కరోనాతో విలవిల..‘ప్రైవేటు’కు గలగల

ABN , First Publish Date - 2020-07-11T11:00:23+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రాణాలొడ్డి కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటే ప్రైవేటు ఆసుపత్రులు కరోనా సాకు చూపి ప్రజలను

కరోనాతో విలవిల..‘ప్రైవేటు’కు గలగల

అమాంతం పెరిగిన వైద్య ఖర్చులు

కన్సెల్టింగ్‌ ఫీజు నుంచి శస్త్రచికిత్సల దాకా రెట్టింపు

శానిటైజర్లు, గ్లౌజులు, పీపీఈ కిట్ల భారమంతా రోగులపైనే

విలవిల్లాడిపోతున్న సామాన్యులు 


గోపాల్‌ కుమార్తెకు డెలివరీ డేట్‌ సమీపించింది. వెంటనే నెల్లూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. సిజేరియన్‌ చేయాలి.. రూ.60వేలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మరీ అంతా అని అంటే.. ఏం చేద్దాం కరోనా కదా.. అంతా రిస్క్‌తో చేయాలి. అని ఆసుపత్రి సిబ్బంది బదులిచ్చారు.

రామచంద్ర కుమార్తెకు అపెండిసైటిస్‌. వెంటనే శస్త్రచకిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకు ఆపరేషన్‌ కోసమే రూ.25వేలు అవుతుందని చెప్పారు. 

ఇవే కాదు.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత తెరుచుకున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు అందినకాడికి దండేస్తున్నాయి. రిస్కీ ఫీజు కింద  దోపిడీకి తెరలేపాయి. కరోనాకు ముందు, ఇప్పుడు  ఫీజుల ధర గమనిస్తే సగటు మనిషికి గుండె ఆగిపోయే పని జరుగుతుంది. వైద్యుల కన్సెల్టింగ్‌ ఫీజు నుంచి రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, శస్త్రచికిత్సలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల ఫీజులు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. కరోనా కాలంలో డాక్టర్లు రిస్క్‌ తీసుకొని ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు కాబట్టి ఈమాత్రం ఫీజులు పెంచక తప్పదని కొందరంటే, కరోనా సోకకుండా ఆసుపత్రి శ్యానిటైజేషన్‌, సిబ్బందికి మాస్కులు, డాక్టర్లకు పీపీఈ కిట్లు.. ఇవన్నీ ఉండాలి కాబట్టి ఫీజుల ధర పెంచక తప్పదని మరికొందరు అంటున్నారు. ఇక కరోనా భయంతో చిన్న చితక జబ్బులకు ప్రజలు ఆసుపత్రులకు రావడం మానేశారు. ఈ క్రమంలో రోగుల సంఖ్య తగ్గింది. ఈ లోటును కూడా విధిలేక వచ్చిన వారిని పిండేయడం ద్వారా పూడ్చుకొంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. 


నెల్లూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి) :ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రాణాలొడ్డి కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటే ప్రైవేటు ఆసుపత్రులు కరోనా సాకు చూపి ప్రజలను పిండేస్తున్నాయి. లాక్‌ డౌన్‌ కారణంగా సుమారు రెండున్నర నెలల పాటు మూతపడిన ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికా అన్నట్లు భారీగా దండుకొంటున్నాయి. డాక్టర్‌ కన్సెల్టింగ్‌ ఫీజు నుంచి అన్ని రేట్లు గణనీయంగా పెంచేశాయి. కరోనాకు ముందు డాక్టర్‌ కన్సెల్టింగ్‌ ఫీజు రూ.200. ప్పుడు 300 అయ్యింది. స్పెషాలిటీ ఓపీ (గుండె, మూత్రపిండాలు ఇలా) కరోనాకు ముందు రూ.500. ఇప్పుడు 750కి పెంచేశారు.


ఓపీ రేట్లు ఎందుకిలా పెంచేశారని ప్రశ్నలకు ఆసుపత్రి వర్గాలు చెప్పే సమాధానం  ‘‘కరోనా కదా, డాక్టర్‌ కొద్ది మందినే చూస్తున్నారు..’’ అని కొందరు చెబితే.. ‘‘కరోనా కదా.. డాక్టర్‌ రిస్క్‌ తీసుకొని రోగులను చూస్తున్నారు, అంత రిస్క్‌ తీసుకున్నప్పుడు ఈమాత్రం ఫీజు పెంచితే తప్పేమిట’’ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిబ్బంది వాదిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులను చూసి ల్యాబ్‌ నిర్వాహకులూ ధరలు పెంచేశారు. రక్తపరీక్షలు, ఎక్సరేలు, స్కానింగ్‌లు, అలా్ట్రసౌండ్‌ ఇలా అన్ని రకాల టెస్టుల ఫీజులు పెరిగిపోయాయి. కరోనా ముందు వరకు ఎక్స్‌రేకి రూ.300 తీసుకునే వారు. ఇప్పుడు రూ.500. సిటీ, ఎంఆర్‌ఐ స్కాన్ల రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. శస్త్రచికిత్స ధర రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పెరిగిపోయాయి. ఉదాహరణకు 24 గంటల కడుపునొప్పి(అపెండిసైటిస్‌) ఆపరేషన్‌కు కరోనా ముందు వరకు 15వేలు ఫీజు. ఇప్పుడు రూ.25వేలు. ఇక ప్రసూతి ఖర్చులు చెప్పాల్సిన పనిలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు చేసే పరిస్థితి లేదు. అన్ని సిజేరియన్‌లే. కరోనాకు ముందు సిజేరియన్‌ రేటు 23 నుంచి 25వేల రూపాయలు. ఇప్పుడు 35వేలు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అయితే 60 నుంచి 70 వేలు కూడా బిల్లు చేస్తున్నారు. 


రిస్క్‌ పేరుతో...

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు పెంచడానికి చెబుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి రిస్క్‌. డాక్టర్లు, సిబ్బందికి కరోనా రిస్క్‌ ఉంది కాబట్టి, జాగ్రత్తల కోసం అదనపు రేట్లు వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేసే డాక్టర్లు ఫీజు రేటు పెంచారంటున్నారు. ఆపరేషన్ల సందర్భంగా రెండు, మూడు పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుందంటున్నారు. ఓపీ చూసే సమయంలో కూడా రోజుకు రెండు కిట్లు మార్చాల్సి ఉంటుందంటున్నారు. ఇక వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, చివరకు శానిటైజర్లకు కూడా రోగుల నుంచే బిల్లులు వసూళ్లు చేసే ఆసుపత్రులు లేకపోలేదు. ఇప్పుడు కూడా కరోనాకు ముందు రేట్లనే వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు లేకపోలేదు. అయితే వీటి సంఖ్య నామమాత్రమే. ఆసుపత్రి పెద్దది అయ్యే సరికి దోపిడీ కూడా అదేస్థాయిలో పెరిగిపోతోంది. 


ఆరోగ్యశ్రీకి దిక్కులేదు

కరోనా ప్రభావంతో ఆరోగ్యశ్రీ పథకానికి గ్రహణం చుట్టుకుంది. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉండే రోగులంటే ప్రైవేటు ఆసుపత్రులకు మహాప్రీతి. వారి వద్ద డబ్బులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం చెల్లిస్తుంది అనే ధీమా. అయితే ఇప్పుడు ఆ పథకం కింద ఆపరేషన్లు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన రేటే వస్తుంది కాబట్టి ఈ జబ్బుకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించదు అని తెగేసి చెప్పేస్తున్నారు. ఒకవేళ రోగి తాలూకు అటెండర్లు వర్తిస్తుందని వాదించిన, ఆరోగ్యశ్రీ నుంచి అనుమతి వచ్చే వరకు ఆపరేషన్‌ చేయకుండా ఆగితే ప్రాణాలకే ప్రమాదం, ఆ తరువాత మీ ఇష్టం అంటు భయపెట్టి డబ్బులు గుంజుకొంటున్నారు. 


వైద్య శాఖ ఏం చేస్తోంది!?

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. పరీక్షలు, ఆపరేషన్లు, స్కాన్లు.. ఇలా అన్నింటికి ప్రభుత్వం ఒక  నిర్ధిష్టమైన ధర నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రులు దీనినే అనుసరించాలి. ప్రతి ఆసుపత్రి వద్ద ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇవేవి జరగడం లేదు. అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. కరోనా సీజన్‌ మొదలైన నాటి నుంచి కేవలం ఆ కేసుల గణాంకాలకు మాత్రమే ఈ శాఖ పరిమితం అయ్యిందనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఉపాధి కరువై అల్లాడుతున్న ప్రజలను ప్రైవేటు దోపీడీ నుంచి కాపాడాల్సి ఉంది. 

Updated Date - 2020-07-11T11:00:23+05:30 IST