చలికాలం... బరువుతో జాగ్రత్త

ABN , First Publish Date - 2020-12-18T17:24:04+05:30 IST

చలికాలంలో చాలామంది తమకు తెలియకుండానే బరువు పెరుగుతారు. చలిలో నడక, వ్యాయామం చేయకపోవడం... ఇంట్లోనే కూర్చుని తినడం వల్ల బరువు పెరగడం సహజం

చలికాలం... బరువుతో జాగ్రత్త

ఆంధ్రజ్యోతి(18-12-2020)

చలికాలంలో చాలామంది తమకు తెలియకుండానే బరువు పెరుగుతారు. చలిలో నడక, వ్యాయామం చేయకపోవడం... ఇంట్లోనే కూర్చుని తినడం వల్ల బరువు పెరగడం సహజం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే ఈ ఉపద్రవం నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.

సాధారణంగా చలికాలం బెడ్‌ దిగాలంటే బద్ధకం ఆవహిస్తుంది. బెడ్‌ మీదే దుప్పటి కప్పుకుని మరీ టిఫిన్లు, స్నాక్స్‌ లాగిస్తుంటారు. అన్ని అవయవాలు నిద్రాణస్థితిలోనే ఉంటాయి. మిగతా కాలంతో పోల్చితే చలికాలం ప్రతీరోజూ 200 కేలరీలు అధికంగా తింటారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే తిండి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి.

చలికాలం పగటి సమయం బాగా తగ్గిపోతుంది. శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల నిద్రకు సంబంధించిన పీనియల్‌ గ్రంథి స్థాయి దెబ్బ తింటుంది. ఈ గ్రంథి మెలటోనిన్‌ హార్మన్‌ను విడుదల చేయకుంటే నిద్రమత్తులోనే ఉండిపోతాం. అలాంటప్పుడు బరువు పెరుగుతారు.

చలికి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా ఉంచడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేందుకు మెటబాలిజం పెరుగుతుంది. అధిక శక్తి కోసం తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. 

చలికాలం చక్కెర స్థానంలో చాకోలెట్‌ బార్‌ లేదంటే ఫైబర్‌తో కూడిన డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే మంచిది. ఒమేగా3 ఉన్న పదార్థాలు తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

చలిలో ఉదయమే బయటకు వెళ్లాలంటే కష్టమే. అలాగని వ్యాయామం పూర్తిగా మానేసినా ప్రమాదం. ఇంట్లో రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామానికి తప్పక కేటాయించాలి. కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు, వర్కవుట్స్‌ చేస్తే ఇంకా ఉత్సాహం కలుగుతుంది. 

Updated Date - 2020-12-18T17:24:04+05:30 IST