పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-22T06:19:35+05:30 IST

నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు
శ్వాబులు తీస్తున్న వైద్యసిబ్బంది

కనిగిరి, జనవరి 21: నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డాక్టర్‌ ఎ నాగరాజ్యలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం గడిచిన నాలుగు రోజులుగా కనిగిరి మండలంలో 100 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 28 కేసులు నమోదయ్యాయి. వివిధ గ్రామాల్లో 15 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ముమ్మరంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు కరోనా నియంత్రణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. వీధులవెంట బ్లీచింగ్‌ చల్లుతూ, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో మురుగు కాలువల్లో ఫాగింగ్‌ చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో 6 వేల మందికి కరోనా టీకా వేశారు.

వెలిగండ్లలో : మండలంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు, వెలిగండ్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యసిబ్బంది తెలిపారు. అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కరోనా లక్షణాలు ఉండటంతో హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు సమాచారం. మండలంలో దుకాణాల వద్ద భౌతికదూరం పాటించకుండా, మాస్క్‌లు లేకుండా ఇష్టానుసారం సంచరించడంతో కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కరోనా వైర్‌సపై అవగాహన కల్పించాలని, దుకాణాల్లో భౌతికదూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు 

ముండ్లమూరు : మండల కేంద్రం ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో రెండు కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. ముండ్లమూరులో ఒకటి, పెద ఉల్లగల్లులో ఒకటి కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించటం, శానిటేజర్‌ పాటించటం చేయాలన్నారు.

Updated Date - 2022-01-22T06:19:35+05:30 IST