పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-03T06:46:17+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి
హుశేనాపురంలో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌
టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

ఓర్వకల్లు, జూలై 2: వైసీపీ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మల్లెల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో హుశేనాపురం గ్రామ గడివేముల బస్‌ స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు. పెంచిన  చార్జీలు తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా రాజశేఖర్‌ మా ట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు సార్లు ఆర్టీసీ చార్జీలను పెంచేసి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు. తాను ఓర్వకల్లులో పెరిగిన బస్సు చార్జీలకు నిరసనగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే.. ఓ అధికారి అనుమతించకపోవడమే కాకుండా అర్ధరాత్రి తన ఇంటికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు బస్సు యాత్రలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాలో జనసంచారం ఉండే ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టి ప్రజలను, వాహనదారులను ఇబ్బందులు పెట్టేవిధంగా చేస్తే.. పోలీసులు వారికి అనుమతులు ఇచ్చారని.. తాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు రాము, మధు, సుధాకర్‌, రామగోవిందు, బజారు, నాగరాజు, అన్వ ర్‌, వేణు, నారాయణ, జయక్రిష్ణ, రవి, విక్రమ్‌ పాల్గొన్నారు.

గూడూరు:
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం గూడూరు పట్టణంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఈసమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు, టీడీపీ నాయకులు నాగప్ప యాదవ్‌, వడ్డే నాగేష్‌, సులేమాన్‌ పాల్గొన్నారు.

వామపక్షాల ఆధ్వర్యంలో..

కర్నూలు(రూరల్‌): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు కొత్తబస్టాండ్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై వేసిన రూ.500కోట్ల భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ డీజిల్‌పై సెస్‌ పెంచితే దానికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్‌ భారం వేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వామపక్షపార్టీల నాయకులు రాముడు, రామకృష్ణారెడ్డి, గౌస్‌దేశాయ్‌, నరసింహులు, నాగన్న, రాధాకృష్ణ, గురుశేఖర్‌ పాల్గొన్నారు.

కోడుమూరు:
పెంచిన బస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వ ర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. స్థానిక కోట్ల సర్కిల్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు రాముడు, రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గడిచిన రెండు నెలల్లో రెండు సార్లు బస్‌ చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిత్యావసర వస్తువులు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచడం వలన సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాల పేరుతో గోరంత పంచిపెట్టి పన్నులు రూపం లో ప్రజల నుంచి కొండంత దోచుకొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మునుస్వామి, మద్దిలేటి, ఏడుకొండలు, నాగరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T06:46:17+05:30 IST