంద్రీకరిస్తాను. ప్రాథమక హక్కులకు సంబంధించి- ఇప్పుడు మానవ హక్కులు, జంతువుల హక్కులు, పర్యావరణ హక్కులకు సంబంధించి కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరంతర జాగరూకత వహించే కాపలాదారుగా ఉండాలి. మరి ఈ విధ్యుయుక్తధర్మాన్ని సమర్థంగా నిర్వహించాలంటే సుప్రీంకోర్టు సంపూర్ణ స్వతంత్ర వైఖరితో వ్యవహరించాలి. అలా వ్యవహరించాలంటే కొన్ని ప్రధాన సంస్కరణలు ఎంతైనా అవసరం. ఆ వాంఛనీయ సంస్కరణలలో కొన్నిటిని వివరంగా ప్రస్తావిస్తాను. 


సుప్రీంకోర్టు హోదాను ఒక రాజ్యాంగ న్యాయస్థానం స్థాయికి పెంపొందించాలి. భారత రాజ్యాంగ ధర్మసూక్ష్మాలకు సంబంధించిన అం  శాలతో ప్రమేయమున్న కేసులను మాత్రమే ఈ రాజ్యాంగ న్యాయస్థానం విచారణ జరిపి తీర్పులు వెలువరించాలి. అరుదైన సందర్భాలలో విస్తృత ప్రజాప్రాధాన్యం, పర్యవసానాలతో ముడివడి వున్న న్యాయ, శాసన సంబంధిత కేసులను ఈ రాజ్యాంగ న్యాయస్థానానికే నివేదించాలి. నా ప్రతిపాదన ఏమిటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఏడుగురు రాజ్యాంగ న్యాయస్థానం- న్యాయమూర్తులుగా ఉండాలి. ఈ న్యాయమూర్తులకు ధర్మాసనాల బాధ్యతలు అప్పగించకూడదు. 


ఈ ప్రతిపాదన విన్న వెంటనే మీలో ఒక ప్రశ్న తలెత్తగలదని నాకు తెలుసు. హైకోర్టుల తీర్పుల అప్పీళ్లపై ఎవరు విచారణ జరుపుతారన్నదే ఆ ప్రశ్న. అప్పీళ్లపై విచారణ జరపడం సర్వోన్నత న్యాయస్థానం ముఖ్య కర్తవ్యం. ముఖ్యంగా సమాఖ్య విధానంలో హైకోర్టులు విరుద్ధ తీర్పులు ఇవ్వడం పరిపాటి. అప్పీల్ కోర్టులను ఏర్పాటు చేయడమే మార్గాంతరం. ఐదు అప్పీళ్ల కోర్టులను ఏర్పాటు చేయాలి. ప్రతి కోర్టులోను ఆరుగురు న్యాయమూర్తులు ఉండాలి. వీరిలో ముగ్గురు చొప్పున రెండు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. అంటే అప్పీళ్ల కోర్టులలో మొత్తం 30 మంది న్యాయమూర్తులు ఉంటారు. సమీప భవిష్యత్తులో దేశ జనాభా 161 కోట్లకు చేరనున్న తరుణంలో ఈ అత్యున్నత న్యాయమూర్తుల సంఖ్య ఏమంత ఎక్కువేమీ కాదు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు అనుమతించిన న్యాయమూర్తుల సంఖ్య 34 మాత్రమే-. మొత్తం 37 మంది న్యాయమూర్తులతో అప్పీళ్ల కోర్టుగానూ, ఒక రాజ్యాంగ న్యాయస్థానంగానూ విధులు నిర్వర్తించే విధంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సంస్కరణలు తీసుకురావాలి. 


ధర్మాసనాలకు (బెంచ్‌లకు) కేసులను ‘అప్పగించే’ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ప్రతిపాదిస్తున్న కొత్త ఏర్పాటు ప్రకారం సుప్రీంకోర్టులో బెంచ్‌లు ఉండవు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పరిపాలనాధికారాలను సూచించే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ విధానం కూడా అవసరముండదు. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ సిస్టమ్ వాస్తవానికి సిస్టమ్ ఆఫ్ రోస్టర్ ఆఫ్ ది మాస్టర్‌గా మారిపోయిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ కె.ఎన్. సింగ్ కేవలం 18 రోజులు మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. తన పదవీకాలంలో పలు కేసులను తాను సభ్యుడుగా ఉన్న ధర్మాసనానికి కేటాయించి, తీర్పులు వెలువరించారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ఆ తీర్పులలో చాలా వాటిని సమీక్షించి రద్దు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారాన్ని చూడండి. తనపై ఆరోపణలు ఉన్న ఒక కేసులో న్యాయనిర్ణయాన్ని నిరాకరిస్తూ, ఆ కేసును మరో బెంచ్‌కు కేటాయించేందుకు పాలనాపరమైన ఆదేశాన్ని ఆయన స్వయంగా జారీ చేశారు. ఐదుగురు సభ్యులు గల ఆ కొత్త బెంచ్‌కు జస్టిస్ దీపక్ మిశ్రానే అధ్యక్షుడు. ఆయన అంతకు ముందు జారీ చేసిన పాలనాపరమైన ఆదేశాన్ని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆమోదించి ఆ కేసును ముగ్గురు సభ్యులు గల మరో ధర్మాసనానికి నివేదించింది! సరే, జస్టిస్ రంజన్ గోగోయిని ఎలా క్షమించాలి? తనపై ఆరోపణలకు సంబంధించిన కేసును ఆయన తనతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనానికి అప్పగించారు. ఆ త్రిసభ్య ధర్మాసనం ఆ కేసుపై విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై జస్టిస్ గోగోయి మినహా మిగతా ఇద్దరు న్యాయమూర్తులు మాత్రమే సంతకం చేశారు! ఇది సబబేనా? మన సర్వోన్నత న్యాయవ్యవస్థలోని అసంబద్ధతలకు ఇవి అసాధారణ ఉదాహరణలు. అందుకే సుప్రీంకోర్టులో ధర్మాసనాలకు కేసులు అప్పగించే పద్ధతికి మనం స్వస్తి చెప్పి తీరాలని నేను ప్రతిపాదిస్తున్నాను. 


సుప్రీంకోర్టులో తీసుకురావాల్సిన మరికొన్ని ఇతర సంస్కరణల గురించి పేర్కొంటాను. కేసులపై విచారణను ధర్మాసనాలు నిర్వహిస్తున్నాయి గనుక సుప్రీంకోర్టు న్యాయనిర్ణయాలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. ప్రతి సర్వోన్నత న్యాయస్థానమూ తాను అంతకు ముందు వెలువరించిన తీర్పులను తోసిపుచ్చడం ఒక పరిపాటిగా ఉంది. అలా మునుపటి తీర్పులను నిరాకరించడమనేది సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మౌలిక మార్పులకు కారణమవుతుంది. ప్రజలు సైతం అటువంటి న్యాయనిర్ణయాలకు సంచలనాత్మకంగా ప్రతిస్పందిస్తారు. అయితే మన దేశంలో ఇద్దరు లేక ముగ్గురు సభ్యుల ధర్మాసనాలు, రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించిన తీర్పులను అనుసరించేందుకు తిరస్కరించిన కారణంగా వాటి తీర్పులను రద్దు చేయడం సంభవిస్తున్నది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం, అంతకు ముందటి తీర్పుకు భిన్నమైన వైఖరిని అనుసరించినప్పుడు కూడా కొత్త తీర్పులను రద్దుచేయడం జరుగుతున్నది. ‘భూ స్వాధీనం, నిర్వాసితుల పునరావాస చట్టం-– -2013లోని సెక్షన్ 24తో ముడిపడిన కేసు ఇందుకొక ఉదాహరణ. ఈ సెక్షన్‌ న్యాయమైన నష్టపరిహారం, పారదర్శకతకు సంబంధించినది. న్యాయనిర్ణయాలలోని అనిశ్చితి పట్ల న్యాయవాదులు కలవరపడుతున్నారు. పౌరులు సైతం గందరగోళ పడుతున్నారు. న్యాయస్థానాలు ఒకచట్టానికి వివిధ సందర్భాలలో విభిన్న రీతుల్లో అర్థం చెబుతుండడం పౌరుల వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలలో పలు సమస్యలను సృష్టిస్తోంది.


పూర్తిగా పరిపాలన లేదా విధానపరమైన నిర్ణయంపై ఎలాంటి న్యాయవిజ్ఞాన శాస్త్ర ప్రాతిపదిక లేకుండా న్యాయసమీక్ష జరపాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని కార్యనిర్వాహక వర్గం తన న్యాయాధికారుల ద్వారా గట్టిగా ఎదుర్కోవాలి. ప్రభుత్వ విధానం లేదా పరిపాలనా పరమైన నిర్ణయం అసంబద్ధమైనది అయితే దానిని సరిదిద్దవలసింది పార్లమెంటు/ శాసనసభలు లేదా ఓటింగ్‌బూత్‌లు మాత్రమే. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం వారిని రాజ్యాంగ ఉన్నత పదవులలో నియమించడం లేదా వారికి ఇతరత్రా వివిధ ప్రయోజనాలు కల్పించే పద్ధతికి కార్యనిర్వాహక వర్గం స్వస్తి చెప్పి తీరాలి. పదవీ విరమణ తరువాత ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తమ జీవితాంతం పూర్తి వేతనభత్యాలు అందుకునే ఏర్పాటు చేయాలి. వారు ఏ రాజ్యాంగ పదవినీ లేదా ఇతర లాభదాయక ఉద్యోగాలను అంగీకరించకూడదు. ఇందుకయ్యే ఆర్థికభారాన్ని దేశం సంతోషంగా భరించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇది తప్పనిసరి. దేశ శ్రేయస్సుకు, మన సమున్నత ప్రజాస్వామిక విలువల, సంప్రదాయాల సంరక్షణకు స్వతంత్ర సర్వోన్నత న్యాయస్థానం చాలా అవసరం. కనుక సుప్రీంకోర్టులో తీసుకురావాల్సిన మరిన్ని సంస్కరణల గురించి మీరూ ఆలోచించండి.


(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)


Updated Date - 2020-08-29T05:53:46+05:30 IST