అంగన్వాడీల్లో మెనూ చార్జీల పెంపు

ABN , First Publish Date - 2022-07-05T20:07:09+05:30 IST

అంగన్వాడీలకు ఇస్తున్న మెనూ చార్జీలపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘అంగన్వాడీలపై మెనూభారం’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం

అంగన్వాడీల్లో మెనూ చార్జీల పెంపు

ఒక్కొక్కరికీ రూ.3.27 చొప్పున పెంచుతూ.. సర్కారు సర్క్యులర్‌ జారీ

ఇతర సమస్యల పరిష్కారానికీ హామీ


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు ఇస్తున్న మెనూ చార్జీలపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘అంగన్వాడీలపై మెనూభారం’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ లబ్ధిదారులకు మెనూ చార్జీలను ఒక్కొక్కరికీ రూ.3.27 పైసలు చొప్పున పెంచింది. దీంతో లబ్ధిదారులకు ఇచ్చే చార్జీ రూ.5.77 పైసలకు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నెల 1 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసే మెనూలో ప్రభుత్వం కొత్త చార్టును తీసుకొచ్చింది. చిన్నారులకే కాకుండా బాలింతలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనం ఈ కేంద్రాల్లోనే అందించాలని పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలకు, బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు ఇస్తున్న చార్జీలతో తాము వండి పెట్టలేమని నిరసనకు దిగారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. అదే విధంగా భవనాలకు అద్దెలు సకాలంలో చెల్లంచడంలేదని, అడ్వాన్సులు ఇవ్వడంలేదని  పేర్కొంది. దీంతో సర్కారు ఈ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. చార్జీలు పెంచడమే కాకుండా అంగన్వాడీ యూనియన్‌తో మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


ఇతర అంశాలపై కూడా..

అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు స్టేషనరీ కింద ఒక్కోదానికి రూ.2 వేల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. కూరగాయలకు సంబంధించి ఒక నెల బిల్లును ముందుగానే అడ్వాన్స్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు, రిటైర్‌మెంట్‌ బినిఫిట్స్‌, పెండింగ్‌లో ఉన్న అద్దెలు వెంటనే చెల్లిస్తామని తెలిపింది. అంగన్వాడీలకు పని వత్తిడి తగ్గించడానికి 11గా ఉన్న రిజిస్టర్లను 5కి తగ్గించనుంది. అంగన్వాడీలకు ఉన్న అన్ని సమస్యలను అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌తో సోమవారం జరిగిన సమావేశంలో ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ సిరి  హామీ ఇచ్చినట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, కె. సుబ్బరావమ్మలు తెలిపారు. 

Updated Date - 2022-07-05T20:07:09+05:30 IST