అరాచకానికి అడుగు దూరం!

ABN , First Publish Date - 2020-09-12T09:04:19+05:30 IST

ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, గొడవలు! ఒక్కసారి ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరి పని వారిదే! కానీ... ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీన్‌ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే...

అరాచకానికి  అడుగు దూరం!

  • ఒకప్పటి బిహార్‌,  యూపీని తలపిస్తున్న ఏపీ
  • పైస్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం
  • కింది స్థాయి శ్రేణులకు అదే ‘ఆదర్శం’
  • కప్పం కట్టకపోతే భూమి వెనక్కి
  • గనుల్లో వాటాలు, పూర్తిగా స్వాధీనం
  • ‘స్థానికం’లో పతాక స్థాయికి దౌర్జన్యాలు
  • ఐఏఎ్‌సలనూ నిలబెట్టి బెదిరించడమే!
  • దళితులపై పెరుగుతున్న దాడులు
  • తప్పు పట్టాలంటే వణుకుతున్న తటస్థులు
  • గతంలో ఎన్నడూ లేదంటున్న విశ్లేషకులు


‘ఓ... మీరు బిహార్‌ ఎప్పుడూ చూడలేదా! మరికొన్ని నెలలు ఆగండి! మన ఏపీ మరో బిహార్‌ అవుతుంది!’...సుమారు ఏడాది క్రితం వినిపించిన వ్యాఖ్య ఇది! ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, అరాచకానికి ఆంధ్రప్రదేశ్‌ మరొక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది! ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం, మరికొన్ని ప్రాంతాల్లో రౌడీయిజం ఉండేవి. అవన్నీ దాదాపుగా పోయాయి. ఇప్పుడు... మళ్లీ ‘అధికారిక అరాచకం’ మొదలైందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి... బిహార్‌ ఎప్పుడో మారిపోయింది. ఏపీలో మాత్రం ఒకప్పటి బిహార్‌ తరహా దందా, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి.


 (అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, గొడవలు! ఒక్కసారి ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరి పని వారిదే! కానీ... ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీన్‌ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే... తెలుగుదేశం మద్దతుదారులపై దాడులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఏకంగా టీడీపీ సానుభూతిపరులు రోడ్డెక్కకుండా అడ్డంగా గోడలు కట్టేశారు. క్షేత్రస్థాయిలో శ్రేణులు తెగబడటానికి పైస్థాయిలో నేతల ధోరణే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు... ఆ స్థానంలో బూతులు ప్రవేశించాయి.


స్వయంగా మంత్రులే విపక్ష నేతలను ‘వాడు వీడు’తోపాటు రాయలేని విధంగా బూతులు తిడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ  అదే తీరు. ఇక... శ్రుతిమించి మాట్లాడుతున్న వారిని అధినేత మందలించడంలేదు. దీంతో... ‘విపక్ష నేతలను ఇలాగే తిట్టాలి. కుదిరితే కొట్టాలి’ అనే సంకేతాలు కిందిస్థాయికి వెళ్లిపోయాయి. ‘యథానేతా... తథా అనుచరులు’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వీరిని పోలీసులు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అధికారులు స్వయంగా ఈ అరాచకాలకు సహకరిస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... 


 కొత్తరకం దందా...

చాలా ఏళ్ల కిందటి మాట! బిహార్‌లో రోడ్డుపక్కన మంచి ఖరీదైన కొత్త కారు కనిపిస్తే... లోకల్‌ దాదాలు ఎత్తుకెళ్లి పోయేవారు. దాని యజమాని వచ్చి... కారు ఖరీదులో పది శాతమో, 20 శాతమో సమర్పించుకుంటే కారు తిరిగి ఇచ్చే వాళ్లు. ఏపీలో ఇంత ఘోరాలు జరగడంలేదుకానీ... ఇవే తరహా బెదిరింపులు మొదలయ్యాయి. విశాఖపట్నంలో భూములపై కన్నేసిన ముఠా ఒకటి రంగంలోకి దిగింది. ‘‘మీ భూమిపై పాత వివాదాలు ఉన్నాయి. మాకు రూ.10 కోట్లు ఇస్తే సరేసరి. లేదంటే... భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’’ అని బేరసారాలు మొదలుపెట్టారు. అందుకు భూ యజమాని నిరాకరించారు. అచ్చంగా... ఆ గ్యాంగ్‌ చెప్పినట్లే సదరు భూమిని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా... ఆ ముఠా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఈ సారి రూ.80 కోట్లు డిమాండ్‌ చేసి, ఇప్పటికైనా డబ్బులిస్తే విషయం ‘సెటిల్‌’ అవుతుందని తెలిపింది. భూ యజమాని వీరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అమ్ముకుని సొమ్ములు చేసుకోవడం చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు.... ఈ ఉదంతం ‘బిహార్‌’ను గుర్తుకు తెచ్చింది. 


 వాటాలు, కోటాలే...

బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, గనుల యజమానుల నుంచి పార్టీకి విరాళాలు తీసుకోవడం మామూలే! కానీ... ఇప్పుడు ట్రెండ్‌ మారింది. బాగా లాభాలు వచ్చే గ్రానైట్‌, లేటరైట్‌ గనులను సొంతం చేసుకోవడం మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇలా లేటరైట్‌ గనుల్లో 80 శాతానికి పైగా వాటా రాయించేసుకున్నారు. ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్‌ గనుల్లో వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీలో చేరకపోయినా, వాటాలు ఇవ్వకపోయినా.... 200 కోట్లు  జరిమానా కట్టాలంటూ నోటీసులు వచ్చేస్తాయ్‌! గనులకు అనుమతులు నిలిచిపోతాయ్‌! ఇలాంటి ఘటనలు అచ్చం బిహార్‌ను గుర్తుకు తెస్తున్నాయి. ఇక... చోటామోటా టెండర్లన్నీ అధికార పార్టీ వారు చెప్పిన వారికే వెళ్తున్నాయి. ఇతరులు టెండర్లు వేయడానికి వీల్లేకుండా కట్టడి చేస్తున్నారు. 


 ‘స్థానికం’లో శ్రుతిమించి..

సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలప్పుడు గొడవలు కామన్‌! ప్రత్యర్థులు ఎదురు పడితే ఉద్రిక్తతలు తలెత్తుతాయి. కానీ... ఇటీవలి స్థానిక ఎన్నికల ప్రక్రియ అరాచకాలు, దౌర్జన్యాలకు పరాకాష్ఠలా మారింది. పల్నాడు ప్రాంతంలో నామినేషన్‌ వేయలేకపోయిన తమ నేతలకు భరోసా ఇచ్చేందుకు విజయవాడ నుంచి వెళ్లిన టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వాహనంపై గురజాలలో వైసీపీ అభ్యర్థి బారెడు పొడవున్న కర్రతో దాడి చేశాడు. కారు అద్దాలను బద్దలుకొట్టి, లోపలున్న వారిని గాయపరిచాడు. డ్రైవర్‌ చాకచక్యంతో బతికిబయటపడ్డామని, లేకపోతే అక్కడే ప్రాణాలు పోయేవని టీడీపీ నేతలు వాపోయారు. ఇక... ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన వారిచేత దగ్గరుండి ఉపసంహరింపజేయడంవంటివెన్నో జరిగాయి.


 నోరెత్తాలంటే భయమే..

గతంలో ప్రభుత్వ విధానాల్లోని మంచి చెడ్డలపై తటస్థ నిపుణులు, విశ్లేషకులు, సామాజిక వేత్తలు స్వేచ్ఛగా  మాట్లాడేవారు. ఇప్పుడు... అంతా గప్‌చుప్‌. ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తి చూపేందుకు వణికిపోతున్నారు. ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే... సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతాయి. బెదిరింపులూ తప్పవు. దీంతో... విపక్ష నేతలు మినహా మిగిలిన వారంతా గప్‌చుప్‌! పీఆర్సీ ఇవ్వకున్నా, ఐఆర్‌లు మంజూరు చేయకున్నా ఉద్యోగ సంఘాల నేతలు నోరెత్తడంలేదు. ఉన్నత స్థాయి అధికారులు సైతం... ఫోన్లలో మాట్లాడాలంటే భయపడుతున్నారు. 


 సామాన్యులనూ వదలరు..

ఇటీవల... కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో సరదాగా పేకాడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి... స్థానిక టీడీపీ నేత బెయిలు ఇప్పించి బయటికి తీసుకొచ్చారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతూ వాట్సా్‌పలో స్టేటస్‌ పెట్టిన యువకుడిపై వైసీపీ నేతలు కన్నెర్ర చేశారు. ‘పిలిచి కోటింగ్‌ ఇవ్వండి’ అని పోలీసులకు ‘హుకుం’ జారీ చేశారు. దీంతో... పోలీసులు  ఆ యువకులందరినీ   రప్పించి, స్టేటస్‌ పెట్టిన యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఈ అవమానం భరించలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అరాచకాలకు ఇదొక ఉదాహరణ. 


 దళితులను ఉపయోగించుకుంటూ..

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు భారీగా జరుగుతున్నాయి. విశాఖలో దళిత వైద్యుడి సుధాకర్‌ ఉదంతం సంచలనం సృష్టించింది. ఇక... తూర్పు గోదావరిలో దళిత యువకుడికి ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. కేసు వాపస్‌ తీసుకోలేదని  కృష్ణా జిల్లా అయినంపూడిలో దళిత కుటుంబానికి చెందిన ఇంటిని తగలబెట్టారు. ఇలాంటివి ఎన్నో! మరోవైపు... గిట్టని వారిపై ఇదే దళితులను ఉపయోగించుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. 


అధికారుల్లో గుండె దడ...

ఐఏఎస్‌ అధికారులది ఒక స్థాయి! ఇప్పుడు వారి పట్ల కూడా మర్యాద లేకుండా పోయింది. ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్‌ పదవి నుంచి అవమానకరంగా పంపించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, జాయింట్‌ కలెక్టర్లపట్ల వైసీపీ నేతల్లోనూ చులకన భావన ఏర్పడింది. ఐఏఎ్‌సలు ఉన్నది తాము చెప్పింది చెయ్యడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో భూముల స్కామ్‌కు  అంగీకరించకపోవడంతో.. స్వయంగా కలెక్టర్‌నే స్థానిక నేతలు బెదిరించారు. ‘సంతకం పెట్టకుంటే వెళ్లిపో’ అని హెచ్చరించడంతో... సదరు అధికారి సెలవుపై వెళ్లి, తర్వాత బదిలీ చేయించుకున్నారు. విశాఖలో మరో జిల్లా అధికారి చెప్పిన పని చేయడంలేదంటూ, ఫోన్‌ చేసి తిడుతున్నారని తెలిసింది. మండల స్థాయిలో తహశీల్దార్లు అధికార పార్టీ నేతల వేధింపులు భరించలేకపోతున్నారు. కర్నూలు జిల్లాలో తాము చెప్పిన పని చేయలేదంటూ... ఒక తహశీల్దార్‌ బంధువును కిడ్నాప్‌ చేశారు. తమ పని చేసిన తర్వాతే విడిచిపెట్టారు.


పట్టించుకునే దిక్కు లేదు

ఏదైనా ఆందోళన జరిగితే... ‘మీ సమస్య పరిష్కరిస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు కనీస భరోసా ఇవ్వడం సహజం. ఇప్పుడు ఆ సంప్రదాయం మాయమైపోయింది. గత ఏడాది జూన్‌లో బీమా మిత్రలు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ధర్నా చేశారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులు, కల్యాణమిత్రలు, సాక్షర భారత్‌ ఉద్యోగులు, బీమా కాల్‌ సెంటర్‌ సిబ్బంది, వెలుగు ఉద్యోగులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది, అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్లు, సర్వశిక్ష అభియాన్‌ సిబ్బంది, గోపాల మిత్రలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సీ డాక్‌ సిబ్బంది, రేషన్‌ డీలర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ఇలా ఎంతోమంది సీఎం జగన్‌ నివాస ప్రాంతానికి సమీపంలో ధర్నాలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఏ ఒక్కరినీ పిలిచి మాట్లాడలేదు. తర్వాత... కొన్నాళ్లకు తాడేపల్లి నివాసం చుట్టుపక్కల ధర్నాలకు అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 


ఇలా ఎన్నెన్నో... 

  1. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు ఎంతకీ విడుదల చేయకపోవడంతో ఎస్‌ఎ్‌ఫఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గత ఏడాది ఆగస్టులో రోడ్డెక్కాయి. ఫీజు చెల్లించి సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఏలూరులో ఎస్‌ఎ్‌ఫఐ, గుంటూరులో ఏబీవీపీ విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు.  
  2. మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో నిరసన చేపట్టిన ఏఐఎ్‌సఎఫ్‌ ధర్నాపైనా పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
  3. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే  స్వయంగా మండల స్థాయి మహిళా అధికారి ఇంటిపై దాడికి దిగి నానా బీభత్సం  సృష్టించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు ఖాకీలు ముందుకు రాలేదు. బాధితురాలు స్టేషన్‌ ముందే నిరసనకు దిగడంతో టీవీ చానెళ్లు ఆ దృశ్యాలను ప్రసారం చేశాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో వేకువజామున కేసు పెట్టిన పోలీసులు తెల్లారేసరికి ఎమ్మెల్యేను అరెస్టు చేసి... బెయిలుపై పంపించారు.
  4. ఇటీవల కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేశ్‌ గ్రామ సచివాలయ ఉద్యోగిపై దాడిచేసి మహిళా సిబ్బంది సమక్షంలో నానా దుర్భాషలాడారు. కార్యాలయంలో కుర్చీలు ధ్వంసంచేసి వీరంగం సృష్టించాడు. ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగితే అడ్డుకున్న పోలీసులు.... అసలు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
  5. అనంతపురం జిల్లాలో రమేశ్‌ అనే వైసీపీ లీడర్‌ రోడ్డు పనులు చేయిస్తోన్న ఇంజినీర్‌ను చెప్పు కాలితో తన్నాడు. 

Updated Date - 2020-09-12T09:04:19+05:30 IST