అప్పు ఖరారైందా!?

ABN , First Publish Date - 2022-06-25T08:42:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు పరిమితి ఖరారైందా? రాష్ట్రానికి ఎంత అప్పు ఇవ్వాలనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చేసిందా? ఎంతమేర రుణం..

అప్పు ఖరారైందా!?

తాజాగా రూ.3000 కోట్ల అప్పునకు ఇండెంట్‌

ఈనెల 28న ఆర్బీఐ వేలం ద్వారా సేకరణ

రాష్ట్రానికి అప్పులు 42,728 కోట్లేనంటూ లేఖ

జీఎస్‌డీపీలో 3.5 శాతానికే పరిమితమనే వాదన

అప్పుడు, బడ్జెట్‌ అప్పుల్లోనే 12,804 కోట్లకు కోత

కార్పొరేషన్ల పేర తీసుకోవాలనుకున్న 

రూ.34,873 కోట్ల గ్యారెంటీ అప్పులకూ నీళ్లు


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు పరిమితి ఖరారైందా? రాష్ట్రానికి ఎంత అప్పు ఇవ్వాలనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చేసిందా? ఎంతమేర రుణం తీసుకోవడానికి తెలంగాణకు అర్హత ఉందో చెప్పేసిందా? అందుకే మరో రూ.3000 కోట్ల రుణం తీసుకోవడానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టిందా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా సాగించిన ప్రయత్నాల ఫలితంగా చివరాఖరుకు మొత్తంగా రూ.42,728 కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ.. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. గోప్యత పాటిస్తున్నారు.


రూ.3000 కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చిందా? లేక రెగ్యులర్‌ అప్పు కింద అనుమతించిందా? అని ప్రశ్నిస్తే.. తమకే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదంటూ తప్పించుకుంటున్నారు. కానీ, రాష్ట్ర జీఎ్‌సడీపీలో 3.5 శాతం మేర అప్పు తీసుకోవడానికే కేంద్రం అనుమతించిందని తెలుస్తోంది. అదే నిజమైతే.. కేవలం బడ్జెట్‌ అప్పుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.12,804 కోట్ల రుణాన్ని తీసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లే. ఇక, కార్పొరేషన్ల పేరిట తీసుకోవాలనుకున్న రూ.34,873 కోట్ల గ్యారంటీ అప్పులను కూడా వదులుకోవాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.3,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్‌ పెట్టింది.


ఈనెల 28న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం పాట ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 12 ఏళ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 13 ఏళ్ల పరిమితితో రూ.1000 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో మరో రూ.1000 కోట్లు తీసుకోబోతోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రూ.3000కోట్లకు, అసోం రూ.1000కోట్లకు, గుజరాత్‌ రూ.1000కోట్లకు, హరియాణా రూ.4000కోట్లకు, మధ్యప్రదేశ్‌ రూ.2000కోట్లకు, రాజస్థాన్‌ రూ.1000కోట్లకు, తమిళనాడు రూ.2000 కోట్లకు, పశ్చిమ బెంగాల్‌ రూ.2000 కోట్లకు ఇండెంట్లు పెట్టాయి. 9 రాష్ట్రాలు 19వేలకోట్లు సేకరించబోతున్నాయి.


తాత్కాలికమా? రెగ్యులరా?

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న రూ.3000 కోట్ల అప్పునకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చిందా? రెగ్యులర్‌ అప్పు కింద పరిగణిస్తోందా? అన్న దానిపై స్పష్టత రాలేదు. కానీ.. అధికార వర్గాలు మాత్రం దీనిని రెగ్యులర్‌ అప్పు కింద పరిగణించాలని చెబుతున్నాయి. వాస్తవానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.55,532 కోట్ల అప్పు తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికితోడు, మరో రూ.34,873 కోట్లను కార్పొరేషన్ల పేరిట గ్యారంటీ అప్పులను తీసుకోవాలని భావించింది. కానీ, అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ కార్పొరేషన్ల పేర తీసుకునే గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట నిబంధనల పరిధిలోకి తెస్తామని స్పష్టం చేసింది. గత రెండేళ్ల గ్యారంటీ అప్పులు, బడ్జెట్‌ అప్పులను లెక్కించి.. అవి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కోతలు విధిస్తామని తెలిపింది. దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా కేంద్రంతో మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌తో చర్చించారు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వాటికి ఉందని, తమకు పూర్తి స్థాయిలో అప్పు లభించేలా చూడాలని కోరారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం రూ.55,532 కోట్ల అప్పు తీసుకునేలా అనుమతించాలని అడిగారు. అయినా, దీనిపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇతర శాఖల అధికారులు మాత్రం అప్పు సంగతిని కేంద్రం తేల్చేసిందని, జీఎ్‌సడీపీలో 3.5 శాతం మేర అప్పునకు అనుమతి ఇచ్చిందని వివరిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సడీపీ రూ.12,20,804 కోట్లు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన ప్రకారం ఇందులో 3.5 శాతం మేర అప్పు తీసుకోవడానికి అనుమతిస్తే.. రాష్ట్రానికి రూ.42,728 కోట్లు లభిస్తాయని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు ఈ అప్పునే కేంద్రం ఫైనల్‌ చేసినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం రూ.55,532 కోట్ల అప్పును ఇవ్వడానికి నిరాకరించిందని చెబుతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం అంచనా వేసిన మొత్తంలో రూ.12,804 కోట్ల అప్పు తగ్గిపోనుంది. ఇక, కార్పొరేషన్ల పేరిట అంచనా వేసిన రూ.34,873 కోట్ల అప్పు కూడా రాకుండాపోతుంది. కేంద్ర ప్రభుత్వం అప్పు పరిమితిని ఫైనల్‌ చేసినందునే శుక్రవారం రూ.3000 కోట్ల అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. అయితే, బడ్జెట్‌ అప్పులను, గ్యారంటీ అప్పులను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని ఒక ఏడాదికే పరిమితం చేస్తామని రాష్ట్రాలకు కేంద్రం సంకేతాలు ఇచ్చిందంటూ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికితోడు, వివిధ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు రూ.42,728 కోట్లకే పరిమితమవుతుందా? ఇంకా మారే అవకాశం ఉంటుందా? అనే చర్చ కూడా అధికార వర్గాల్లో జరుగుతోంది.

Updated Date - 2022-06-25T08:42:25+05:30 IST