స్టాకు పాయింట్‌ పేరిట ఇసుకరేట్ల పెంపు

ABN , First Publish Date - 2022-09-29T05:26:23+05:30 IST

స్టాకు పాయింట్‌ పేరిట ఇసుకరేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మరింత భారమైంది.

స్టాకు పాయింట్‌ పేరిట ఇసుకరేట్ల పెంపు
తిరుత్తణి రహదారిలో చికెన్‌ ఫ్యాక్టరీ సమీపంలో స్టాక్‌ పాయింట్‌ వద్ద ట్రాక్టర్‌కు లోడ్‌ చేస్తున్న ఇసుక

గంగాధరనెల్లూరుకు ట్రాక్టర్‌ లోడ్‌ రూ. 6వేలు


తూగుండ్రంకు రూ.7వేలు


గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 28: స్టాకు పాయింట్‌ పేరిట ఇసుకరేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మరింత భారమైంది. గంగాధరనెల్లూరు మండలం ముక్కళత్తూరు పంచాయతీ ఎం.నాశంపల్లె, ఆత్మకూరు పంచాయతీ నుంచి నరసింగరాయనిపేటకు వెళ్లేచోట.. కొట్రకోన పంచాయతీ గారంపల్లె, ముకుందరాయనిపేట వద్ద గతంలో జేపీ సంస్థ ఆధ్వర్యంలో టిప్పర్లు, ట్రాక్టర్లకు ఇసుక విక్రయించేవారు. దీంతో పాటుగా వేర్వేరు ప్రాంతాల్లో స్టాక్‌ పాయింట్లను ఏర్పాటుచేసి ఇసుక డంప్‌ చేశారు. కాగా, జేపీ సంస్థకు ఆగస్టు 31వ తేదీతో ఇసుక కాంట్రాక్టు కాలపరిమితి తీరిపోయిందని సమాచారం. సెప్టెంబరు ఒకటో తేది ననుంచి ఇసుక రీచ్‌లు మూసేశారు. అయితే, అంతకుముందే చిత్తూరు మండలం తిరుత్తణి ప్రధాన రహదారి చికెన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫ్యాక్టరీ సమీపాన.. చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారి పోలినాయుడుపల్లె బస్టా్‌పనుంచి వి.లక్ష్మిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లే రోడ్డు పక్కన వేలాది లోడ్ల ఇసుకను డంప్‌ చేశారు. కొన్నిరోజలుగా చికెన్‌ఫ్యాక్టరీ సమీపంలో డంప్‌చేసిన ఇసుకను విక్రయిస్తున్నారు. అక్కడ  ట్రాక్టర్‌ ఇసుకలోడ్‌ రూ.4,700 కట్టాల్సిఉండగా, ట్రాక్టర్‌ బాడుగతో కలిపి గంగాధరనెల్లూరుకు రూ.6వేలు, తూగుండ్రం, కాళేపల్లె, సిద్దేశ్వరకొండ, బాలగంగనపల్లె, నెల్లేపల్లె  గ్రామాలకు రూ.7వేలు చొప్పున ట్రాక్టర్‌ యాజమానులు వసూలు చేస్తున్నట్లు ఇళ్ళనిర్మాణదారులు వాపోతున్నారు. స్టాక్‌ పాయింట్ల పేరిట ఇసుక ధరను పెంచడంపై వీరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ట్రాక్టర్ల యజమానులను అడిగితే.. స్టాక్‌పాయింట్‌వద్దకు ఇసుకకోసం ట్రాక్టర్‌ పంపితే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో, ఇతర ప్రైవేటు ఫైనాన్సుల వద్ద తీసుకున్న అప్పులు ఎలా చెల్లించాలని, డ్రైవర్‌కు జీతం ఇచ్చి తామేలా ఆదాయం గడించాలని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంగాధరనెల్లూరు నీవానది యేటిప్రాంతం నుంచి ట్రాక్టర్‌ ఇసుకలోడ్‌ రూ.600కే మండల కేంద్రానికి తోలగా, మండలంలో ఇతర గ్రామాలకు రూ.1,500 నుంచి రూ.2వేలకే ట్రాక్టర్‌ యాజమానులు ఇసుక తోలేవారని ఇళ్ల నిర్మాణదారులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడేమో ఇసుక ధర రూ.వేలల్లో ఉంటే ఇళ్లు ఎలా కట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-09-29T05:26:23+05:30 IST