అమ్మో.. నగరం

ABN , First Publish Date - 2022-06-22T05:02:09+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ దుస్థితి ఇది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహన చోదకులు, ప్రయాణికులు పడే బాధలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి వేలాది వాహనాలు చొచ్చు

అమ్మో.. నగరం

విజయనగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ చిక్కులు

నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాల నిర్మాణం

కానరాని పార్కింగ్‌ స్థలం

రోడ్డుపై వాహనాలు నిలుపుతున్న వైనం

సమస్యకిదే ప్రధాన కారణం

విజయనగరం (ఆంధ్రజ్యోతి) 

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ దుస్థితి ఇది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహన చోదకులు, ప్రయాణికులు పడే బాధలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి వేలాది వాహనాలు చొచ్చుకు రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. వేళకు విధులకు హాజరుకావాలంటే గంట ముందు బయలుదేరాల్సి వస్తోందని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బాధలు వర్ణనాతీతం. సమయానికి రాని ఆర్టీసీ బస్సులతో అవస్థలు పడుతుండగా.. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. 

విజయనగరంలో ట్రాఫిక్‌ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. విద్య, వైద్య, వర్తక, వాణిజ్యపరంగా నగరం అభివృద్ధి చెందుతుండడం కూడా ఒక కారణం. ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి కూడా అవసరాలకు అక్కడి ప్రజలు వస్తుంటారు. పెరిగిన వాహన రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టకపోవడం, ఉన్న రోడ్లు ఆక్రమణలకు గురికావడం ట్రాఫిక్‌ సమస్య పెరగడానికి ప్రధాన కారణం. ఎప్పటికప్పడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ పోలీస్‌ శాఖకు కత్తిమీద సాములా మారుతోంది. నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రహదారులు పార్కింగ్‌ ప్రాంతాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించడం లేదు. రోడ్డుకు ఆనించి షెల్లర్లు నిర్మిస్తున్నారు. దీంతో వాహనాలను రహదారులపై పార్కింగ్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడం లేదు.

 ఈ ప్రాంతాల్లో..

నగరంలో ప్రధానంగా తిరుమల హాస్పిటల్‌ రోడ్డు, లీలామహాల్‌, జడ్పీ కార్యాలయం రోడ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే మార్గాలు, గంటస్తంభం, ఎంజీరోడ్డు,  కోట జంక్షన్‌, రింగు రోడ్డు వంటి ప్రాంతాలో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి అంబులెన్స్‌లు, ఆర్టీసీ బస్సులు సైతం ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీనికితోడు నగరంలో ఫుట్‌పాత్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. రహదారి పక్కనే చిరు వ్యాపారులు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేసి వస్తువులను విక్రయిస్తుంటారు. వాటిని కొనుగోలు చేసేందుకు వాహనాలు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నగరాన్ని ట్రాఫిక్‌ సమస్య నుంచి గట్టెక్కించాలని నగరవాసులు కోరుతున్నారు.





Updated Date - 2022-06-22T05:02:09+05:30 IST