పత్తికి పెరిగిన ధర

ABN , First Publish Date - 2021-10-26T06:56:47+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పత్తికి పెరిగిన ధర
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో పత్తి ఏరుతున్న ఏపీ ప్రాంత కూలీలు

 డిమాండ్‌ ఉండడంతో ముందుగానే పత్తి ఏరివేత

 దిగుబడి తక్కువ ఉన్నా ధర ఉండడంతో ధైర్యం

 పత్తి ఏరేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పత్తి సాగు చేసిన రైతులను తుపానుల బెడద వెంటాడింది. దిగుబడి తగ్గినా ప్రస్తుతం డిమాండ్‌ ఉండడంతో విక్రయిస్తే రైతులు పత్తి ఏరుతున్నారు. ధర ఉన్నప్పుడే అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి వచ్చినా సంతోషం అంటున్నారు. మరో వైపు వరి సాగు చేసిన రైతుల పరిస్థితి ధైన్యంగా ఉంది. ధాన్యం క్వింటాకు ప్రభుత్వం రూ.1960 మద్దతు ధర ప్రకటిస్తే ఎక్కడా కూడా అమలు కావడంలేదు. అనేక కొర్రీలు పెడుతుండడంతో రైతులు విసుగెత్తుతున్నారు. మిల్లర్లకు అమ్ముదామంటే ఇప్పటికే మా వద్ద చాలా ధాన్యం నిల్వ ఉంది. ఏం చేసుకుంటామని చెబుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అటు విక్రయించలేక.. ఇటు ఉంచుకోలేక రైతులు సతమతమవుతున్నారు. 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు పత్తి పంట అధికంగా సాగుచేశారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా వస్తున్నా అధిక ధర ఉండడంతో రైతులకు ధైర్యం వస్తోంది.  కొన్నాళ్ల క్రితం వరుస తుపానుల బెడద.. మరో వైపు ఉన్న పత్తిని ఏరడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. వర్షాలు అధికంగా పడటంతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపింది. కనీసం పెట్టుబడి వచ్చినా సంతోషం అన్న ఆలోచనలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్‌, నూతనకల్‌, మోతె, తిరుమలగిరి, నాగారం మండలాల్లో రైతులు అధికంగా పత్తి పంట సాగు చేశారు. క్వింటా పత్తికి రూ.8వేలు పలుకుతుండటంతో రైతులకు ఊరట కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 11లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 7లక్షల35వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాకముందే మార్కెట్‌లోనే దళారులు, వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తూ జిన్నింగ్‌ మిల్లులకు అమ్ముకుంటున్నారు. సీసీఐలో మరింత ధర వస్తుందా లేక తగ్గుతుందా అనే ఆలోచనలో ఉన్న రైతులు డైలమాలో ఉన్నప్పటికీ పత్తిని విక్రయిస్తున్నారు. 


ఇతర ప్రాంతాల నుంచి కూలీలు

ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల బాట పట్టారు. నల్లగొండ మండలంలోని అప్పాజిపేటలోనే 250 కుటుంబాలుంటే 750 నుంచి 800 మంది వరకు ఉండటం విశే షం. మునుగోడు మండలంలో కూడా ఒక్కో గ్రామంలో 50 కుటుంబాల వరకు వలసలు వచ్చారు. ఒక్కో కూలీ 50 నుంచి 60 కిలోల ఏరి రోజుకు రూ.650 వరకు సంపాదిస్తున్నారు. భార్యా భర్తలకు కలిసి రూ.1300 సంపాదిస్తే అందులో కొంత ఖర్చులకు పోయినా మిగతాదంతా వారు వెనుకేసుకుంటున్నారు. కిలో పత్తి ఏరితే రూ.10 నుంచి రూ.11 వరకు చెల్లిస్తున్నారు. దీనికి తోడు రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులను కొంత మేరకు కూలీలకు చెల్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రైతులు కూలీలను తీసుకొస్తున్నారు. 10ఎకరాలకు పైబడిన రైతులు వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు కూడా పనికి కొరత లేదు. వలస కూలీలతో పాటు మూడు జిల్లాల్లోని కూలీలకు కూడా పత్తి ఏరేందుకు పనులు దొరుకుతున్నాయి. ప్రస్తుతం ఇతర పనులు లేకపోవడంతో కూలీలు పూర్తిగా ఈ పనిపైన ఆధారపడ్డారు. రైతులు కూడా ఆముదాలు, జొన్నలు, సజ్జలు వేసే పరిస్థితి లేదు. దీనికి కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కూడా వలస కూలీలు ఉండగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పత్తిని ఏరుతున్నారు. 


జనవరిలో తిరిగి సొంత ప్రాంతాలకు..

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో మిర్చి సాగవుతోంది. అక్కడ మిర్చి పంట సాగవుతున్న సమయంలో కూలీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం పత్తి ఏరుతూ ఉపాధి పొందుతున్నారు. తిరిగి వీరంతా జనవరిలో తిరిగి వలస కూలీలు ఆంధ్రా ప్రాంతాల్లోని తమ సొంత గ్రామాలకు వెళ్తారు. అక్కడ జనవరి నుంచి మార్చి, ఏప్రిల్‌ వరకు మిర్చి కోతకు పనులు దొరుకుతాయి. ఉమ్మడి జిల్లాలో పత్తి ఏరడం తిరిగి సొంత ప్రాంతానికి వెళ్లిన తర్వాత మిర్చి కోత పనుల్లో నిమగ్నమవుతారు. ఉమ్మడి జిల్లాలో పత్తి ఏరడం వల్ల తమకు ఎంతో ఉపాధి కలుగుతుందని డబ్బులు కూడా మిగులుతున్నాయని వారు పేర్కొన్నారు. 


సీజన్‌ వారీగా పనులకు వెళ్తాం: మాధవి, మహిళా కూలీ, కున్నూరు గ్రామం, కర్నూల్‌ జిల్లా

సీజన్‌ వారీగా ఆయా ప్రాంతాలకు వెళతాం.  ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలకు పనులు ముగించుకొని ఇంటికి చేరతాం. రోజంతా ఒక్కరం 50 నుంచి 60 కిలోల పత్తి ఏరుతాం. కిలోకు రూ.10 చెల్లిస్తారు. ఈ లెక్కన ఇద్దరం కలిసి 100 నుంచి 120 కిలోల పత్తి తీస్తే రూ.వెయ్యి నుంచి 1200 వస్తాయి. అందులో ఖర్చులు ఒకరి కూలికి వెళ్తే ఒక రోజు కూలి మాత్రమే మిగులుతుంది. 



వరికి ఉరి 

ఆయకట్టులో ఇంకా 15 రోజుల సమయం 

త్రిపురారం, అక్టోబరు 25: అన్నదాతకు కష్టాలు తప్పడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు.. పెరుగుతున్న పెట్టుబడులు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు లేకపోవడంతో అయోమయంలో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలు, సాగర్‌ ఆయకట్టులో 3.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. బోరు బావుల కింద జూన్‌లో వరి సాగు చేశారు. 10 రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు ప్రభుత్వం రూ.1960, బీ గ్రేడ్‌కు రూ.1949ల మద్దతు ధర ప్రకటించింది. కానీ రైతులు సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ప్రకటించిన ఒకటి రెండు రోజులే మిల్లర్లు మద్దతు ధర చెల్లించారు. రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది.. మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదేమిటని  ప్రశ్నిస్తే మా వద్ద చాలా ధాన్యం నిల్వ ఉందని, కొనుగోలు చేసి ఏం చేసుకుంటామని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతిమలాడుకుంటే  మాత్రం చూద్దామంటూ క్వింటాకు రూ.1700లే చెల్లిస్తామని చెప్పడంతో తప్పని పరిస్థితిలో అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 


తగ్గుతున్న తూకాలు

ప్రస్తుతానికి ఐదు శాతం మాత్రమే వరి కోతలు మొదలయ్యాయి. మిల్లర్లు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు.. అరకొరగా వచ్చిన  ధాన్యం ట్రాక్టర్ల దిగుమతులు కష్టంగా మారింది.. దిగుమతులు సరిగా కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పచ్చి ధాన్యం కావడంతో తేమ ఆరిపోయి ట్రాక్టర్‌కు 10 బస్తాల వరకు తరుగు వస్తుందని, తేమ తక్కువగా ఉంది.. బియ్యం నూక అవుతుందనే సాకుతో తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. 


ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఆయకట్టులో గత ఏడాది ఖరీఫ్‌ సీజనులో కొనుగోళ్లలో జాప్యంతో పాటు మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు ధాన్యం ట్రాక్టర్లతో రోజుల తరబడి రోడ్ల మీద జాగారం చేయాల్సి వచ్చింది. నిరసనల హోరూ సాగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి సామాన్య ప్రజలు 15రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటి నుంచే ప్రభుత్వం సరైన ప్రణాళికలు సిద్దం చేసి ధాన్యానికి మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


ధాన్యం మొత్తం వస్తే 

ఇప్పటి వరకు సాగర్‌ ఆయకట్టులో వరి కోతలు మొదలు కాలేదు. కేవలం ఆయకట్టు ప్రాంతాల్లోని బోరు బావుల కింద సాగు చేసిన పంట మాత్రమే వస్తోంది. 15రోజుల్లో ఆయకట్టులో ఒకేసారి పంట కోతలు ప్రారంభమమవుతాయి. లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు వస్తే కొనుగోళ్ల పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌ ఆయకట్టులో 90శాతం మేర ప్రైవేట్‌ రకాలనే సాగు చేశారు. ఈ ధాన్యం అంతా పచ్చిగా ఉన్నపుడు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఆరబెట్టడానికి అనువుగా ఉండదు. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసినా కేవలం సాంబమసూరి, దొడ్డు రకాలు మినహా కొనుగోలు చేయరు. ప్రైవేట్‌ రకాలన్నీ మిల్లర్లు కొనాల్సిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేసినా రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. 


చాలా నష్టపోయాను: ఉండి పాపిరెడ్డి, రైతు, త్రిపురారం

బోరు కింద ప్రైవేటు రకం వరి సాగు చేశా. పంట కోసిన వెంటనే ట్రాక్టర్‌లో ధాన్యం పోసుకుని మిల్లర్ల వద్దకు వెళితే కొనుగోలు చేయబోమని చెప్పారు. ప్రతి మిల్లు తిరుగుతూ మిర్యాలగూడ వెళ్లాను. అయినా కొనుగోలుకు ససేమిరా అన్నారు. ఏం చేయాలో అర్థం కాక ధాన్యం దళారిని ఆశ్రయించాను. కమీషన్‌ తీసుకుని ఓ మిల్లు వద్దకు పంపాడు. అప్పటికే ఒక రోజు దాటింది.. క్వింటాకు రూ.17వందలు ఇస్తామన్నారు. తప్పని పరిస్థితిలో అమ్ముకోవాల్సి వచ్చింది. తీరా కాంటా వేశాక, ట్రాక్టర్‌ బోరెంలో 80బస్తాలు రావాల్సి ఉండగా చాలా సమయం గడవడంతో తేమ తగ్గి 70బస్తాలు మాత్రమే లెక్కకు వచ్చింది. పది బస్తాల వరకు తరుగు పోయింది.


ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 25: వచ్చే యాసంగిలో వరికి బదులు  ప్రత్నామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఆరుతడి పంటలపై వ్యవసాయ, ఉద్యాన అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు వరికి బదులు 11రకాలైన ఆరుతడి పంటలు వేరుశెనగ, పెసలు, మినుములు, ఉలవలు, శెనగలు, బొబ్బర్లు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, ఆవాలు, కుసుమలు, నువ్వులు, ధనియాలు, పండించేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎఫ్‌సీఐ యాసంగిలో రైతులు పండించిన వరి పంటను తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే సీడ్స్‌ సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు దళారుల వద్ద సీడ్స్‌ కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పామాయిల్‌ సాగుకు ఆ సక్తి చూపే రైతులకు పంటనాగు విధానంపై అవగాహన కల్పించాలని అధికా రులను ఆదేశించారు. సమావేశంలో డీఏవో రామారావునాయక్‌, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీదర్‌గౌడ్‌, ఏడిఏలు సంధ్యారాణి, జగ్గినాయక్‌, వాసు, భరత్‌,నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T06:56:47+05:30 IST