Abn logo
Jul 21 2021 @ 23:43PM

పెరిగిన భూముల విలువలు

- రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 నుంచి 7.5 శాతానికి పెంపు

- జిల్లాలో 30-50 శాతం పెరిగిన భూముల విలువలు

- నేటి నుంచి పెరిగిన రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు

(ఆంద్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచింది. దీంతో ప్రజలపై తీరని భారం పడనుండగా, ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనున్నది. ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి రెండు రెట్లకు పైగా ఆదాయం రానున్నది. వ్యవసాయ భూములను 50 శాతానికి, వ్యవసాయేత్ర భూముల విలువలను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను పెంచారు. జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, అత్యధికంగా రిజిస్ట్రేషన్లు పెద్దపల్లి కార్యాలయం పరిధిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2013 తర్వాత ప్రభుత్వం భూముల విలువలను పెంచడం గమనార్హం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మండల తహసిల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. 

పెరుగుదల ఇలా..

జిల్లాలో వ్యవసాయ భూముల విలువలు ఎకరానికి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు స్లాబుల్లో గతంలో గజానికి 1500 ఉన్న భూమి విలువ 2250 రూపాయలు, 3000 ఉన్న భూమి విలువ 4250 రూపాయలు, 6000 ఉన్న భూమి విలువ 8 వేల రూపాయలు, 10వేలు ఉన్న భూమి విలువ 13 వేల రూపాయలకు పెంచారు. రంగంపల్లిలో గజానికి 1000 ఉండగా 1500 రూపాయలకు, పెద్దబొంకూర్‌, పెద్దకల్వల గ్రామాల్లో గజానికి 500ఉన్న భూమి 800 రూపాయలకు, ఇతర గ్రామాల్లో గజానికి 300 ఉన్న భూమి 500 రూపాయలకు పెంచారు. అపార్డ్‌మెంట్‌ ప్లాట్లను 700 నుంచి 1100 రూపాయలకు పెంచారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 7 స్లాబుల్లో భూముల విలువలు ఉన్నాయి. గజానికి 3000 ఉన్న భూమి 4250 రూపాయలకు, 4000 ఉన్న భూమి 5750 రూపాయలకు, 6000 ఉన్న భూమి 8000 రూపాయలకు, 8000 ఉన్న భూమి 11,250 రూపాయలకు, 15000 ఉన్న భూమి 19,250 రూపాయలకు, 20000 ఉన్న భూమి 25000 రూపాయలకు, 22000 ఉన్న భూమిని 28750 రూపాయలకు పెంచారు. అపార్ట్‌మెంట్ల కాంపొజిట్‌ ఫీజును 1000 నుంచి 1500 రూపాయలకు పెంచారు. 

మున్సిపాలిటీల్లో కూడా..

మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలో కూడా దాదాపు ఇదే స్థాయిలో భూముల ధరలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. తక్కువ విలువగల భూముల విలువలను 50 శాతం వరకు, మధ్యస్తంగా ఉన్న భూముల విలువలను 40 శాతానికి, ఎక్కువ మొత్తం విలువ ఉన్న భూముల విలువలను 30 శాతానికి పెంచారు. పెంచిన భూముల విలువల ప్రకారం గురువారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ధరణి వెబ్‌సైట్‌, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌ కూడా నిలిచిపోయింది. గురువారం నుంచి తెరుచుకోనున్నది. ఇప్పటివరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాళ్లు కూడా పెరిగిన ధరలను అనుసరించే రిజిస్ట్రేషన్‌ చార్జీలను వసూలు చేయనున్నారు.