IND vs ENG: రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కోహ్లీ వచ్చేశాడు..

ABN , First Publish Date - 2022-07-14T22:49:51+05:30 IST

లండన్‌లోని లార్డ్స్ వేదికగా సాయంత్రం 5.30 గంటలకు మొదలవనున్న టీమిండియా, ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్‌లో..

IND vs ENG: రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కోహ్లీ వచ్చేశాడు..

లార్డ్స్: లండన్‌లోని లార్డ్స్ వేదికగా సాయంత్రం 5.30 గంటలకు మొదలవనున్న టీమిండియా, ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తొలి వన్డే మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. తొలి వన్డేలో ఘోరమైన ఓటమి చవిచూసిన బట్లర్ సేన ఈ మ్యాచ్‌లో మాత్రం గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.



భారత పేస్‌ విభాగం ఇంగ్లిష్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. బుమ్రా అత్యుత్తమ ఫామ్‌లో ఉండగా.. షమి నుంచి అతడికి మంచి సహకారం లభిస్తోంది. వీరిద్దరి నుంచి టీమ్‌ మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో సారథి రోహిత్‌ శర్మ అజేయ అర్ధ శతకంతో సత్తా చాటాడు. హిట్‌మ్యాన్‌ ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడడం సానుకూలాంశం. 


కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి విధ్వంసక బ్యాటర్లలో పటిష్ఠంగా ఉన్న ఇంగ్లండ్‌.. ఓవల్‌లో అనూహ్యంగా కుప్పకూలింది. కానీ, ఒక్క మ్యాచ్‌తో తామేమీ భీతిల్లడం లేదని.. బలంగా పుంజుకొంటామని ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అన్నాడు. బుమ్రా దెబ్బకు కకావికలమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌.. ఈ మ్యాచ్‌లో సత్తాచాటి సిరీస్‌లో నిలవాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ ఫామ్‌ ఆతిథ్య జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.


టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ షమీ, చాహల్, బుమ్రా


ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్ట్రో, జోయ్ రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, టోప్లే, కార్స్

Updated Date - 2022-07-14T22:49:51+05:30 IST