త్రివర్ణ శోభితం!

ABN , First Publish Date - 2022-08-16T05:46:57+05:30 IST

వాడవాడలా జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది.

త్రివర్ణ శోభితం!

 ఉత్సాహంగా వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబరాలు

 ఆకట్టుకున్న ప్రదర్శనలు

వాడవాడలా జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. పట్టణాలు, పల్లెలు త్రివర్ణ శోభితమయ్యాయి. వీధివీధినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. విద్యార్థులు స్వాత్రంత్య సమరయోధుల వేషధారణలతోనూ, ప్రదర్శనలతోనూ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలూ అలరించాయి. మచిలీపట్నంలో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబరాల్లో వివిధ శాఖల స్టాల్స్‌, శకటాల ప్రదర్శనలు, విద్యార్థుల విన్యాసాలు అబ్బురపరిచాయి.  - మచిలీపట్నం టౌన్‌

శకటాల ప్రదర్శన

బందర్‌ పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల శకటాలు తమ ప్రగతిని చాటి చెప్పాయి. ఈ శకటాల ప్రదర్శనల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శకటం ప్రథమ బహుమతిని, విద్యాశాఖ శకటం ద్వితీయ బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం తృతీయ బహుమతిని, గృహ నిర్మాణ శాఖ, టిడ్కో శకటం నాలుగవ బహుమతిని సాధించాయి. 

దేశభక్తిని చాటిన నృత్య ప్రదర్శనలు

 పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తిని చాటి చెప్పాయి. ఈ నృత్య ప్రదర్శనల్లో బాలాజీ విద్యాలయం విద్యా ర్థులు ప్రథమ స్థానం సాధించారు. మోపిదేవి విద్యార్థులు ప్రదర్శించిన దేశ్‌కీ రంగీలా, పెడన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యా ర్థులు ప్రదర్శించిన ఏ దేశ్‌ హమారా, మాస్టర్‌ ఇ.కె.బాల భాను విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన హిందూస్థాన్‌ హమారా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  

ఆకట్టుకున్న స్టాల్స్‌

 వివిధ శాఖల అధికారులు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌లో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంది.  పశు సంవర్ధక శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, స్వయం సహాయక సంఘాలు, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖతోపాటు ఇతర స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. 

ప్రతిభకు ప్రశంస

 ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, పర్యాటక శాఖా మంత్రి ఆర్‌.కె.రాజా చేతుల మీదుగా 328 మంది అధికారులు, ఉద్యోగులు అవార్డులు, ప్రశాంసపత్రాలు అందుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రోజాతో పాటు కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ రావిలాల మహేష్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఎస్పీ జాషువాలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-16T05:46:57+05:30 IST