పెరుగుతున్న గుండె జబ్బులు

ABN , First Publish Date - 2022-09-29T05:44:35+05:30 IST

హార్ట్‌ ప్రాబ్లమ్‌...ఈ మధ్యకాలంలో తరచూ వింటున్న మాట. ఒకప్పుడు వయసుపైబడిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తరువాత యువతలోనూ గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబరు 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందిస్తున్న కథనం...

పెరుగుతున్న గుండె జబ్బులు

కొవిడ్‌ తరువాత 5-10 శాతం అధికం

యువతలోనూ బహిర్గతం

జీవనశైలే ప్రధాన కారణం

మార్పులతో సమస్యలకు చెక్‌ చెప్పవచ్చునంటున్న వైద్యులు

మద్యానికి, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి

బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి

ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి

నేడు వరల్డ్‌ హార్ట్‌ డే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

హార్ట్‌ ప్రాబ్లమ్‌...ఈ మధ్యకాలంలో తరచూ వింటున్న మాట. ఒకప్పుడు వయసుపైబడిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తరువాత యువతలోనూ గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబరు 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందిస్తున్న కథనం... 


గుండె జబ్బులు...రకాలు

గుండె జబ్బులు మూడు రకాలు. కంజినెటల్‌ (పుట్టుకతో వచ్చేవి) హార్ట్‌ డిసీజ్‌, రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌, కరొనరీ ఆర్టరీ డిసీజ్‌. అయితే, ప్రతి వంద గుండె జబ్బుల్లో 90 కరొనరీ ఆర్టరీ డిసీజ్‌లే ఉంటున్నాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో  అడ్డంకులు ఏర్పడితే తలెత్తే సమస్యను ఆర్టరీ డిసీజ్‌గా పేర్కొంటారు. దీనివల్ల గుండెకు ఆక్సిజన్‌, పోషక పదార్థాల సరఫరా నిలిచిపోయి కండరాలు చచ్చుబడిపోతాయి. దీన్నే హార్ట్‌ ఎటాక్‌, మయో కార్డియల్‌ ఇంప్రెషన్‌గా చెబుతారు.


ఇవీ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌.. 

హార్ట్‌ ఎటాక్‌కు స్మోకింగ్‌, బీపీ, షుగర్‌, అధిక కొలెస్ర్టాల్‌, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. 


అప్రమత్తం కావాలి.. 

ఛాతీ మధ్యభాగంలో నొప్పి, గుండె బరువుగా అనిపించి ఎడమ చేతివైపు లోపలకు లాగుతున్నట్టు ఉండడం, బొడ్డు నుంచి కింది దవడ వరకూ పది నిమిషాల కంటే ఎక్కువసేపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకారణంగా చెమటలు పట్టడం, పొత్తికడుపులో నొప్పి, కాళ్లు, చేతులు లాగుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. కొందరిలో కొన్ని నెలల ముందు నుంచి లక్షణాలు కనిపిస్తాయి. రోజువారీ చేసే పని చేయలేకపోవడం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రతించాలి. ఈసీజీ, 2డీ ఎకో, లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. 


వీటితో చెక్‌.. 

గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం, మద్యపానానికి, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, ఫ్యాటీ ఫుడ్‌ తీసుకోకపోవడం, ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడం, ఏటా పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. 


కొవిడ్‌ తరువాత.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి తరువాత గుండె జబ్బులు బారినపడుతున్నవారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్‌ క్లాటింగ్‌ మెకానిజం పెరిగి యువత కూడా గుండె సంబంధిత సమస్యలతో వస్తున్నట్టు పేర్కొంటున్నారు. కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగానికి వస్తున్న యువతలో అంతా కొవిడ్‌ నుంచి కోలుకున్నవారే వుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ తరువాత గుండె జబ్బులు 5-10 శాతం పెరిగాయి. 


కేజీహెచ్‌ లెక్క.. 

కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగానికి వస్తున్న రోగులు సంఖ్య ఏటా పెరుగుతోంది. వారంలో మూడు రోజులు ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 300-400 మంది వస్తుంటారు. ఇక్కడ ప్రతినెలా 100-120 మందికి యాంజియోగ్రామ్స్‌, 30-50 మందికి యాంజియోప్లాస్టీ చేస్తుంటారు. ఈ విభాగంలో టీఎంటీ, ఈసీజీ వంటి పరీక్షలు చేస్తారు. ప్రతి శనివారం స్టెంట్‌ క్లినిక్‌ రన్‌ చేస్తారు. స్టెంట్లు వేయించుకున్నవారు ఏడాది వరకు ఇక్కడకు వచ్చి చూపించుకుంటారు. 


2030 నాటికి మూడు మరణాల్లో ఒకటి గుండె జబ్బుతోనే.. 

- డాక్టర్‌ పీవీఎన్‌ఎం కుమార్‌, కార్డియాలజీ వైద్య నిపుణులు, కేర్‌ ఆస్పత్రి

గుండె జబ్బులు బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2030 నాటికి 35-64 ఏళ్ల వయసులో సంభవించే ప్రతి మూడు మరణాల్లో ఒకటి గుండెకు సంబంధించినది అయి వుంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు ప్రధానంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలి. బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి. అలాగే జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు చెక్‌ చెప్పవచ్చు. ఇంకా ఒత్తిడి కూడా గుండెను బలహీనపరుస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. కనీసం 6-7 గంటలు నిద్ర వుండేలా చూసుకోవాలి. వాయు కాలుష్యం వల్ల కూడా 25 శాతం గుండె జబ్బులు సంభవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 


ఓపీకి వస్తున్న కేసులు పెరుగుతున్నాయి.. 

- డాక్టర్‌ బి.ఆదిలక్ష్మి, కార్డియాలజీ విభాగ ప్రొఫెసర్‌, కేజీహెచ్‌

గుండె సంబంధిత సమస్యలతో కేజీహెచ్‌కు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా కొవిడ్‌ తరువాత ఎక్కువగా యువకులు వస్తున్నారు. క్లాట్స్‌ వల్ల రక్తనాళాలు బ్లాక్‌ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ను కంట్రోల్‌ వుంచుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. కేజీహెచ్‌కు వచ్చే రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. యాంజియోగ్రామ్‌, యాంజియోప్లాస్టీ, పేస్‌ మేకర్‌ వంటివి చేస్తున్నాం. 


Updated Date - 2022-09-29T05:44:35+05:30 IST