ఉపాధి కూలీల వేతనాలు పెంచాలి : జూలకంటి

ABN , First Publish Date - 2022-07-01T06:36:05+05:30 IST

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం వేతనాలను పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

ఉపాధి కూలీల వేతనాలు పెంచాలి : జూలకంటి
కూలీలతో కలిసి ఉపాది పనులను చేస్తున్న జూలకంటి రంగారెడ్డి.

వేములపల్లి, జూన 30: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం వేతనాలను పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మొల్కపట్నం గ్రామంలో చేపడుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నప్పుడు వారానికి ఒకసారి కొలతలు తీసుకొనేవారని అన్నారు. ప్రస్తుతం గ్రామ కార్యదర్శులకు అప్పజెప్పడం వల్ల వారు పని ఒత్తిడి కారణంగా 15 రోజులకు ఒకసారి నామమాత్రంగా కొలతలు తీసుకుంటున్నారన్నారు. గతంలో కుటుంబంలో ప్రతి మనిషికి వంద రోజులు పని కల్పించారని కానీ ప్రభుత్వం ప్రస్తుతం కుటుంబానికి మొత్తానికి కలిపి వంద రోజులు కేటాయించడం అన్యాయమన్నారు. పనిచేసే చోట కూలీలకు మంచి నీరు, టెంటు, వైద్యం వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఒకవైపు ధరలు పెంచుతున్న ప్రభుత్వాలు కూలీ రేట్లు మాత్రం పెంచకపోవడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధని, నాయకులు రెమడాల భిక్షం, వల్లమల్ల వెంకటయ్య, జానకిరాములు, ఇందిరమ్మ, కొండేటి సుజాత, లచ్చమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.



 

Updated Date - 2022-07-01T06:36:05+05:30 IST