వంట గ్యాస్‌కు రెక్కలు

ABN , First Publish Date - 2020-06-03T10:02:04+05:30 IST

కరోనా కష్టంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండరుపై ధరలను పెంచి వినియోగదారులపై గుదిబండను వేసింది. గృహావసరాల వినియోగ సిలిండరుపై రూ.54.50, వాణిజ్యం

వంట గ్యాస్‌కు రెక్కలు

  • కరోనా కష్టంలో పెరిగిన ధరలు
  • గృహావసరంపై రూ.54.. వాణిజ్యంపై రూ.109 పెంపు
  • సబ్సిడీ జమతో ఊరట


కడప (సిటీ), జూన్‌ 2: కరోనా కష్టంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండరుపై ధరలను పెంచి వినియోగదారులపై గుదిబండను వేసింది. గృహావసరాల వినియోగ సిలిండరుపై రూ.54.50, వాణిజ్యం (కమర్షియల్‌)పై రూ.109.50 పెంచి కరోనా కష్టాన్ని మరింత పెంచింది. లాక్‌డౌన్‌ కారణంగా ధరలు తగ్గిస్తారనుకుంటున్న వినియోగదారుల ఆశలపై కేంద్రం నింపాదిగా నీళ్లు చల్లింది. జిల్లాలో 8 లక్షల గృహ, 19 వేల వాణిజ్య వినియోగదారులపై భారం పడనుంది. అయితే మే నెలలో సబ్సిడీ లేకుండా నిర్ణీత ధరకే విక్రయించి ఈనెలలో కేంద్రం ఒకింత సబ్సిడీని జమ చేయనుండడం కాసింత ఊరట కలిగించనుంది. అంతర్జాతీయ మార్కెట్‌ననుసరించి పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరలను నిర్ణయిస్తుంటారు. కొంతకాలంగా కేంద్రం గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. ఆ భారం ప్రజలపై పడకుండా సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వచ్చేది.


ఒక నెల ఆలస్యంగానైనా జమ చేసేది. దీంతో వినియోగదారుడు ముందుగా బిల్లు చెల్లించినా సబ్సిడీ మొత్తం నగదు రూపంలో రావడంతో ఊపిరి పీల్చుకునేవారు. లాక్‌డౌన్‌ కారణంగా మే నెల వినియోగ సిలిండరుపై బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడానికి వీలు పడకపోవడంతో నిర్ణీత ధరనే వసూలు చేశారు. కాగా జూన్‌ 1వ తేదీ సిలిండరు ధరలను పెంచారు. ఆ పెంచిన మొత్తాన్ని కేంద్రం వినియోగదారుడికి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 


8.19 లక్షల వినియోగదారులపై ప్రభావం

జిల్లాలో 8 లక్షల మేర గృహావసర, 19 వేల వాణిజ్య కనెక్షన్‌లున్నాయి. వీరందరూ మే నెలలో గృహావసర సిలిండరును రూ.586.01లకు, వాణిజ్య అవసర సిలిండరును రూ.1139కు కొనుగోలు చేశారు. కాగా పెరిగిన ధరల కారణంగా గృహావసర సిలిండరుపై రూ.54 అదనంగా రూ.640, వాణిజ్య సిలిండరుపై రూ.109 అదనంగా రూ.1248 చెల్లించాల్సి ఉంటుంది.


అదనపు భారం రూ.4.52 కోట్లు

జిల్లాలోని 8.19 లక్షల గ్యాస్‌ కనెక్షన్లకు సంబంధించి నెలకు కనీసం ఒక సిలిండరు వినయోగించినా వినియోగదారులపై రూ.4.52 కోట్లు భారం పడుతుంది. గృహావసరాల సిలిండర్లపై రూ.4.32 కోట్లు, వాణిజ్యంపై రూ.20 లక్షలు మొత్తం రూ.4.52 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో పెరిగిన మొత్తంలో కొంత సబ్సిడీగా కేంద్రం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 1వ తేదీ నుంచి బుక్‌ చేసుకుని డెలివరీ తీసుకున్న వినియోగదారులు ముందుగా పెరిగిన ఛార్జీతో సహా చెల్లించాల్సిందే. అనంతరం బ్యాంకులో సబ్సిడీ  జమ అయితే కొంత ఊరటే. కాదంటే కరోనా కష్టానికి ఈ భారం తోడు కాక తప్పదు.


ధరలు పెంచడం తగదు

కరోనాతో అన్ని విధాలా ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో గ్యాస్‌ ధరలు పెంచడం తగదు. కరోనా కష్టాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఆశించాం. ఉచితం కాకుండా ఏకంగా ధరలు పెంచడం బాధాకరం. ఎప్పుడో బ్యాంకులో వేసినా ప్రస్తుత కష్టంలో ఇంత మొత్తం చెల్లించడం అదనపు భారమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్యాస్‌ను మరో 3 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలి.

ఝాన్సీరాణి, గృహిణి, కడప

Updated Date - 2020-06-03T10:02:04+05:30 IST