స్వాతంత్య్ర సంబరం

ABN , First Publish Date - 2022-08-16T06:03:13+05:30 IST

పంద్రాగస్టు వేడుకలు జిల్లా కేంద్రంలో ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. విద్యార్థుల సంస్కృ తిక.. సాహస ప్రదర్శనలు, విభిన్న వేషధారణలు, నృత్యాలు ఆహూతులను కొన్ని గంటల పాటు కట్టి పడేశాయి.

స్వాతంత్య్ర సంబరం
జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న మంత్రి బూడి ముత్యాలునాయుడు


 జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలు
ఆకట్టుకున్న సంస్కృతిక ప్రదర్శనలు
 ఉత్తమ సేవకులకు ప్రశంసాపత్రాల బహూకరణ
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

పంద్రాగస్టు వేడుకలు జిల్లా కేంద్రంలో ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. విద్యార్థుల సంస్కృ తిక.. సాహస ప్రదర్శనలు, విభిన్న వేషధారణలు, నృత్యాలు ఆహూతులను కొన్ని గంటల పాటు కట్టి పడేశాయి. వివిధ శాఖల శకటాలు ఆలోచింపజేశాయి. విజయనగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉప ముఖ్య మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధులను ఎప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. సంబరాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు దేశ కీర్తిని, సమరయోధుల త్యాగాలను కీర్తిస్తూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సైరా నర్సింహారెడ్డి నాటిక ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ద్వారకమయి ఆంధుల పాఠశాల ప్రథమస్థానంలో నిలవగా, అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులు రెండో బహుమతిని,         పోర్ట్‌సిటీ స్కూల్‌ విద్యార్థులు మూడో బహుమతిని గెలుచుకున్నారు.

ఆలోచింపజేసిన శకటాలు
వివిధ ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని తెలియచేస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించాయి. విద్యాశాఖ, అటవీశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖ, మోప్మా, డ్వామా, ఐసీడీఎస్‌ తదితర స్టాల్స్‌ను జిలా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలునాయుడు, ఇతర నేతలు, అధికారులు సందర్శించారు. ఐసీడీఎస్‌ సిబ్బంది తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, కలెక్టర్‌ సూర్యకుమారి, ఎస్పీ దీపికాపాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
శృంగవరపుకోట: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శృంగవరపుకోట పట్టణంలో సోమవారం 500మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి దేవిబొమ్మ కూడలి వరకు వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, స్థానిక పౌరులు కలిసి జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. విశాఖ-అరకు రోడ్డులో సాగిన ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. దారి పొడవునా ప్రదర్శనను స్థానికులు తిలకించా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎంపిపి సోమేశ్వరరావు, జడ్పీటీసీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2022-08-16T06:03:13+05:30 IST