రెండో బార్డోలి .. భీమవరం

ABN , First Publish Date - 2022-08-13T05:24:45+05:30 IST

బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీజీ 1920వ సంవత్సరం లో సహాయ నిరాకరణ ఉద్య మాన్ని ప్రారంభించారు.

రెండో బార్డోలి .. భీమవరం


 సహాయ నిరాకరణలో గాంధీజీ ముద్దుగా పెట్టిన పేరు

బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీజీ 1920వ సంవత్సరం లో సహాయ నిరాకరణ ఉద్య మాన్ని ప్రారంభించారు. ప్రజలు ఎవరూ పన్నులు చెల్లించకూడదనేది దీని ఉద్దేశం.. ఈ ఉద్యమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకాశాన్ని తాకింది .. ప్రత్యేకించి భీమవరం తాలూకాలో నూరుశాతం విజయవంతం కావడంతో ‘రెండో బార్డోలి’ అని గాంఽ దీజీ ప్రశంసిస్తూ ముద్దుగా పేరుపెట్టారు .. గుజరాత్‌లోని బార్డోలిలో పన్నులు చెల్లించలేదు..ఆ తర్వాత భీమవరం తాలూకా ప్రజలు అదే బాటలో వెళ్లారు.


భీమవరం, ఆగస్టు 12 :
బ్రిటీష్‌ ప్రభుత్వం దేశాన్ని వదిలి వెళ్లాలంటే వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి.. వారిని తరిమి కొట్టాలనేది ఆనాటి జాతీయ నాయకుల ఆలోచన.. జలియన్‌వాలాబాగ్‌ హత్యోదంతంతో బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యపూరిత పరిపాలనపై గాంధీజీకి భ్రమలు తొలగాయి. తెల్లవారి పాలనను తరిమికొట్టాలన్న లక్ష్యంతోనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1920లో కలకత్తా, నాగపూర్‌లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభ ల్లో సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్ముని నాయకత్వంలో అమలుచేయాలని తీర్మానించారు. ఈ కాం గ్రెస్‌ సభలకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దండు నారాయణరాజు, ఆత్మకూరు గోవిందాచార్యులు, తదితర నాయకులు హాజరయ్యారు. అక్కడ తీర్మానాలను ఈ జిల్లా నాయకులకు, ప్రజలకు తెలియజేయడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమ ప్రచారం కోసం 1921లో గాంధీజీ విజయవాడ వచ్చినప్పుడు మన జిల్లా నుంచి మాగంటి అన్నపూర్ణాదేవి 200 కాసుల బంగారు ఆభరణాలను తిలక్‌ స్వరాజ్య నిధికి కోసం సమర్పించింది. ఆమె కోరిక మేరకు 1921 ఏప్రిల్‌ 3న ఏలూరుకు గాంధీజీ విచ్చేశారు.

జిల్లాలో పన్నుల సహాయ నిరాకరణ


జిల్లాలో పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం విజయవంతంగా సాగింది.. ముఖ్యంగా భీమవరం తాలూకా అయితే సర్దార్‌ దండు నారాయణరాజు ఆత్మకూర్‌ గోవిందాచార్యులు ముష్టి లక్ష్మీనారాయణ వంటి నాయకులు ప్రభుత్వానికి ఏవిధమైన పన్నులు చెల్లించండి అంటూ విస్తృతమైన ప్రచారం చేశారు. ఆత్మకూరు గోవింద్‌ ఆచార్యులు తాను నడుపుతున్న సత్యాగ్రహి అనే తెలుగు వార పత్రికలో ఈ ఉద్యమా న్ని బాగా ప్రచారం చేశారు. దీంతో ఆయన్ని 1922 జనవరి 30న ఏలూరు రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. ఆయన తరుపున మద్దతుగా దండు నారాయణరాజు, రామచంద్రరావు, హెచ్‌ఐవీ జోగయ్యశర్మ వంటి కాంగ్రెస్‌ నాయకులు హాజరై ఆయన జరుగును వాదించారు. భీమవరానికి చెందిన ముష్టి లక్ష్మీనారాయణ అనే లాయర్‌ 1920 మే 10న తన వృత్తి ని విసర్జించారు. భగవతి కృష్ణమూర్తి, ములుకుట్ల సుబ్బారాయుడు వంటి మిత్రులతో కలిసి భీమవరం, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్ళకూరు, చెరుకుమిల్లి వంటి ప్రాంతాల్లో సహాయ నిరాకరణ ఉద్యమ ప్రచారాలు చేశారు. సమరయోధుడు కవి మంగిపూడి పురుషోత్తమశర్మ శాసనోల్లంఘనపై ప్రత్యేక సభ్యులతో ప్రచారం చేశారు. 1921 డిసెంబర్‌ 10న ఉండిలో గ్రామ ఉద్యోగుల సభలో రామోజీ ఎవరూ ప్రభుత్వం దగ్గర పని చేయవద్దని పిలుపునిచ్చారు. దీంతో 20 మంది ఉద్యోగులు రాజీనామా చేసి జాతీయ ఉద్యమంలో చేరారు.

స్వదేశీ వస్తువుల వాడకం పెంపు..

ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తువుల వాడకం పెంచారు. విదేశీ వస్తు బహిష్కరణతో పాటు విదేశీ వస్త్రాలను వీధుల్లో తగలబెట్టేవారు. జిల్లాలో 25 ఖాదీ విక్రయశాలలు ప్రారంభించగా 1400 రాట్నాలను పంపిణీ చేశారు. ఏలూరు, నరసాపురం, భీమవరం, తణుకు, చాగల్లులో చేతివృత్తులతో పాటు జాతీయ విద్య బోధించారు. దండు నారాయణరాజు, ఉమర్‌ ఆలీషా దేవేంద్రుడు, రాయుడు, గంగయ్య  హరిజన అభివృద్ధి సభలు నిర్వహించారు. దీంతో సహాయ నిరాకరణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.

ఉద్యోగాలకు రాజీనామాలు

సహాయ నిరాకరణ ఉద్యమం జిల్లాలో ఉవ్వెత్తున సాగింది.. ఉద్యోగాలను యోగ్యతా పత్రాలు, బిరుదులను త్యజించాలనే పిలుపుతో జిల్లాలో కొవ్వలి గోపాలరావు, చంగల్వల్ల పంతులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. భీమవరంలో తటవర్తి కృష్ణమూర్తి, వస్తువుల సాగరం, సత్యదేవ రామేశ్వరరావు వంటి నేతలు తమ గౌరవం మేజిస్ట్రేట్‌ పదవులకు రాజీనామాలు చేశారు. సర్దార్‌ దండు నారాయణరాజు ఎర్రమిల్లి గంగయ్య అడవి బాపిరాజు ఎర్రమిల్లి నారాయణమూర్తి, న్యాయవాదులు కోర్డులను బహిష్కరించి ఉద్యమంలో చేరారు. ముడుంబై నరసింహాచార్యులు, వేమూరు కృష్ణారావు శనివారపు సుబ్బారావు, సత్తిరాజు రామ్మూర్తి వీరభద్రరావు, గొట్టుముక్కల వెంకన్న వంటి ఉపాధ్యాయు లు ఉద్యోగాలను వదిలి ఉద్యమంలో చేరారు. పేరిచర్ల సుబ్బరాజు, చిట్టూరి ఇంద్రయ్య, బొల్ల ప్రకాశం, మంగళపర్తి తిమ్మరాజు, గొట్టుముక్కల వెంకటపతిరాజు వంటి 55 మంది గ్రామ అధికారులు, గ్రామ సేవకులు ఉద్యోగాలను విడిచిపెట్టారు. మంగిపూడి పురుషోత్తమశర్మ, దాట్ల సీతారామరాజు, మాదిరాజు రాజభూషణరావు వంటి విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి ఉద్యమంలో దిగారు.

Updated Date - 2022-08-13T05:24:45+05:30 IST