పెరిగిన ఇంటి అద్దెలు

ABN , First Publish Date - 2022-04-06T06:09:15+05:30 IST

నంద్యాల జిల్లా కేంద్రం కావడమే ఆలస్యం..

పెరిగిన ఇంటి అద్దెలు

కొత్త జిల్లా కేంద్రంలో పెరిగిన బాడుగలు

నంద్యాలలో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు


నంద్యాల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కేంద్రం కావడమే ఆలస్యం.. ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. పట్టణంలో జిల్లా కార్యాలయాలకు ఇండ్లు అద్దెకు తీసుకుంటున్నారు. అధికారులు, ఉద్యోగులు ఉండేందుకు అద్దె ఇండ్లు కావాలి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం పల్లెల నుంచి నంద్యాలకు వచ్చేవారు ఎలాగూ ఉంటారు. ఇండ్లు తక్కువగా ఉండటంతో డిమాండ్‌ పెరిగి అద్దెలు పెంచేశారు. జిల్లా కేంద్రం అయ్యాక ఈ రెండు రోజుల్లోనే ఇంటి అద్దెలు 20 నుంచి 40 శాతం పెరిగాయి. అన్ని సౌకర్యాలతో ప్రధాన రహదారికి దగ్గరగా ఉండే ఇళ్లకు కనీసం రూ.10 వేలు అద్దె ఇవ్వాల్సి వస్తోంది. సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లు రూ.5 వేలకు పైమాటే! 


 అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

పట్టణంలో పద్మావతి నగర్‌, ఎస్‌బీఐ కాలనీ, బాలాజీ కాంప్లెక్స్‌, ఎన్జీవోస్‌ కాలనీల్లో అద్దెలు ఎక్కువని అంటారు. దేనికంటే ఈ ప్రాంతాలు పట్టణ నడిబొడ్డున ఉన్నా యి. ఇక్కడ ప్రధానంగా పెద్ద ఉద్యోగులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ధనవం తులు ఉంటారు. ఇక బస్టాండ్‌ వైపు గాంధీచౌక్‌, బయటిపేట, పెద్దబండ, తెలుగు పేట ప్రాంతాలు స్లమ్స్‌ కిందికి వస్తాయి. ఇక్కడ ఇంటి అద్దెలు పెరిగాయి. 


రెట్టింపైన అద్దెలు..


నంద్యాల జిల్లా ప్రకటన రాగానే భూముల ధరలు రూ. కోట్లకు చేరాయి. ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. జిల్లా కేంద్రం అయ్యాక పట్టణం మధ్యలో డబల్‌ బెడ్‌ రూం ఇల్లు రూ.6-7 వేలు పెట్టినా దొరకడం లేదు. అదనంగా కరెంటు బిల్లు, నీటి పన్ను, నిర్వహణ ఖర్చు ఉండేదే. ఫ్యామిలీల సంగతి అలా ఉంచితే బ్యాచిలర్స్‌కు ఇళ్లు దొరకడం కష్టమవుతోంది. నంద్యాలలో ఎక్కువగా కోచింగ్‌ సెంటర్లు ఉండడంతో చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచే కాక పక్క జిల్లాల నుంచి కూడా బ్యాచిలర్స్‌ వస్తుంటారు. జిల్లా కావడంతో పెరిగిన ఇంటి అద్దెలతో వారు కూడా ఇబ్బందిపడుతున్నారు. 

శివారు కాలనీలకూ పెరుగుతున్న డిమాండ్‌..

పట్టణంలోని ప్రధాన వీధుల్లో అద్దెలుపెరగడంతో చాలా మంది శివారు కాలనీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడా ఇండ్ల అద్దెలు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని గోదాములను ఇపుడు ఇళ్లుగా మార్చేసి అద్దెలకు ఇస్తున్నారు. పట్టణానికి కాస్త దూరమైనా అద్దె తక్కువ, ప్రశాంతంగా ఉంటుందనుకున్న పేద, మధ్య తరగతి ప్రజలకు అక్కడా చుక్కెదురవుతోంది. 

Updated Date - 2022-04-06T06:09:15+05:30 IST