పెరుగుతున్న పాజిటివిటీ

ABN , First Publish Date - 2022-01-21T05:20:16+05:30 IST

జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గురువారం అధికారులు ప్రకటించిన గణాంకాలు పరిశీలిస్తే ఏకంగా పరీక్షలు చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌గా వస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,210 మందికి అనుమానిత పరీక్షలు చేస్తే అందులో 853మందికి పాజటివ్‌గా నిర్ధారణ అయింది. దాని ప్రకారం పాజిటివిటి రేటు 38.60శాతంగా ఉంది.

పెరుగుతున్న పాజిటివిటీ

నాలుగు రోజుల్లోనే 8.6 నుంచి 38.60 శాతానికి..

ముగ్గురిలో ఒకరికి వైరస్‌

ప్రజలపై పంజా విసురుతున్న కొవిడ్‌

తాజాగా 2,210 టెస్టులు చేస్తే 853 పాజిటివ్‌లు

రెడ్‌ జోన్‌లోకి 18 మండలాలు, ఒంగోలులో ఆందోళనకరం

ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గురువారం అధికారులు ప్రకటించిన గణాంకాలు పరిశీలిస్తే ఏకంగా పరీక్షలు చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌గా వస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,210 మందికి అనుమానిత పరీక్షలు చేస్తే అందులో 853మందికి పాజటివ్‌గా నిర్ధారణ అయింది. దాని ప్రకారం పాజిటివిటి రేటు 38.60శాతంగా ఉంది. పరీక్షల సంఖ్య పెంచితే కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో రెండవ వేవ్‌ తగ్గిన అనంతరం ఇంత భారీగా కేసులు  నమోదు కావడం ఇదే ప్రథమం. డిసెంబరు నుంచి మూడో వేవ్‌గా పరిగణిస్తున్నా.. ఈనెల తొలివారం వరకు నామమాత్రంగానే కేసులు వచ్చాయి. ఇక సంక్రాంతి అనంతరం మరింతగా భారీగా పెరిగాయి. జిల్లాలో 17న 8.60శాతం పాజిటివిటీ రేటు ఉండగా 18న 19.41శాతం, 19న 32.50 శాతంకు చేరుకోగా గురువారం ఏకంగా 38.60కి పెరిగింది. గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం 89 పీహెచ్‌సీల పరిధిలో కేసులు నమోదయ్యాయి. గరిష్ఠంగా ఒంగోలులోని యానాది కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 115కేసులు నమోదు కాగా ఒంగోలులోనే ఎంఎంరోడ్డు యూహెచ్‌సీ  పరిధిలో 81, పీపీయూనిట్‌ పరిధిలో  82 కేసులు  నమోదయ్యాయి. ఇంకొల్లు పీహెచ్‌సీ పరిధిలో 65 నమోదు కాగా మరో 16 పీహెచ్‌సీల పరిధిలో రెండంకెలకు మించి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 18 మండలాలు రెడ్‌ జోన్‌లోకి చేరాయి. ఒంగోలు, అద్దంకి, సింగరాయకొండ, బల్లికురవ, చీమకుర్తి, జే.పంగులూరు, సీఎస్‌పురం, మద్దిపాడు, ఎస్‌ఎన్‌పాడు, యద్దనపూడి, కొరిశపాడు, మార్టూరు, టంగుటూరు, కొండపి, ఉలవపాడు, పెద్దారవీడు, గిద్దలూరు మండలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఒంగోలులో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల్లో జిల్లాలో 2,169 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఒక్క ఒంగోలు నగరం, రూరల్‌ మండలం గ్రామాల్లోనే 929 కేసులు నమోదయ్యాయి. కందుకూరు, సింగరాయకొండ, అద్దంకి, చీమకుర్తి తదితర ప్రాంతాల్లోనూ అధికంగానే కేసులు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వపరంగా జరుగుతున్న పరీక్షలకు రెండు, మూడురెట్లపైనే ప్రజలు ఎవరికివారు ప్రైవేటుగా టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ మేరకు కేసులు కూడా నమెదు అవుతున్న అవి లెక్కల్లోకి రావడం లేదు. దీనిని బట్టి చూస్తే జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. 95శాతం మంది ఇళ్ల దగ్గర నుంచే చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో అదిఇకారిక లెక్కల ప్రకారం చేసినా కరోనా టెస్టలు, నమోదైన కేసులు, పాజిటివిటి రేటు ఇలా ఉన్నాయి.

తేదీ టెస్టులు నమోదైన కేసులు పాజటివిటిరేటు

-----------------------------------------------------------------------------------

17.1.22 2,249 179 8.60

18.1.22 2,204 426 19.41

19.1.22 2,201 716 32.50

20.1.22 2,210 853 38.60

..........................................................

 

కొత్తగా 853 కొవిడ్‌ పాజిటివ్‌లు

  జిల్లాలో కొవిడ్‌ ఉధృతి పెరిగింది. గురువారం ఒక్క రోజులోనే 853మంది వైరస్‌ బారినపడ్డారు. ఒంగోలులో 347, అద్దంకిలో 86, శింగరాయకొండలో 49, బల్లికురవలో 31, చీమకుర్తిలో 27, జె.పంగులూరులో 26, సీఎస్‌పురంలో 24, మద్దిపాడులో 21, ఎస్‌ఎన్‌పాడులో 20, సంతమాగులూరులో 16, యద్దనపూడిలో 16, మార్టూరులో 14, కొరిశపాడులో 14, టంగుటూరులో 14, కొండపిలో 13, ఉలవపాడులో 13, పెదారవీడులో 12, గిద్దలూరులో 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వాటితోపాటు ఇంకా పలు మండలాల్లో కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని ఇప్పటివరకు 1,41,875 మంది వైరస్‌ బారిన పడగా, 1,37,831మంది కోలుకున్నారు. 1,131 మంది మరణించగా, 2,913 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2022-01-21T05:20:16+05:30 IST