బరువు పెరిగింది

ABN , First Publish Date - 2020-11-03T16:54:56+05:30 IST

కాలంతో పాటు ఆహారశైలి, శరీరం తీరు, కొలతలు మారుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా స్త్రీపురుషుల శరీర సగటు బరువుల ప్రమాణాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌

బరువు పెరిగింది

ఆంధ్రజ్యోతి(03-11-2020)

కాలంతో పాటు ఆహారశైలి, శరీరం తీరు, కొలతలు మారుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా స్త్రీపురుషుల శరీర సగటు బరువుల ప్రమాణాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌  రీసెర్చ్‌ (ఐ.సి.ఎమ్‌.ఆర్‌) ఐదు కిలోలకు పెంచింది. ఈ సవరణను ఆహార సంస్థలు వ్యతిరేకిస్తుంటే, ఆహార నిపుణులు సమర్ధించడం విశేషం!


ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ భారతీయుల సగటు శరీర బరువును ఐదు కిలోలకు పెంచుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాంతో ఎన్‌ఐఎన్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌) స్త్రీపురుషుల సగటు శరీర బరువులను పురుషులకు 60 నుంచి 65 కిలోలకు,  మహిళలకు 50 నుంచి 55 కిలోలకు పెంచింది. కాలానుగుణంగా శరీరం తీరు, కాంపొజిషన్లు మారుతూ ఉంటాయి కాబట్టి ఒకే ప్రమాణాలను అనుసరించడం సరికాదనే ఉద్దేశమే ఈ సవరణకు కారణం. ఇలా జోడించిన ఐదు కిలోల అదనపు బరువు ఆరోగ్యకరమైనదేనని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సవరణతో ఇప్పటికే 61.3ు జీనవశైలి రుగ్మతలతో కుదేలవుతున్న భారతదేశం మీద మరింత భారం పడుతుందేమోననే భయాలూ బయల్దేరాయి. ఇలా పెరిగిన ప్రమాణాలతో శరీర బరువుల రిఫెరెన్స్‌ వ్యాల్యూస్‌ను ప్రజలు పొరపాటుగా అర్థం చేసుకుని ‘బరువు పెరిగినా ఫర్వాలేదులే’ అని భావించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే 19 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళల సగటు ఆహారశైలిలో ప్రధానమైన మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి వారి ఆహార అవసరాలలో కూడా సవరణలు జరిగాయి. కాబట్టే ఈ వయోపరిమితికి చెందిన మహిళల శరీర బరువు 50 కిలోలకు మించి ఉండడం గమనిస్తున్నాం. పూర్వపు ప్రమాణాల్లో ఇమడడం కోసం గతంలో మహిళలు కడుపు మాడ్చుకోవలసిన పరిస్థితి ఉండేది. దాంతో పోషకాహార లోపాలు ఏర్పడేవి. కాబట్టి ప్రస్తుత జనాభా ఆహారపుటలవాట్ల ఆధారంగా చేసిన ఈ సవరణ మంచిదే అంటున్నారు కొందరు వైద్యులు. 


అయితే కరోనా కారణంగా ఎక్కువ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడం, వ్యాయామం చేయకపోవడం మూలంగా ఇప్పటికే బరువు పెరిగిన ప్రజలు ఐ.సి.ఎమ్‌.ఆర్‌ చేసిన ఈ సవరణను సాకుగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలనీ, పిండిపదార్థాలను తగ్గించి, మాంసకృత్తులు పెంచాలని వారు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా మార్గదర్శకాల ఫలితంగా పెరిగే ఆహార అవసరాలతో వ్యవసాయ రంగం మీద అదనపు భారం పడే ప్రమాదం ఉందని ఆహార సంస్థలు ఐ.సి.ఎమ్‌.ఆర్‌కు మొరపెట్టుకుంటున్నాయి. అంతేకాదుపెంచిన బరువు ప్రమాణాలను తిరిగి సవరించాలని ఆహార సంస్థలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి. అయితే ఆహార నిపుణులు ఈ సవరణను సమర్థించడం విశేషం.

Updated Date - 2020-11-03T16:54:56+05:30 IST