ఉగ్ర నాగావళి!

ABN , First Publish Date - 2021-09-28T05:30:00+05:30 IST

నాగావళి ఉగ్రరూపం దాల్చింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మరోవైపు ఒడిశా రాష్ట్రంలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కూడా కురిసిన భారీ వర్షాలకు నాగావళి నదిలోకి వరదనీరు చేరుతోంది. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వ సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టుల్లోని నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంత గ్రామాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో తీర ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.

ఉగ్ర నాగావళి!
పాలకొండ-అన్నవరం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వరద నీరు

- నదిలో పెరిగిన నీటి ప్రవాహం

- వివిధ గ్రామాల్లోకి చేరిన వరదనీరు

- ఆందోళనలో నదీ తీరప్రాంత వాసులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/పాలకొండ)

 నాగావళి ఉగ్రరూపం దాల్చింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మరోవైపు ఒడిశా రాష్ట్రంలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కూడా కురిసిన భారీ వర్షాలకు నాగావళి నదిలోకి వరదనీరు చేరుతోంది. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వ సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టుల్లోని నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంత గ్రామాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో  తీర ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.  శ్రీకాకుళంలోని పాత, కొత్త వంతెనల వద్ద నాగావళికి మంగళవారం సాయంత్రానికి దాదాపు 63 వేల క్యూసెక్కుల నీరు చేరిందని అంచనా. నాగావళికి 94 క్యూసెక్కులు నీరు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నాగావళికి వరద చేరిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, బూర్జ, పాలకొండ, రేగిడి, వంగర మండలాలతో పాటు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- పాలకొండ డివిజన్‌లో నాగావళి ఉధృతి అలజడి రేపుతోంది. సోమవారం అర్థరాత్రి పాలకొండ మండలంలో 80 వేల నుంచి లక్ష క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. అన్నవరం, గోపాలపురం, అంపిలి తదితర గ్రామాల్లోకి మంగళవారం వరదనీరు చొచ్చుకు వచ్చింది. అన్నవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయంలో వరదనీరు ప్రవేశించింది.  విధుల నిర్వహణకు సిబ్బందికి ఆటంకం కలిగింది. 

- పాలకొండ-అన్నవరం, పాలకొండ-అంపిలి, అల్లెన తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై వరదనీరు ప్రవహించడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అర్థరాత్రి నుంచి ఆ రహదారిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. 


 మృతదేహం తరలింపునకు అవస్థలు :

పాలకొండ ఏరియా ఆస్పత్రిలో అల్లెన గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు మృతి చెందాడు. అల్లెన గ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా తరలించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. పాలకొండ, అన్నవరం, అంపిలి రహదారిపై భారీగా వరదనీరు ప్రవహించడంతో అల్లెన గ్రామానికి రాకపోకలు  నిలిచిపోయాయి.  దీంతో  మృతుని కుటుంబ సభ్యులతో ఎస్‌ఐ ప్రసాద్‌ మాట్లాడారు. ట్రాక్టర్‌పై మృతదేహాన్ని అల్లెన గ్రామానికి తరలించారు. 


ట్రాక్టర్‌పై గ్రామాల్లో పర్యటన

అన్నవరం, అంపిలి, గోపాలపురం నదితీర గ్రామాల్లోకి వాహనం ద్వారా వెళ్లే అవకాశం లేకపోవడంతో డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌తో పాటు మండల ప్రత్యేకాధికారి బి.రాజగోపాల్‌, ఏవో వై.వాహిని ట్రాక్టర్‌పై పర్యటించారు. అన్నవరం, అంపిలి సర్పంచ్‌లు గవర బుజ్జిబాబు, లోలుగు విశ్వేశ్వరరావు, ఎంపీటీసీ వాకమూడి అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆయా గ్రామాల ప్రజలకు నదీతీరానికి వెళ్లవద్దని సూచించారు. వీరఘట్టం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎం.శ్రావణి, ఆర్‌డీవో టి.వి.ఎస్‌.జి.కుమార్‌, తహసీల్దార్‌ సోమేశ్వరరావులు పర్యటించారు. 

-  మడ్డువలస రిజర్వాయర్‌లో 11 గేట్లు ఉండగా... ఐదు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రానికి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టారు. రిజర్వాయర్‌లో 64.05 మీటర్ల నీటిని స్థిరీకరిస్తారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటిమట్టం 63 మీటర్లు ఉంది. వంగర మండలం కొప్పర, కొండచేకరాపల్లి, గీతనాపల్లి, పట్టువర్దనం, విజయనగరం జిల్లా నూకలివాడ గ్రామాలకు నీరు చేరుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

- వంశధార కాస్త తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రానికి హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద 22వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంది. అధికారులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎగువ నుంచి వచ్చిన నీటిని అంతా 22 గేట్ల ద్వారా దిగువకు విడిచిపెట్టేస్తున్నారు. గొట్టా బ్యారేజీకి 60వేల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు.  


చెరువులను త లపిస్తున్న పంట పొలాలు..

గులాబ్‌ తుఫాన్‌ వల్ల కురిసిన వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపించాయి. ఓనిగెడ్డ, కడగెడ్డ, రావాడగెడ్డ, బుక్కూరుగెడ్డ, తంపరగెడ్డ తదితర గెడ్డలు ఉగ్రరూపం దాల్చాయి. పొలాలు నీట మునగడంతో  పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. పాలకొండ మండలంలో గోపాలపురం, అన్నవరం, వడమ, తంపటాపల్లి, మంగళాపురం, బుక్కూరు, పాలకొండ, విపిరాజుపేట, తుమరాడ తదితర గ్రామాల్లో మూడు వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. వరద ప్రవాహం తగ్గకపోతే పంటలు పూర్తిగా పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-09-28T05:30:00+05:30 IST