దాచిపెట్టొద్దు

ABN , First Publish Date - 2020-06-07T07:55:13+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లావాసులు వచ్చేస్తున్నారు.

దాచిపెట్టొద్దు

బయటి వ్యక్తుల వివరాలను

వలంటీర్లకు అందిస్తే రక్షణ

పెరుగుతున్న కరోనా కేసులు

బయటి ప్రాంతాల నుంచి

వచ్చినవారిలోనే ఎక్కువ కేసులు

తాజాగా ఏడు కేసుల నమోదు


చిత్తూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లావాసులు వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్నవారిలో ఎక్కువగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత నమోదవుతున్న కేసుల్లో అధికంగా ఇలాంటివే ఉన్నాయి. తాజాగా శనివారం జిల్లాలో ఏడు కేసులు బయటపడగా.. వారంతా హైదరాబాదు, చెన్నై నుంచి వచ్చినవారేనని అధికారులు తేల్చారు. ఇటువంటి వారు తమకై తామే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.


దాచిపెడితే వైరస్‌ వ్యాప్తికి కారకులవుతారని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుతో కేసుల సంఖ్యను అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా స్వచ్ఛందంగా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలు వచ్చేవరకు ఇంట్లోనే ఉండాలి. బంధువులను, స్నేహితులను, చుట్టుపక్కలవారిని కలవకూడదు. ఆయా ప్రాంతాల్లో బయటి నుంచి వచ్చినవారిని చుట్టుపక్కలవారు గుర్తించి వలంటీర్లకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. అప్పుడే కరోనా వ్యాప్తిని కాస్తయినా నివారించగలమని అధికారులు సూచిస్తున్నారు.


హైదరాబాద్‌, చెన్నై నుంచి వచ్చిన వారికే..

జిల్లాలో మరో ఏడుగురికి కరోనా సోకినట్లు శనివారం అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 389కి చేరింది. చిత్తూరు నగరంలో రెండు, శ్రీకాళహస్తి, పుత్తూరు, కేవీబీపురం, చంద్రగిరి, కేవీపల్లె మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. శ్రీకాళహస్తి, కేవీపల్లె, కేవీబీపురం మండలాలకు చెందిన వ్యక్తులు ఇటీవల చెన్నై నుంచి, పుత్తూరుకు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చారు. వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోగా శనివారం ఫలితం పాజిటివ్‌గా వచ్చింది.ఇక చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన దంపతులిద్దరికీ శనివారం పాజిటివ్‌ వచ్చింది.


వీరిలో పాజిటివ్‌ వచ్చిన మహిళ హైదరాబాదులో ఎస్‌ఐగా పనిచేస్తున్న కొడుకు వద్ద నుంచి ఒంగోలులో ఉద్యోగం చేస్తున్న భర్త వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి చిత్తూరుకు మే 31వ తేదీన వచ్చారు. చంద్రగిరిలో ఉంటున్న వారి అల్లుడు గూడూరు నుంచి చిత్తూరుకు తీసుకొచ్చాడు. హైదరాబాదులో వున్న కొడుకు, కోడలికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురూ శుక్రవారం కరోనా పరీక్షలు చేసుకున్నారు. వీరి ఫలితాలు శనివారం పాజిటివ్‌గా వచ్చాయి.

Updated Date - 2020-06-07T07:55:13+05:30 IST