గర్వించాలి, విమర్శించాలి

ABN , First Publish Date - 2022-08-13T07:16:05+05:30 IST

దేశమంతా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇళ్ల మీదా, వీధి కూడళ్లలోను, బళ్ల మీదా ఎక్కడా చూసినా..

గర్వించాలి, విమర్శించాలి

దేశమంతా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇళ్ల మీదా, వీధి కూడళ్లలోను, బళ్ల మీదా ఎక్కడా చూసినా మూడు రంగుల జెండాలు రకరకాల పరిమాణాలలో, రకరకాల ఎత్తుల్లో ఎగురుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష వలసపాలన నుంచి స్వతంత్రం పొంది ముప్పాతిక శతాబ్ది, ఏడున్నర దశాబ్దాలు గడిచాయి. వేడుక చేసుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి గొప్ప సందర్భం. నడచివచ్చిన దారిని తరచి చూసుకోవడానికి మంచి అవకాశం. 


ఈ ప్రయాణమంతా దుఃఖ దాయకమేనని, భవిష్యత్తులో కూడా ఆశ లేదని నిరాశపడే వారుంటారు. చైతన్యశీలమైన మానవసమాజాలేవీ ముందడుగు వేయకుండా స్తంభించవని వారికి తెలియకపోవచ్చు. అట్లాగే, ఇప్పటికి చాలా సాధించాము కాబట్టి గర్వపడడం తప్ప మరేమీ చేయకూడదని వాదించే వారూ ఉంటారు. ఏదో రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన నాయకుడు ఒకాయన, జెండా ఎగరని ఇళ్లేమిటో జాబితా తీయాలని కోరాడు. ఆదర్శవంతమైన, ఆనందకరమైన అభివృద్ధిని సాధించామని ఎవరన్నా అంటే అది పొరపాటే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గడచిన కాలం కూడా ఎంతో రక్తసిక్త, విషాద, విద్రోహ ఘట్టాలతో సాగింది. అదే సమయంలో, ప్రతికూలతలను అధిగమించి, మెరుగైన జీవితం కోసం భారతీయ సమాజాలు తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నిస్తూ వచ్చాయి. మనుషుల పురోగతి ప్రయత్నాలలో ప్రయోజనాల ఘర్షణ అనివార్యం. న్యాయపక్షమే అన్నివేళలా గెలిచిందనలేము కానీ, ప్రతి పోరాటమూ అదనపు మంచిని ఆవిష్కరించింది. 


అక్షరాస్యత పెరిగింది. తలసరి ఆదాయాలు పెరిగాయి. మునుపటితో పోల్చినప్పుడు జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. ప్రసూతి మరణాలు తగ్గాయి. అనేక సామాజిక శ్రేణులు మునుపు తామున్న స్థితి నుంచి పైకి వెళ్లాయి. రాజకీయాలలో, అనేక సామాజిక రంగాలలో ప్రాతినిధ్యపు వైవిధ్యం పెరిగింది. 


మహిళలు వ్యవహరించే స్థలం విస్తరించింది. వారి గొంతు బిగ్గరగా వినిపిస్తున్నది. ఆర్థిక రంగంలో అనేక మౌలిక సదుపాయాలు, ఉత్పాదక వ్యవస్థలు ఏర్పడ్డాయి. ప్రపంచంతో వ్యవహారంలో భారతదేశం విలువ పెరిగింది. బౌద్ధిక శ్రామికులు అంతర్జాతీయ సంస్థలలో అధికాదాయాన్ని్ ఆర్జిస్తున్నారు. ఇట్లా అనేక పురోగతులను మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. కానీ అదే సమయంలో, సామాజిక అంతరాలు కొత్త రూపం తీసుకున్నాయని, ఆదాయ అంతరాలు మునుపటి కంటె పెరిగాయని, స్వార్థం పెరిగిందని కూడా చెప్పుకోవాలి. రాజకీయాలూ, వాటిని ఆశ్రయించిన వ్యాపారమూ కలసి కొత్త అమానవీయ సంస్కృతిని విస్తరిస్తున్నాయి. సాటి మానవుల వర్తమానాన్నే కాక భవిష్యత్తును కూడా కొల్లగొట్టే విధంగా పర్యావరణాన్నీ ప్రకృతినీ విధ్వంసం చేస్తున్నారు. అటవీగర్భాలలో ఉన్న అపురూప సంపదను లక్ష్యంగా చేసుకుని, ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నారు. నిచ్చెన మీద నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కనిస్తున్నారు కానీ, ఎక్కడా గమ్యం చేరనివ్వడం లేదు. గర్భగుడిలోకి ఇంకా ప్రవేశం లేదు. ఇవన్నీ కూడా చెప్పుకోవలసిన విషయాలే. 


స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఆశాభంగం కూడా మొదలయింది. అవినీతీ బంధుప్రీతి చీకటిబజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని పదేళ్లకే అభ్యుదయ కవి సినిమా ద్వారా ఆవేదన చెందాడు. ఎక్కడి కెళుతుందీ దేశం ఏమైపోతుంది, హిమశైల శిఖరంపైకా పాతాళ కుహరంలోకా అని మరో పదేళ్లకు జనరంజక కవి కూడా నిలదీశాడు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడెనిమిదేళ్లకు, ఒక బిల్లు విషయంలో ప్రధాని నెహ్రూ తన పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట. ఆ సమయంలో ఒకనాడు పార్లమెంటులో విద్యామంత్రి మౌలానా ఆజాద్ నెహ్రూతో జనాంతికంగా మాట్లాడుతూ ఒక యువకవి కవిత్వం ఉటంకించారట. ‘బళ్లు అన్నిటినీ కొల్లగొట్టారు. అంతానాశనమైపోయింది. బందిపోట్లను నేను తప్పు పట్టను. బండినడిపేవాడిదే బాధ్యత’’ అదీ ఆ ఉర్దూ కవిత భావం. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకత, అందుకు ఆయనే బాధ్యుడని సహచరమంత్రి కవిత్వసహాయంతో విమర్శించడం ఇప్పుడు ఊహించగలమా? శుష్కమైన రాజకీయ సంవాదం తప్ప, అర్థవంతమైన తీవ్రమైన విమర్శ అంటూ ఉన్నదా? సమాజంలో ద్వేషవిషాన్ని వ్యాపింపజేసేవారికి ఎనలేని స్వేచ్ఛ, మంచిని మార్పును కోరేవారిపై తీవ్రమైన నిర్బంధం, దీన్నంతటినీ సహజమనీ వాంఛనీయమనీ కోరుకునే స్వార్థ ప్రజాశ్రేణులు, ఈ పరిణామం ఎంతటి విషాదకరం? 


ప్రశ్నించడం, విమర్శించడం సాగుతున్నంత కాలం, ఆ ప్రశ్న, విమర్శ సమాజంలోని నిజమైన మార్పునకు దారితీస్తుంది. అధికార హీనులకు సాధికారతను కోరుకున్నంతకాలం, వర్తమానంలో ఎన్ని వ్యత్యాసాలు, ఎంతటి వేదన ఉన్నా, ఆశారాహిత్యం ఏర్పడదు. భారత జాతీయోద్యమం అనేక పాయలుగా సాగింది. ఆ పాయలు, కోవలు పరస్పరం విమర్శించుకున్నాయి, కొన్నిసార్లు సహకరించుకున్నాయి. జాతీయోద్యమంలో రెండు దిగ్గజాలనదగ్గ గాంధీ, అంబేడ్కర్ రెండు వేరు వేరు సామాజిక, రాజకీయ దృక్పథాలలో జాతి అవసరాలకు ప్రాతినిధ్యం వహించారు. కుల వివక్ష, మతద్వేషం, స్త్రీపురుష సమానావకాశాలు, హేతుబద్ధత, స్వావలంబన వంటి అనేక విలువలను శతాబ్దానికంటె ముందే గుర్తించి, భారత జాతీయోద్యమం తనను తాను మలచుకున్నది. రాజకీయంగా ఎంతటి సాత్వికవాది అయినా, కటువైన విమర్శ చేయగలిగిన హక్కును గాంధీ అనేకమార్లు వినియోగించుకున్నారు. ప్రజాస్వామిక హక్కులు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని కాదు, కానీ, ప్రజలలో తమనుతాము వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉండాలనే స్పృహ మిగిలి ఉండడం ముఖ్యం. ఆ స్పృహ చైతన్యమై, అదే ఆచరణై, నిర్బంధాన్ని మార్చగలుగుతుంది. జాతీయోద్యమ వారసత్వం నుంచి నేర్చుకోవలసిన, నిలుపుకోవలసిన ముఖ్యమైన విలువ ప్రశ్నించడం, విమర్శించడం.

ఈ సందర్భాన్ని వేడుకగా జరుపుకుందాం, సాధించినవాటికి గర్వించి, విఫలమైన వాటికి విమర్శించుకుందాము. మార్పు కోసం జరిగే ప్రక్రియకు విమర్శ ఒక ఇంధనం. ప్రశ్నించకూడదని, ప్రశ్నించేవారు దేశద్రోహులని చెప్పేవారు దేశభక్తులే కాదు. 


పౌరులకి అతడి లేదా ఆమె దేశానికీ ఉండే అనుబంధాన్ని ఏ ఉన్మాదాలూ ఉద్వేగాలూ నిర్వచించలేవు. తన కాళ్ల కింది నేలను, తన తలపై ఆకాశాన్ని ప్రేమించడం అంటే తోటివారిని కూడా ప్రేమించడం, పరస్పరం పంచుకోవడం.

Updated Date - 2022-08-13T07:16:05+05:30 IST