కార్మికుల గోడు ఆలకించరా..?

ABN , First Publish Date - 2021-01-14T05:19:13+05:30 IST

కడప నగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడలి పక్కనే ఓ దీక్ష శిబిరం. అందులో ముగ్గురు కార్మికులు దీక్షలో ఉన్నారు. ఐదు రోజుల నిరవధిక నీరాహారదీక్షతో ఆరోగ్యం క్షీణించి నీరసించి ఉన్నారు. అదే దారిలో కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమాలకు వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరితో ఒక్కసారికూడా మాట్లాడలేదు.

కార్మికుల గోడు ఆలకించరా..?
కడప అంబేడ్కర్‌ సర్కిల్‌ కూడలిలోని దీక్ష శిబిరంలో ఆరోగ్యం క్షీణించి పడుకున్న కార్మికులు

హక్కుల కోసం ఏపీఏండీసీ కార్మికుల నిరవధిక నిరాహార దీక్ష

30వ రోజుకు చేరిన దీక్షలు

స్పందించని ఏపీఎండీసీ యాజమాన్యం

క్షీణించిన ముగ్గురు కార్మికుల ఆరోగ్యం

కడప, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడలి పక్కనే ఓ దీక్ష శిబిరం. అందులో ముగ్గురు కార్మికులు దీక్షలో ఉన్నారు. ఐదు రోజుల నిరవధిక నీరాహారదీక్షతో ఆరోగ్యం క్షీణించి నీరసించి ఉన్నారు. అదే దారిలో కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమాలకు వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరితో ఒక్కసారికూడా మాట్లాడలేదు. ఈ దీక్షలు మొదలై 30 రోజులు దాటింది. ఒక్కో బ్యాచ ఐదురోజులు నిరాహార దీక్షలో కూర్చుంటోంది. ప్రస్తుతం 6వ బ్యాచలో దీక్షకు కూర్చున్న కార్మికులు కొప్పల ప్రభుదాస్‌, వడ్డి క్రిష్టవెంకటరాజు, పి.దస్తగిరిల ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. 

    రాజంపేట డివిజన మంగంపేట ఏపీ మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన (ఏపీఎండీసీ)లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. 2001 నుంచి 2008 వరకు కారుణ్య నియామకాలకు నోచుకున్న 26 మంది కార్మికుల కుటుంబాలకు నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కార్పొరేషన్లలో వరుసగా ఐదేళ్లు లాభాలలో ఉండి.. ఖాళీలు ఉంటే కారుణ్య నియామకాలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఏపీఎండీసీ యాజమాన్యం పట్టించుకోలేదు. లాభాల్లో నడుస్తున్న ఏపీఎండీసీ సంస్థ ఎందుకు భర్తీ చేయడం లేదని ఆ సంస్థ కార్మిక సంఘం గౌరవ సలహాదారుడు సీహెచ చంద్రశేఖర్‌, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, అధ్యక్షురాలు జయశ్రీ పశ్నిస్తున్నారు. మంగంపేట మైనింగ్‌ ఏర్పాటు సమయంలో ఇళ్లు కోల్పోయిన వారిలో 30 మంది కార్మిక కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం అందలేదు. వాటి సాధనకోసం 2020 నవంబరు 3న మంగంపేటలో, 10వ తేదీన విజయవాడలో కార్మికులు ఒక్కరోజు దీక్షలు చేశారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో డిసెంబరు 16వ తేది నుంచి కార్మికులు కడప నరగం అంబేడ్కరు విగ్రహం సాక్షిగా ఆ కూడలిలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. 30 రోజులైనా యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-14T05:19:13+05:30 IST