వైభవంగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-11T07:48:15+05:30 IST

75వ స్వాతంత్య్ర వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్ది అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

వైభవంగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు

- ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు సమీక్ష

- జిల్లా అధికారులకు దిశా నిర్దేశం

లబ్బీపేట/కలెక్టరేట్‌, ఆగస్టు 10 : 75వ స్వాతంత్య్ర వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్ది అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం స్టేడియంలో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్‌ దిల్లీరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకలో పాల్గొంటారని చెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మూడేళ్లుగా కొవిడ్‌ కారణంగా స్వాతంత్య్ర వేడుకలలో ప్రజలను అనుమతించలేదన్నారు. ఈ ఏడాది సుమారు 600 మంది విద్యార్థులు మూడు రంగుల యూనిఫాంతో గ్యాలరీ నుంచి వేడుకలను వీక్షించనున్నారన్నారు. బస్సులకు అవసరమైన పార్కింగ్‌ సదుపాయాన్ని ముందుగానే సూచించాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేసి సమాచారం ముందుగానే తెలియజేయాలని కలెక్టర్‌ ప్రొటోకాల్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వ శకటాలను సిద్ధం చేసి పెరేడ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులకు పాస్‌లు అందజేసి వారికి ఏర్పాటు చేసిన గ్యాలరీలకు ముందుగానే చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. స్టేడియం ఆవరణలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అధికారులకు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాన్స్‌కో అధికారులు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫైర్‌, ఏపీఎ్‌సఆర్‌టీసీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, సివిల్‌ సప్లై, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ తదితర శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురాం, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

600 మందితో బందోబస్తు : సీపీ

విజయవాడ స్పోర్ట్సు : స్వాతంత్య్ర వేడుకలకు 600 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 బృందాలు వేడుకల్లో కవాతు చేసేలా ఏర్పాట్లు చేశామని, మొత్తం 600 మందితో బందోబస్తు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కార 

దిక్సూచిలు సచివాలయాలు

కలెక్టరేట్‌ : వార్డు సచివాలయ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చాలని కలెక్టర్‌ దిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పున్నమ్మతోటలోని 85, 86, 87 వార్డు సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయాలు ప్రజల సమస్యల పరిష్కారానికి దిక్సూచి లాంటివని, పారదర్శక సేవలు అందించడం ద్వారా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశాలను నెరవేర్చాలని పేర్కొన్నారు.

వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి

జిల్లా మలేరియా కార్యాలయంలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. రోగుల వైద్య సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ వేయాలన్నారు. హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Updated Date - 2022-08-11T07:48:15+05:30 IST