ఇర్వింగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-17T03:48:57+05:30 IST

టెక్సాస్ రాష్ట్రంలోని ప్రవాసీభారతీయులు ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ స్మృతి వనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇర్వింగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

ఎన్నారై డెస్క్: టెక్సాస్ రాష్ట్రంలోని ప్రవాసీభారతీయులు ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ స్మృతి వనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాలస్-ఫోర్ట్‌వర్త్‌‌కు చెందిన ప్రవాసీయులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్, అమెరికాల జాతీయ గీతాల ఆలాపనతో ఈ వేడుక ప్రారంభమయ్యింది. ఇరు దేశాల అనుకూల నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మెమోరియల్ సెక్రెటరీ, కనస్ట్రక్షన్ టీం చైర్మన్ రావు కాల్వల ప్రసంగించారు. బోర్డు చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర దార్శనికత కారణంగానే స్మారక వనం ఏర్పాటు సాధ్యమైందని ప్రశంసించారు.  


మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు కో చైర్మన్ ఉర్మీత్ జునేజా, డైరెక్టర్ సాల్మన్ ఫషూరీ, సలహాదారు ఎమ్‌వీఎల్ ప్రసాద్.. భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల త్యాగాలను ప్రస్తుతించారు. దేశభక్తులు, త్యాగధనుల సేవలను కొనియాడుతూ వారి పట్ల తమకున్న గౌరవమర్యాదలను చాటుకున్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన శాంతియుత నిరసనలు ఎందరిలోనో స్వాతంత్ర్యకాంక్షను, స్ఫూర్తిని రగిలించాయని వ్యాఖ్యానించారు. శాంతిస్థాపన కోసం పాటుపడ్డ ప్రపంచస్థాయి నాయకుడు మహాత్మా గాంధీ అంటూ కొనియాడారు. కాగా.. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ రావు కాల్వల ధన్యవాదాలు తెలిపారు.





Updated Date - 2022-08-17T03:48:57+05:30 IST