ఎరువు.. ధరువు!

ABN , First Publish Date - 2021-10-11T04:14:53+05:30 IST

ఎరువు.. ధరువు!

ఎరువు.. ధరువు!
కాంప్లెక్స్‌ ఎరువులు

పెరిగిన పొటాష్‌, డీఏపీ, కాంప్లెక్స్‌ల ధరలు

జిల్లా రైతులపై రూ.6కోట్లకుపైగా అదనపు భారం

(ఇచ్ఛాపురం రూరల్‌/టెక్కలి)

పెట్రోల్‌, డీజిల్‌ బాటలో ఎరువుల ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో సీజన్‌కు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే ధరలు పెరిగేవి. ప్రస్తుతం ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకు, ఇంధనం, రవాణా చార్జీల భారం వల్ల ధరలు పెంచక తప్పడం లేదని సరఫరాదారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ధరలు పెరుగుతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే సాగు ఖర్చులు తడిసిమోపెడై అల్లాడుతున్న రైతులకు ఎరువుల ధరల మోత ప్రతికూలంగా మారుతోంది.  

జిల్లాలో సుమారు 5,05,528 మంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో 1,23,582 మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. వీటిలో 72,503 మెట్రిక్‌టన్నుల యూరియా, 24,155 మెట్రిక్‌టన్నుల డీఏపీ, 12,169 మెట్రిక్‌టన్నుల పొటాష్‌, 2,275 మెట్రిక్‌టన్నుల సూపర్‌, 12,400 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 67 మెట్రిక్‌టన్నుల ఇతర రకాల ఎరువులను వాడుతున్నారు. వీటిలో డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.1,200 ఉండగా.. రూ.1,700కు పెరిగింది. పొటాస్‌ రూ.1,040 నుంచి రూ.1,600కు, కాంప్లెక్స్‌ ఎరువు రూ.1,550 నుంచి రూ.1,700కు పెరిగింది. ధరల పెంపుతో జిల్లా రైతులపై సుమారు రూ.6కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.  రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పంపిణీ చేస్తోంది. అక్కడ అన్ని రకాల ఎరువులు లభ్యంకాకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. డీఏపీ ఉత్పత్తి తగ్గిందని కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు కొందరు బస్తాకు రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది. సాగుకు సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు.. అన్ని రకాల ఉత్పాదకాల ధరలు పెరగడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. సంప్రదాయంగా స్థానికంగా దొరికే పశువుల ఎరువు లభ్యత తగ్గడం, అధిక దిగుబడుల కోసమంటూ పూర్తిగా రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. యూరియా, కాంప్లెక్స్‌, పొటాష్‌ కలిపి ఎకరాకు సగటున 7 బస్తాల వరకు వినియోగిస్తున్నారు. ఈ మూడింటిపైనే రూ.1432 వరకు అదనపు భారం పడుతోంది. అలాగే డీఏపీ, ఎంవోసీ, ఎస్‌ఎస్‌పీ తదితర ఎరువులపై రూ.1500 వరకు అదనంగా ఖర్చవుతుంది. ఎకరాకు రూ.3వేలకుపైగా ఎరువుల కోసం ఖర్చు చేయగా.. పండిన పంటకు మాత్రం తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. 

 

ఎకరాకు రూ.1600 అదనపు ఖర్చు

ఎకరం పొలంలో వరి సాగు చేస్తున్నాను. గతంలో ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడి అయ్యేది. డీఏపీ, ఫాస్పేట్‌, పొటాష్‌ రేట్లు పెరగడంతో ఈ ఏడాది పెట్టుబడి మరో రూ.1600 పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట చేతికొచ్చేవరకు గ్యారంటీ లేదు. వచ్చినా ధాన్యం రేట్లు పెరగడం లేదు.

- దున్న సోమేష్‌, రైతు, ఇచ్ఛాపురం


ప్రభుత్వాలు ఆలోచించాలి 

ఎరువుల ధరలు పెరుగుతున్నా కొనుగోలు చేయక తప్పడం లేదు. ఈ సీజన్‌లో కాంప్లెక్స్‌ ఎరువుల ధర బస్తాకు రూ.300కు పైగా పెరిగింది. ఇంత మొత్తంలో ధర ఒకేసారి పెరగడంతో పెట్టుబడులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులను ఆలోచించి ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉంది. 

- బి.క్రిష్ణారావు, రైతు, ఇచ్ఛాపురం


 ధరలు ఇలా (బస్తాకు రూ.)

ఎరువు         మార్చి        సెప్టెంబరు  అక్టోబరు

20- 20       రూ.950        1,225 1300

14- 35       రూ. 1.275     రూ. 1,550 1800

28- 28       రూ. 1,275     రూ. 1,550 1700

10 - 26      రూ. 1,175     రూ. 1,475 1650

పొటాస్‌       రూ. 875      రూ. 1,015 1600

 

Updated Date - 2021-10-11T04:14:53+05:30 IST