Abn logo
Sep 24 2021 @ 23:42PM

పెరిగిన ఎండుమిర్చి ధరలు

హిందూపురం మార్కెట్‌కు వచ్చిన మిర్చి

క్వింటాల్‌పై రూ.వెయ్యి పెరుగుదల

హిందూపురం, సెప్టెంబరు 24: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిర్చి కొనుగోళ్లలో కాస్తా ఘాటెక్కింది. గత మార్కెట్‌ కంటే శుక్రవారం క్వింటాల్‌పై రూ. 500నుంచి 1000 వరకు అధికంగా ధరలు పలికాయి. ఈనేపథ్యంలో మార్కెట్‌కు పంటను తీసుకువచ్చిన రైతులకు కాస్తా ఊరట లభించింది. మూడు రోజుల కిందట మార్కెట్‌లో క్వింటాల్‌పై రూ. 3000 ధరలు తగ్గుదలతో రైతులు మార్కెట్‌కు తాళం వేసి రోడ్డుపై నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులు ఆందోళనకు దిగివచ్చిన ట్రేడర్స్‌ ధర కొంత ధరల పెంచి కొనుగోళ్లు చేశారు. శుక్రవారం మార్కెట్‌కు 279 క్వింటాళ్ల మిర్చి రాగా ట్రేడర్స్‌ రైతుల నుంచి ఉదయం పదిన్నర లోపే పంటను కొనుగోళ్లు చేశారు. మార్కెట్‌లో కనిష్టంగా క్వింటాల్‌ రూ. 4500, గరిష్టంగా రూ. 12000, సగటున రూ. 5000 ధరల పలికాయి. ఇందులో అత్యధిక పంట క్వింటాల్‌ రూ.9000 నుంచి రూ. 10500 మధ్య పలికింది. అయినా మార్కెట్‌కు వచ్చిన రైతులు నిరాశచెందారు. పంట ఉత్పత్తులు దిగుబడి రావడంపై ధరలు ఆధారపడి ఉంటాయని మూడు రోజుల కిందట మార్కెట్‌ కంటే శుక్రవారం క్వింటాల్‌పై రూ. 1000 వరకు పెరిగిందని ట్రేడర్స్‌ వర్గాలు వెల్లడించాయి.