ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు పెంచండి

ABN , First Publish Date - 2021-07-28T06:47:44+05:30 IST

వివిధ కారణాలతో కొవిడ్‌ కేసులు తిరిగి ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని, ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు పెంచాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో  వైద్య సేవలు పెంచండి

కలెక్టర్‌  


చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 27: వివిధ కారణాలతో కొవిడ్‌ కేసులు తిరిగి ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని, ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో  వైద్య సేవలు పెంచాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జూన్‌ నుంచి జూలై 27 వరకూ 6.57 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 36,522 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. మరో మూడు వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. కొన్ని మండలాల్లో ఐదు శాతానికి మించి ఎక్కువ కేసులు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో మరణాల శాతం పెరగకుండా  వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 41 పీహెచ్‌సీల పరిధిలో ఈ నెల 18-24 తేదీల మధ్య కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఒక్క రోజే 1.15 లక్షల వ్యాక్సిన్లు వేసి లక్ష్యాన్ని అందుకున్నందుకు కలెక్టర్‌ అన్ని వర్గాలకు అభినందనలు తెలిపారు. ఇటీవల ఐదు ప్రాంతాలకు పది వేల గృహాలు అదనంగా మంజూరు  అయినట్లు ఆయన తెలిపారు. వర్షాల కారణంగా 116 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదని చెప్పారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డులు మదనపల్లెలో కూలీలకు వందశాతం మంజూరు చేయడాన్ని అభినందించారు. గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం ఉన్న 84 శాతం బయోమెట్రిక్‌ హాజరును వందశాతానికి  పెంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీలు వెంకటేశ్వర్‌, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ తులసీ, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీహరి, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:47:44+05:30 IST