ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-12T22:19:58+05:30 IST

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 20,87,879కు కరోనా కేసులు చేరాయి. రాష్ట్రంలో కరోనాతో 14,500 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 10,119 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 20,63,255 మంది కోలుకున్నారు. శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీని స్వభావం రీత్యా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పాజిటివ్‌లలో 95% లక్షణాలు లేనివారేనని, వీరితోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 


మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామన్న ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గింది. 24 గంటల వ్యవధిలోనే కర్ఫ్యూ నిబంధనల జీవోను రెండుసార్లు మార్చింది. తొలుత మంగళవారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మంగళవారం ఉదయం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. సాయంత్రానికి నిర్ణయం మార్చుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి తర్వాత 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు పేర్కొంది.

Updated Date - 2022-01-12T22:19:58+05:30 IST