ఉప్పు సత్యాగ్రహం..మహోజ్వల ఘట్టం

ABN , First Publish Date - 2022-08-15T05:25:10+05:30 IST

ఉప్పు సత్యాగ్రహంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన భూమిక పోషిం చింది

ఉప్పు సత్యాగ్రహం..మహోజ్వల ఘట్టం


 పశ్చిమగోదావరి అంతటా దావానంలా వ్యాప్తి
 పలుచోట్ల వెలసిన ఉప్పు తయారీ కేంద్రాలు

ఉప్పు సత్యాగ్రహం పశ్చిమ గోదావరి జిల్లాలో మహోజ్వల ఘట్టంగా నిలిచింది .. దండి సముద్ర తీరంలో 1930 ఏప్రిల్‌ 6న మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఈ ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఆయన నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం జిల్లాలో మహోద్యమంగా ఉధృతంగా సాగింది .. భీమవరం తాలూకా చరిత్రకెక్కింది.


భీమవరం, ఆగస్టు 14:
ఉప్పు సత్యాగ్రహంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన భూమిక పోషిం చింది.. ఆనాడు జిల్లా అంతటా ఈ ఉద్యమం దావా నంలా వ్యాపించడంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో ఉప్పు తయారీ కేంద్రాలు వెలశాయి. సర్దార్‌ దండు నారాయణరాజు, పుచ్చలపల్లి సుందరయ్య, భూపతిరాజు సుబ్బరాజు, దండు నారాయణరాజు, పూరి గోవిందాచార్యులు, పసల కృష్ణమూర్తి, మంగినపూడి పురుషోత్తమ శర్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ వంటి మహానుభావులు ఎందరో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. గోదావరి తీరంలోని మట్లపాలెంను ఈ ఉద్యమానికి జిల్లా కేంద్రంగా ఎంచుకున్నారు. ఏలూరు నుంచి దండు, ఆత్మకూరి నాయకత్వంలో 50 మంది సత్యాగ్రహులు బయలుదేరి ఏప్రిల్‌ 11న మట్లపాలెం చేరుకున్నారు. అక్కడ పేరిచర్ల సుబ్బరాజు వంటి నాయకులు హాజరయ్యారు. తర్వాత మే 11న 21 కేంద్రాల్లో ఉప్పును తయారు చేశారు.


భీమవరం కేంద్రంగా మహోద్యమం..!


జిల్లాలో భీమవరం కేంద్రంగా జరిగిన ఉద్యమం సముచిత స్థానం పొందింది. కాంగ్రెస్‌ నేతలు భీమవరం కోపల్లివారి సత్రాన్ని కేంద్రంగా చేసుకుని.. భీమవరం యనమదుర్రు గట్టు వెంబడి ఉన్న దిరుసుమర్రు, నాగిడిపాలెంలో సహజంగా ఏర్పడిన మడులను తవ్వుకుని తీసుకొచ్చేవారు. బ్రిటీష్‌ శాసనాన్ని ఉల్లంఘిస్తూ దండు నారాయణరాజు పుచ్చలపల్లి సుందరయ్య వంటివారు పడవపై ఉప్పు బస్తాలు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దారిలో అడ్డుకుని ఉప్పును పారబోశారు.

దండు కెల్ల మొనగాడు..
దండువారి బుల్లోడు..!


నాగిడిపాలెం నుంచి ఉప్పు బస్తాలు తీసుకొచ్చినప్పుడు జరిగిన ఘటన చరిత్రలో నిలిచిపోయింది. దండు నారాయణరాజు, దంతులూరి నారాయణరాజు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకుల బృందం పడవల్లో భీమవరానికి ఉప్పును తీసుకొచ్చినప్పుడు పోలీసులు లాఠీచార్జ్జీ చేశారు. అయితే ఈ బృందానికి నాయకుడిగా ఉన్న దండు నారాయణరాజు ఎదురొడ్డి నిలిచారు. ఛాతిపై పోలీసులు లాఠీలతో కొట్టడంతో నెత్తురోడినప్పటికీ గుప్పెట విడవలేదు. ఆ గుప్పెట్లో ఉప్పును భీమవరం తీసుకొచ్చి ఆత్మకూరు గోవింద్‌ ఆచార్యులు వేలం వేశారు. ఈ ఉప్పును సమరయోధులు భూపతిరాజు సుబ్బరాజు 100 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో ప్రజలు ‘‘దండు కెల్ల మొనగాడు.. దండువారి బుల్లోడు..!’’ అంటూ నారాయణరాజు పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సంఘటనతో నారాయణరాజును, ఆత్మకూరు గోవిందాచార్యులను అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు పంపించారు. దీంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. 114 సెక్షన్‌ విధించారు. అయితే ఇంతలో వర్షాకాలం రావడంతో ఉప్పు సత్యాగ్రహం లో భాగంగా స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టారు. గాంధీజీ ఇర్విన్‌ ఒప్పందం ఆగింది.


1932 నుంచి ఉద్యమం తిరిగి ప్రారంభం


అయితే బ్రిటీష్‌ వారిలో మార్పు లేకపోవడంతో తిరిగి 1932 జనవరి నుంచి ఉప్పు సత్యాగ్రహం  మళ్లీ ప్రారంభమైంది.ఈసారి మహిళల సంఖ్య పెరిగింది. పసల అంజలక్ష్మీ, మూల్పూరి చుక్కనమ్మ, కోటమర్తి కనకమహాలక్ష్మీ, దాసరి కృష్ణవేణి, ద్రోణంరాజు లక్ష్మీబాయిమ్మ, రేపా ప్రగడ మందేశ్వరశర్మ, మంగళంపల్లి చంద్రశేఖర్‌ కొత్తగా పాల్గొన్నారు. బ్రిటిష్‌వారు చాలామందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఉద్యమం జరుగుతుండగానే గాంధీ 1933 డిసెంబర్‌ 27న జిల్లాలో పర్యటించారు. ఆయ నకు ఘన స్వాగతం లభించింది. ఇలా ఉప్పు సత్యాగ్రహం ముగిసి తదుపరి ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి ఘట్టాలను మన ఆజాదికా అమృత మహోత్సవ్‌లో స్మరించుకుందాం.

Updated Date - 2022-08-15T05:25:10+05:30 IST