సర్కారు బడులు కళకళ!

ABN , First Publish Date - 2021-10-25T05:01:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సుమారు 15నెలల పాటు మూసి ఉన్న పాఠశాలల ఎట్టకేలకు పునఃప్రారంభయ్యాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగా.. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం పాఠశాలలను ఇంకా ప్రారంభించలేదు.

సర్కారు బడులు కళకళ!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య

20వేల వరకు విద్యార్థుల పెరుగుదల

కరోనా ప్రభావంతో సర్కారు బడులకే పంపిస్తున్న తల్లిదండ్రులు 

విద్యార్థుల సంఖ్య పెరిగినా.. పాఠశాలల్లో తీరని సమస్యలు 

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

రెన్యూవల్‌కూ నోచుకోని విద్యావలంటీర్లు 

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 24: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సుమారు 15నెలల పాటు మూసి ఉన్న పాఠశాలల ఎట్టకేలకు పునఃప్రారంభయ్యాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగా.. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం పాఠశాలలను ఇంకా ప్రారంభించలేదు. కరోనా థర్డ్‌ వేవ్‌ భయం కారణంగా ప్రైవేటు పాఠశాలలు తరగతులను ప్రా రంభించేందుకు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిం ది. 2020-21 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 1,156 ప్రభు త్వ పాఠశాలల్లో 95 వేల మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య లక్షా 15వేలకు పెరిగింది. కరోనా భయంతో పిల్లలను ఇతర ప్రాంతాల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించారు. అంతేకాకుండా కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురైన తల్లిదండ్రులు సైతం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. గురుకులాల ప్రారంభానికి సైతం హైకోర్టు అనుమతినివ్వడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య

జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. గత విద్యాసంవత్సరం కంటే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత విద్యాసంవత్సరం 95,572 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవగా.. ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు లక్షా 12వేల 240 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాలు ప్రారంభం కాకపోవడంతో కొంత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, వారం రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో గత విద్యాసంవత్సరం కంటే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 20వేలకు మించే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా నగర శివారులోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో 1,352 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఏ పాఠశాలలో లేనంత మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. చుట్టుపక్కల హాస్టళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో గత సంవత్సరంకంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజుల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

హైస్కూళ్లలో బాడీ ్స టాప్‌

జిల్లాలోని మోపాల్‌ మండలం బాడ్సీ ఉన్నత పాఠశాలలో గత విద్యాసంవత్సరం 122 మంది విద్యార్థులు ఉండగా  ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 218కి చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ రాంపూర్‌లో గత విద్యాసంవత్సరం 302 మంది విద్యార్థులు ఉండగా.. ఈ సంవత్సరం వారి సంఖ్య 371కి చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ నల్లవెల్లిలో గత సంవత్సరం 211 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 274కు చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ పోతంగల్‌లో గత విద్యాసంవత్సరం 350 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ సంవత్సరం 410కి చేరింది. నిజామాబాద్‌ మండలం జడ్పీహెచ్‌ఎస్‌ సారంగపూర్‌లో గత విద్యాసంవత్సరం 191 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ సంవత్సరం 260కి చేరింది. 

ప్రాథమిక పాఠశాలల్లో బోర్గాం(పి) టాప్‌

ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోపాల్‌ మండలం బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం 199 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 322కు చేరింది. నవీపేట మండలం నాళేశ్వర్‌ ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం 140 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 246కు చేరింది. ప్రాథమిక పాఠశాల వేల్పూర్‌లో గత విద్యాసంవత్సరం 102 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ విద్యాసంవత్సరం 239కి చేరింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సిద్దాపూర్‌ పాఠశాలలో గత విద్యాసంవత్సరం 106 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 198కి చేరింది. సాటాపూర్‌ తెలుగు మీడియం పాఠశాలలో గత విద్యాసంవత్సరం 163 మంది  విద్యార్థులు ఉండగా.. వారి సంఖ్య ఈ సంవత్సరం 250కి పెరిగింది. 

వేధిస్తున్న సమస్యలు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందనే అంశం ఒకవైపు సంతోషం కలిగిస్తుండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, విద్యావలంటీర్ల కొనసాగింపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాలు కలవరపెడుతున్నాయి. జిల్లాలో దాదాపు 500ల ఉపాధ్యా య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో గతంలో నియమించిన విద్యా వలంటీర్లను ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోవడంతో తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,100ల మంది విద్యావలంటీర్లు పనిచేశారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా వారిని రెన్యూవల్‌ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులను వచ్చే విద్యాసంవత్సరం కూడా కొనసాగించే విషయంలో స్పష్టతలేదు. ఒకే టీచర్‌ పనిచేస్తున్న చోట విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండగా.. వారు పాఠశాలకురాని రోజు పాఠశాల నిర్వహన ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉపాధ్యాయులు లేని సమయంలో వారి కొరతను తీర్చే విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేస్తే ఆ సమస్య తీరే అవకాశం ఉంది. అనేకచోట్ల తాగునీటితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాల విషయం లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సమస్యలు పరిష్కరిస్తాం..

- దుర్గాప్రసాద్‌, డీఈవో

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక పాఠశాలల్లో పరిమితి కి మించి విద్యార్థుల సంఖ్య పెరగడం సంతోషకరం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కుంటున్నాం. విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. కానీ, జిల్లాలో ఎక్కడెక్కడ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందో అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉపా ధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నాం. జిల్లాలో ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2021-10-25T05:01:23+05:30 IST