పెరుగుతున్న పాజిటివ్స్‌

ABN , First Publish Date - 2020-05-28T09:32:06+05:30 IST

గ్రేటర్‌ పరిధిలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన మహిళ, దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రవాసీయుడు, అల్వాల్‌లో కొడుకు వద్దఉంటున్న నిజామాబాద్‌కు చెందిన వృద్ధురాలు మృతి చెందారు.

పెరుగుతున్న పాజిటివ్స్‌

ఎర్రగడ్డ/బర్కత్‌పుర/మెహిదీపట్నం/చాదర్‌ఘాట్‌/ఖైరతాబాద్‌/ముషీరాబాద్‌/ఆనంద్‌బాగ్‌/ఉప్పల్‌/జీడిమెట్ల/ఏఎ్‌సరావునగర్‌/అఫ్జల్‌ గంజ్‌/కుత్బుల్లాపూర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన మహిళ, దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రవాసీయుడు, అల్వాల్‌లో కొడుకు వద్దఉంటున్న నిజామాబాద్‌కు చెందిన వృద్ధురాలు మృతి  చెందారు.  


ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు..

గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) కానిస్టేబుల్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. నాచారం రాఘవేంద్రనగర్‌లో నివసించే అతడికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అతడి భార్య, కుమారుడి(11)ని వైద్య పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. రాఘవేంద్రనగర్‌లో కానిస్టేబుల్‌ నివసించే అపార్ట్‌మెంట్‌ను కట్టడి చేశారు. 


ఏఎ్‌సరావునగర్‌లో వృద్ధురాలికి..

ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌లో వృద్ధురాలి(82)కి కరోనా సోకింది.   కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు వైరస్‌ లక్షణాలు ఉండడంతో ఈ నెల 25న గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. 27న వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌ అని తేలింది. ఆమె ఇంటిని కట్టడి చేశారు. కుటుంబ సభ్యులు ముగ్గురిని, సమీపంలోని ఇంటి పనిమనిషి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 


మహారాజ్‌గంజ్‌లో మహిళకు..

మహారాజ్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ(53) రక్త నమూనాలను కింగ్‌కోఠి ఆస్పత్రిలో సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఫలితాల్లో పాజిటివ్‌ వచ్చింది. ఆమెను ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. భర్త, పనిమనిషిని క్వారంటైన్‌ చేశారు.

 

గాజులరామారం సర్కిల్‌లో వ్యక్తికి..

 గాజులరామారం సర్కిల్‌ నెహ్రూనగర్‌లో ఓ వ్యక్తి(41)కి వైరస్‌ సోకింది. నెహ్రూనగర్‌లోని వ్యక్తి నివాస ప్రాంత పరిసరాలను కట్టడి చేశారు. 


మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో..

మల్కాజిగిరి సర్కిల్‌ ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ పరిధిలోని వసంతపురికాలనీలో మహిళ (48)కు వైరస్‌ సోకింది. ఆమెకు ఛాతీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహిళ ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు కట్టడి చేశారు.


భోలక్‌పూర్‌ గుల్షన్‌నగర్‌లో..

భోలక్‌పూర్‌ గుల్షన్‌నగర్‌లో మహిళ (40)కు పాజిటివ్‌ వచ్చింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది గుల్షన్‌నగర్‌లో ఆమె కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. పరిసర ప్రాంతాలను కట్టడి చేశారు.


చంచల్‌గూడలో ..

చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి(56)కి పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అతడి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


బషీర్‌బాగ్‌లో..

బషీర్‌బాగ్‌ పాలస్‌ నగర్‌కు చెందిన ఓ వృద్ధుడి(85)కి పాజిటివ్‌ వచ్చింది. ఇతడికి వైరస్‌ లక్షణాలు ఉండడంతో అపోలో ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం అక్కడే చికిత్స చేస్తున్నారని  సైఫాబాద్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. 


బాగ్‌లింగంపల్లిలో టైలర్‌కు..

బాగ్‌లింగంపల్లిలో టైలర్‌షాప్‌ నిర్వహిస్తున్న వ్యక్తి(56)కి పాజిటివ్‌ వచ్చింది. అతడిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌కు తరలించారు. 


అంబర్‌పేటలో వ్యక్తికి..

అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 


కుత్బుల్లాపూర్‌ గణే్‌షనగర్‌లో యువకుడికి..

కుత్బుల్లాపూర్‌లోని చింతల్‌ గణే్‌షనగర్‌లో యువకుడి(28)కి పాజిటివ్‌ వచ్చింది. బాధితుడు ఓ ఫార్మా కంపెనీలో పని చేసున్నాడు. అతడి ముగ్గురి కుటుంబ సభ్యులతోపాటు అదే భవనంలో అద్దెకు ఉంటున్న మరో 12 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అతడి ఇంటిని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు.


ఆస్పత్రుల్లో అనుమానితుల చేరిక

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో బుధవారం మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, అమీర్‌పేటకు చెందిన ముగ్గురు తీవ్ర జ్వరంతో ఫీవర్‌ ఆస్పత్రికి రాగా ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వారి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో 10 అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నారు. బుధవారం కరోనా ఓపీకి పదిమంది రాగా వారిలో ఇద్దరికి వైరస్‌ లక్షణాలు ఉండడంతో అడ్మిట్‌ చేసుకున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు.


నెగెటివ్‌ వచ్చిన 17 మందిని డిశ్చార్జి చేశారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో 19 అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను సేకరించామని, ఫలితాలు రావాల్సి ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. సరోజినిదేవీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో 19 మంది అనుమానితులు ఉన్నారని డాక్టర్‌ అనురాధ తెలిపారు. మస్కట్‌ నుంచి వచ్చిన 30 మంది విదేశీ ప్రయాణికులను గోల్కొండలోని తారామతి బారాదారిలో క్వారంటైన్‌లో ఉంచారు. 


కట్టడిలోకి సుందర్‌నగర్‌ 

గోల్నాక సుందర్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధుడు(79) కరోనాతో మంగళవారం మరణించడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కట్టడి చేశారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు 11 మందిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా 77 ఏళ్ల అతడి సోదరికి, 44 ఏళ్ల కొడుకుకుపాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి నెగెటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌కు తరలించారు. 


బీజేఆర్‌ నగర్‌ 11మంది క్వారంటైన్‌కు

ఖైరతాబాద్‌ బీజేఆర్‌ నగర్‌లో కరోనాతో ఓ మహిళ  మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులైన 11 మందిని సరోజినీదేవి ఆస్పత్రిలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వారి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు సర్కిల్‌ 17 ఉపకమిషనర్‌ గీతారాధిక తెలిపారు.

Updated Date - 2020-05-28T09:32:06+05:30 IST