Abn logo
Jun 24 2020 @ 01:09AM

కరోనా కాలంలోనూ కాసుల పంట!

నాలుగు నెలల్లో 25ు పెరిగిన వ్యాక్సిన్‌ కింగ్‌ వ్యక్తిగత సంపద 

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో  86వ స్థానానికి సైరస్‌ పూనావాలా

57 స్థానాలు ఎగబాకిన ర్యాంకింగ్‌ 

శరవేగంగా తగ్గి, పెరిగిన అంబానీ ఆస్తి 

కుబేర జాబితాలో 8వ స్థానానికి జంప్‌


ముంబై: కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కార్పొరేట్‌ ప్రముఖుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వ్యాక్సి న్‌ కింగ్‌గా పేరున్న డాక్టర్‌ సైరస్‌ ఎస్‌ పూనావాలాకు మాత్రం ఈ సంక్షోభ కాలం బాగా కలిసివచ్చింది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ అయిన పూనావాలా ఆస్తి.. మే 31తో ముగిసిన నాలుగు నెలల్లో 25 శాతం పెరిగిందని హురున్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.


హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 86వ స్థానానికి ఎగబాకారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన ‘గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2020’తో పోలిస్తే నాలుగు నెలల్లో పూనావాలా ర్యాంకింగ్‌ ఏకంగా 57 స్థానాలు మెరుగుపడిందని హురున్‌ తెలిపింది. పుణెలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ. వ్యాక్సిన్ల తయారీ, సరఫరా సామర్థ్యం సంపద పెరుగుదలకు దోహదపడిందని హురున్‌ పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్‌  యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ 100 కోట్ల డోసుల ఉత్పత్తి కోసం ఈవ ుధ్యనే ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 


భారత్‌లో ఇప్పటికీ ముకేశే నెంబర్‌ వన్‌ 


దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఇప్పటికీ ముకేశ్‌ అంబానీదే అగ్రస్థానం. కరోనా దెబ్బకు శరవేగంగా పతనమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మ న్‌ ఆస్తి.. మళ్లీ అంతే వేగంతో పెరిగింది.  ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టా క్‌ మార్కెట్లు కుప్పకూలడంతో రిలయన్స్‌ షేరు భారీగా పతనమైంది. తత్ఫలితంగా అంబానీ ఆస్తి కూడా భారీగానే ఆవిరైంది. అయితే, జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి గ్లోబల్‌ దిగ్గజాల పెట్టుబడులు,  రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ రిలయన్స్‌కు బాగా కలిసివచ్చింది. దాంతో అంబానీ సంపద నేలను తాకిన బంతిలా రివ్వున ఎగిసింది. ఏప్రిల్‌, మే నెలల్లో 1,800 కోట్ల డాలర్ల మేర పుంజుకుంది. ఈ కష్టకాలంలో అంబానీ నెట్‌వర్త్‌ ‘వీ’ (ఆంగ్ల అక్షరం) షేప్‌ రికవరీని చూసిందని హురున్‌ పేర్కొంది. అయితే, మే చివరి నాటికి ముకేశ్‌ ఆస్తి.. ప్రీ-కొవిడ్‌ స్థాయితో పోలిస్తే 1 శా తం తక్కువే. అయినప్పటికీ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆయన 8వ స్థానానికి ఎగబాకారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే మెట్టు పైకెక్కారు. మరిన్ని ముఖ్యాంశాలు.. 

 ప్రపంచ టాప్‌-10 కుబేరుల్లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముకేశ్‌ అంబానీ. టాప్‌-100లోని ఇతర భారతీయ ధనవంతులతో పోలిస్తే అంబానీ ఆస్తి తరుగుదల చాలా తక్కువే 


హురున్‌ గ్లోబల్‌ టాప్‌-100 రిచ్‌ లిస్ట్‌లో నలుగురు భారతీయులకు (ముకేశ్‌ అంబానీ, సైరస్‌ పూనా వాలా, గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌) చోటు దక్కింది


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ చైర్మన్‌ శివ్‌ నాడార్‌ సంపద 6 శాతం మేర తగ్గి 1,600 కోట్ల డాలర్లకు పడిపోయింది. దాంతో ఆయన గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆయన 72వ స్థానానికి పడిపోయారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే ర్యాంకింగ్‌ 4 స్థానాలు దిగజారింది 


 అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సంపద 18 శాతం క్షీణించి 1,400 డాలర్లకు పడిపోయింది. రిచ్‌ లిస్ట్‌ ర్యాంకింగ్‌లో 27 స్థానాలు జారి 95వ స్థానానికి పరిమితమయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement